తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించాం: సీఎం కేసీఆర్

Sat,November 18, 2017 03:49 PM

CM KCR review on 24 hours current supply

తీవ్రమైన విద్యుత్ సంక్షోభాన్ని అధిగమించడంతో పాటు, అన్ని వర్గాలకు నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ సరఫరా చేస్తూ తెలంగాణ విద్యుత్ సంస్థలు మెరుగైన సేవలు అందిస్తున్నాయని ముఖ్య‌మంత్రి కే చంద్ర‌శేఖ‌ర్ రావు అన్నారు. మిగితా రాష్ర్టాలతో పోల్చితే.. విద్యుత్ ఉత్పత్తి, పంపిణీ, సరఫరా వ్యవస్థలో తెలంగాణ ముందంజలో ఉందని సీఎం అన్నారు.

అహోరాత్రులు శ్రమించి విద్యుత్ శాఖ ఉద్యోగులు ఈ ఘనత సాధించారని అభినందించారు. రైతులకు 24 గంటల పాటు విద్యుత్ అందించడంతో పాటు వచ్చే ఏడాది ప్రారంభంకానున్న ఎత్తిపోతల పథకాల పంప్‌హౌజ్‌లకు, మిషన్ భగీరథకు, కొత్త పరిశ్రమలకు అవసరమయ్యే విద్యుత్ అందించేందుకు సరైన ప్రణాళిక రూపొందించి కార్యాచరణ అమలు చేయాలని సీఎం సూచించారు. ఎత్తిపోతల పథకాల ద్వారా వచ్చే డిమాండ్‌ను, కొత్త పరిశ్రమల వల్ల వచ్చే డిమాండ్‌ను శాస్త్రీయంగా అంచనా వేసి, అందుకు తగ్గ ఏర్పాట్లు ఇప్పటి నుంచే చేయాలని సీఎం చెప్పారు.

విద్యుత్ శాఖ పనితీరు వల్ల రాష్ర్టానికి ఎంతో మంచి పేరు వచ్చిందని.. ఇదే స్ఫూర్తి కొనసాగించి రాబోయే కాలంలో నిరంతరాయ, నాణ్యమైన విద్యుత్ అందించాలని సీఎం చెప్పారు.

ప్రగతి భవన్‌లో శనివారం విద్యుత్ శాఖ అధికారులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, జెన్‌కో - ట్రాన్స్‌కో సీఎండీ ప్రభాకర్‌రావు, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్ శర్మ, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి అజయ్ మిశ్రా, డీజీపీ మహేందర్‌రెడ్డి, ట్రాన్స్‌కో జేఎండీ శ్రీనివాసరావు, అధికారులు పాల్గొన్నారు.

జనవరి 1 నుంచి రైతులకు 24 గంటలు విద్యుత్ అందించే అంశంపై ప్రధానంగా చర్చ జరిగింది. "గోదావరిపై కొత్త ఎత్తిపోతల పథకాలు వస్తున్నాయి. కాళేశ్వరం, సీతారామ, దేవాదుల లాంటి భారీ ఎత్తిపోతల పథకాలతో పాటు...గూడెం, శ్రీపాద ఎల్లంపల్లి లాంటి చిన్న ఎత్తిపోతల పథకాలు కూడా వస్తున్నాయి. కృష్ణపై పాలమూరు -రంగారెడ్డి, డిండి లాంటి పథకాలు వస్తున్నాయి. దీనికి అనుగుణంగా అవసరమైన విద్యుత్ డిమాండ్ అంచనా వేయాలి. ఎత్తిపోతల పథకాలతో పాటు మిషన్ భగీరథ కోసం ఏర్పాటు చేసిన 1300 పంపుసెట్లకు అవసరమైన విద్యుత్ అందించాలి. ఎత్తిపోతల పథకాలు, మిషన్ భగీరథకు కలిపి 10-12 వేల మెగావాట్ల అదనపు విద్యుత్ అవసరం ఉంటుంది. దీనికి తగ్గట్లు విద్యుత్‌ను సమకూర్చుకోవడంతో పాటు పంపిణీ, సరఫరా వ్యవస్థలను మెరుగుపరచాలి" అని సీఎం చెప్పారు.

"రాష్ట్రంలోని 23 లక్షల వ్యవసాయ పంపుసెట్లకు నిరంతరాయ విద్యుత్‌ను జనవరి 1 నుంచి అందివ్వాలి. యాసంగిలో పంపుసెట్లకు విద్యుత్ డిమాండ్ ఎక్కువ ఉంటుంది. రైతులకు 24 గంటల విద్యుత్ అందివ్వడం చాలా ముఖ్యం. ప్రభుత్వానికి ప్రతిష్ఠాత్మకం. ఈ విషయాన్ని పరిగణలోకి తీసుకోవాలి.." అని సీఎం సూచించారు.

"విద్యుత్ సరఫరాను ఐదు భాగాలుగా విభజించుకోవాలి.. వ్యవసాయం, ఎత్తిపోతల పథకాలు - మిషన్ భగీరథ, కమర్షియల్, ఇండస్ట్రీ, డొమెస్టిక్.. ఈ ఐదు రంగాలను వేర్వేరుగా పరిగణించి దేనికెంత అవసరమో గుర్తించి ఏర్పాట్లు చేసుకోవాలి. ఈ ఐదు విభాగాల్లోనూ భవిష్యత్‌లో చాలా వినియోగం పెరుగుతుంది. డొమెస్టిక్, కమర్షియల్ విభాగాల్లో వచ్చే సహజ పెరుగుదలతోపాటు ఎత్తిపోతల పథకాలు, వ్యవసాయ విద్యుత్, పారిశ్రామిక విద్యుత్‌లో భారీగా పెరుగుదల వస్తుందన్నారు. దీంతో విద్యుత్ సరఫరా వ్యవస్థలో సమూల మార్పులు వస్తాయి.." అని సీఎం అన్నారు.

"వ్యవసాయానికి ఎక్కువ విద్యుత్ సబ్సిడీలు ఇవ్వడం మంచిది కాదని కొందరు ఆర్థిక వేత్తలు అభిప్రాయపడ్డారు. కాని నేను అలా భావించడం లేదు. వ్యవసాయానికి 24 పూటల విద్యుత్ అందించడం కోసం ప్రభుత్వ సబ్సిడీని రూ. 4777 కోట్ల నుంచి రూ. 5400 కు పెంచుతున్నాం. అవసరమైతే మరో రూ. 500 కోట్లు ఇవ్వడానికైనా మేం సిద్ధం. ఎత్తిపోతల పథకాల నిర్వహణకు అయ్యే దాదాపు 10 వేల కోట్ల భారాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తుంది. రైతులకు అందించే సబ్సిడీల ద్వారా లక్ష కోట్ల వ్యవసాయోత్పత్తులు వస్తాయి. అప్పుడు రైతుల పరిస్థితి మారుతుంది. రాష్ట్ర జీడీపీ మారుతుంది.." అని సీఎం చెప్పారు.

జిల్లాల వారీగా ప్రస్తుత విద్యుత్ డిమాండ్ - సరఫరా, రాబోయే కాలంలో ఏర్పడే డిమాండ్ - సరఫరా అంశాలపై డైరెక్టర్లు, ఎస్‌ఈలతో సీఎం నేరుగా మాట్లాడారు. అన్ని పాత జిల్లా కేంద్రాలలో పవర్ ట్రాన్స్‌ఫార్మర్ల రోలింగ్ స్టాక్‌ను అందుబాటులో ఉంచుతున్నామని.. ప్రతి సబ్‌స్టేషన్‌లో కూడా ట్రాన్స్‌ఫార్మర్లు పెట్టామని.. ఎక్కడ ట్రాన్స్‌ఫార్మర్ చెడిపోయినా 24 గంటల్లో మరొకటి ఏర్పాటు చేస్తామని అధికారులు ముఖ్యమంత్రికి హామీ ఇచ్చారు.

2320
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS