శిరసు వంచి నమస్కరిస్తున్నా : సీఎం కేసీఆర్

Tue,December 11, 2018 05:00 PM

CM KCR says thanks to Telangana People

హైదరాబాద్ : తెలంగాణలో తెలంగాణ రాష్ట్ర సమితి విజయానికి కారకులైన తెలంగాణ ప్రజలందరికీ శిరసు వంచి నమస్కరిస్తున్నానని ముఖ్యమంత్రి కేసీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ సాయంత్రం తెలంగాణ భవన్‌లో సీఎం కేసీఆర్ మీడియాతో మాట్లాడారు. ఈ రోజు ఎన్నికల్లో టీఆర్‌ఎస్ పార్టీకి లభించిన ఘనవిజయం పూర్తిగా తెలంగాణ ప్రజల విజయం. రైతులు, మహిళలు, నిరుపేద ప్రజలు, వెనుకబడిన వర్గాల ప్రజలు, దళితులు, గిరిజనులు, మైనార్టీలు కులాలకు అతీతంగా నిండుగా దీవించి ఇచ్చిన విజయం. విజయానికి కారకులైన వారికి శిరసు వంచి నమస్కరిస్తున్నా. టీఆర్‌ఎస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు అహోరాత్రులు కష్టపడి పని చేశారు. మంచి విజయం సాధించారు. నాయకులు, కార్యకర్తలకు ధన్యవాదాలు. సమయాన్ని వృధా చేయకుండా ప్రజల కోసం పని చేయాలి. పాజిటివ్ కోణంలో వెళ్లాలి. కొత్త రాష్ర్టాన్ని ఒక బాటలో పెట్టాం.. గమ్యం చేరడానికి ప్రయత్నించాలి. కోటి ఎకరాలు పచ్చబడాలె. అది అయి తీరాలె. ఆ లక్ష్యం జరిగి తీరాలి. టీఆర్‌ఎస్‌ను గెలిపిస్తే కాళేశ్వరం.. కూటమిని గెలిపిస్తే శనేశ్వరం అని ఎన్నికల సమయంలో చెప్పాను. ప్రజలు కాళేశ్వరం కావాలనే మమ్మల్ని గెలిపించారు. ప్రజలు అప్పగించిన బాధ్యతను నెరవేరుస్తాం. సానుకూల ధోరణితో ముందుకెళ్తాం. ధనికులైనటువంటి రైతులు తెలంగాణలో ఉన్నారనే పేరు వచ్చే విధంగా రైతుల కోసం పని చేస్తాం. గిరిజనులు, గిరిజనేతరులు పడుతున్న భూ హక్కుల విషయాన్ని వీలైనంత త్వరగా సత్వర పరిష్కారం చేస్తాం. కులవృత్తులు కుదుటపడేలా చేస్తాం. యువతకు ఉపాధి, ఉద్యోగాలు విరివిగా లభించే విధంగా ముందుకెళ్తాం. నిరుద్యోగ సమస్య అనేది తెలంగాణకే పరిమితమైంది కాదు.. భారతదేశం అంతటా ఉన్న సమస్య. ఉద్యోగ ఖాళీలన్నీంటిని వీలైనంత త్వరగా భర్తీ చేస్తాం. ప్రభుత్వయేతర రంగాల్లో కూడా విరివిగా ఉద్యోగాలు వచ్చేలా చేస్తాం. విజయం ఎంత ఘనంగా ఉందో.. బాధ్యత కూడా అంతే బరువుగా ఉంది. పెన్షన్లు కూడా పెంచుతాం. భద్రతతో కూడా బతుకును కల్పిస్తాం. సంపూర్ణ ఆరోగ్య తెలంగాణ దిశగా ముందుకెళ్తాం అని కేసీఆర్ స్పష్టం చేశారు.

3106
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles