ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు : సీఎం కేసీఆర్‌

Mon,July 22, 2019 01:52 PM

CM KCR speech at Chintamadaka village

హైదరాబాద్‌ : చింతమడకలోని ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు లబ్ధి పొందే పథకానికి శ్రీకారం చుడుతామని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు పేర్కొన్నారు. చింతమడకలో సీఎం కేసీఆర్‌ పర్యటన సందర్భంగా అక్కడ ఏర్పాటు చేసిన ఆత్మీయ అనురాగ సభలో కేసీఆర్‌ ప్రసంగించారు.

చాలా కాలం తర్వాత నా కోరిక నెరవేరుతుంది. రైతుబంధు, రైతుబీమా సౌకర్యం కల్పించిన రోజు చాలా సంతోషపడ్డాను. మన రాష్ట్రంలో ఆలోచించినట్లు.. దేశంలో రైతుల గురించి ఆలోచించడం లేదు. ఈ పథకాలు పేద కుటుంబాలకు అండగా ఉన్నాయి. చింతమడక చాలా మంచి ఊరు. వాస్తు కూడా అద్భుతంగా ఉంది. ఊరికి నాలుగు మూలల్లో నాలుగు అద్భుతమైన తటాకాలు ఉన్నాయి. మళ్లీ గ్రామంలో నీటి ఊటలు, బావుల్లో జాలు చూడబోతున్నాం. మీ ఊరి బిడ్డ ముఖ్యమంత్రిగా ఉన్నాడు. చనుబాలు ఇచ్చి పెంచిన నా ఊరు చింతమడక. మరో మూడు గ్రామాలు నాకు విద్యాబుద్ధులు ప్రసాదించాయి.

తొలి ఐదేళ్లలో రాష్ట్రంలోని అన్ని వర్గాల సమస్యలను పరిష్కరించాం. విద్యుత్‌, తాగునీటి సమస్యలు లేకుండా చేశాం. ఈసారి స్వగ్రామ అభివృద్ధికి సంకల్పించాం. ఊరు బాగుపడాలంటే ప్రజలంతా ఐకమత్యంగా ఉండాలి. ఎర్రవల్లి గ్రామాన్ని దత్తత తీసుకుని బాగు చేశాను. మీకు మంచిగా పని చేసే కలెక్టర్‌ ఉన్నాడు. ఊరికి అర్జెంట్‌గా రెండు రోడ్లు కావాలి.. మూడు నెలల్లో వేయిస్తాం. ఒక్క చింతమడకలనే బాగుచేస్తే దంతె కలవదు కాబట్టి.. నియోజకవర్గమంతా అభివృద్ధి చేస్తాం. రాష్ట్ర ఆరోగ్య సూచిక తయారుచేస్తాం. చింతమడక నుంచే ఆరోగ్య సూచిక తయారీకి నాంది పలకాలి. చింతమడక ఊరంతా ఆరోగ్య పరీక్షలు చేసేందుకు శిబిరాలు ఏర్పాటు చేసి అవసరమైన వైద్యం అందిస్తాం. వెంటనే ఉచిత కంటి శిబిరం ఏర్పాటు చేయాలని హరీష్‌ రావును కోరుతున్నా. నెల రోజుల్లో చింతమడకలో సమస్యలు లేకుండా చేయాలని కలెక్టర్‌, ఎమ్మెల్యేలను కోరుతున్నాను. చింతమడక ప్రజల హెల్త్‌ ప్రొఫైల్‌ తయారు చేయాలి. యావత్‌ తెలంగాణ ఆరోగ్య సూచిక తయారు చేయాలనే ఆలోచన ఉంది.

చింతమడకలో అభివృద్ధి పనులకు నిధులు మంజూరు చేస్తా. వలస వెళ్లిన వారిని కూడా పిలిచి పథకాలు అందేలా చూడాలి. గ్రామంలోని ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు లబ్ధి చేకూరుస్తాం. ప్రభుత్వం అందించే లబ్ధి ద్వారా యువత ఉపాధి పొందాలి. ఎవరు ఏ ఉపాధి మార్గం ఎంచుకున్నా అభ్యంతరం ఉండదు. ప్రతి కుటుంబానికి రూ. 10 లక్షలు లబ్ధి పొందే పథకానికి శ్రీకారం చుడుతాం. వరి నాటేసే మిషన్లు కొనుకుంటే లాభసాటిగా ఉంటుంది. ఎవరికి నచ్చిన పని వారు చేసుకుంటే లబ్ధి తప్పక పొందుతారు. పైసలు మిగిలితే ఆవులో, బర్రెలో కొనుక్కోవాలి. ఊరిలోని 2 వేల కుటుంబాలు బాగుపడాలి. చింతమడకలో నాలుగు నెలల్లో అభివృద్ధి పనులు పూర్తి చేయాలి అని సీఎం కేసీఆర్‌ ఆదేశించారు.

5932
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles