వచ్చే జనవరిలో పంచాయతీ ఎన్నికలు పూర్తవుతాయి: సీఎం

Sat,December 29, 2018 05:53 PM

cm kcr press meet in pragathi bhavan

హైదరాబాద్: వచ్చే జనవరిలో పంచాయతీ ఎన్నికలు పూర్తవుతాయని సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు. ప్రగతి భవన్‌లో సీఎం ఇవాళ సాయంత్రం ప్రెస్ మీట్ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడారు.

ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు..

శాసన సభ ఎన్నికలు పూర్తయ్యాయి. ఫలితాలు వచ్చాయి. పిచ్చిపిచ్చి మాటలు మాట్లాడి, అర్థంపర్థం లేకుండా మాట్లాడితే ప్రజల తీర్పు ఎలా ఉంటుందో స్పష్టమైంది. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు ప్రజలు కర్రు కాల్చి వాత పెట్టారు. బీజేపీ 118 స్థానాలో పోటి చేస్తే 103 చోట్ల డిపాజిట్లే రాలేదు. వాళ్లకు ప్రజలు తగిన బుద్ధి చెప్పారు. అయినా వాళ్లకు బుద్ధి వస్తలేదు. కాంగ్రెస్ పార్టీ కూడా అంతే.

అప్పుడు 19.. ఇప్పుడు 261 బీసీ రెసిడెన్షియల్ స్కూళ్లు

కాంగ్రెస్, బీజేపీలు బీసీల మీద తెగ ప్రేమ ఒలకబోస్తున్నారు. ఎవరికి ప్రేమ ఉన్నది.. ఎవరికి లేదనేది ప్రజలకు తెలియదా? బీసీల మీద ప్రేమ ఒలకబోసే వాళ్లు అధికారంలో ఉన్న హయాంలో తెలంగాణలో 19 బీసీ రెసిడెన్షియన్ పాఠశాలలు ఉండేవి. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం వచ్చాక అవి 261 కి పెరిగాయి. ఎవరికి ఉన్నది బీసీల మీద ప్రేమ. మార్కెట్ కమిటీలలో బీసీలకు రిజర్వేషన్ తీసుకొచ్చిన మొట్టమొదటి ప్రభుత్వం టీఆర్‌ఎస్ ప్రభుత్వం, మొట్టమొదటి రాష్ట్రం తెలంగాణ. ఎంబీసీలకు కార్పొరేషన్ పెట్టింది కూడా టీఆర్‌ఎస్ ప్రభుత్వమే. చేనేతలను ఆదుకున్నది.. ఉపాధి కల్పించింది... గీత కార్మికులకు చెట్ల పన్ను రద్దు చేసి కల్లు దుకాణాలు తెరిపించింది... యాదవులకు లక్షల సంఖ్యలో గొర్రెలను పంపిణీ చేసింది టీఆర్‌ఎస్ ప్రభుత్వం. కాంగ్రెస్ హయాంలో బీసీ వృత్తులన్నింటినీ నాశనం చేశారు.

ఓవైపు సుప్రీం తీర్పు.. మరోవైపు హైకోర్టు తీర్పు

అసెంబ్లీ ఎన్నికల ముందే పంచాయతీ ఎన్నికలు పెట్టడానికి ప్రయత్నించాం. దానికి సంబంధించి కొత్త పంచాయతీ రాజ్ యాక్ట్ కూడా తెచ్చాం. యాక్ట్ అసెంబ్లీలో పాస్ అయింది. దాని ప్రకారం నోటిఫికేషన్ ఇచ్చాం. 34 శాతం బీసీలకు రిజర్వేషన్లు ఇస్తూ మొత్తం 61.19 శాతం రిజర్వేషన్లు పెట్టాం. స్వప్నారెడ్డి అనే రంగారెడ్డి జిల్లాలోని ఓ గ్రామ సర్పంచ్, భూపాల్ రెడ్డి అనే సర్పంచ్ సంఘం నాయకుడు.. వీళ్లిద్దరూ కాంగ్రెస్ నాయకులే. వీళ్లు రిజర్వేషన్లు 50 శాతం ఉండాలె అని హైకోర్టుకు పోయారు. దీంతో హైకోర్టు 61.19 రిజర్వేషన్లకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చింది. వెంటనే మేం సుప్రీంకోర్టులో అప్పీల్ చేశాం. 61.19 పెట్టుకుంటామని కోరాం. సుప్రీం కూడా 50 కి దాటొద్దని కొట్టేసింది. ఒకవైపు జనవరి 10 లోపు 100 రోజుల్లో ఎన్నికలు పెట్టాలని హైకోర్టు తీర్పు ఇచ్చింది.. మరోవైపు 50 శాతం రిజర్వేషన్లు దాటొద్దని సుప్రీం తీర్పు ఇచ్చింది. ఏం చేయాలి.. కోర్టుల తీర్పును ధిక్కరించకూడదు కదా.. అందుకే.. రిజర్వేషన్లను 50 శాతానికి సవరణ చేస్తూ ఆర్డినెన్స్ ఇవ్వాల్సి వచ్చింది.

సీఎం తర్వాత ప్రోటోకాల్ ఉండే రెండు పోస్టులు బీసీలకే ఇచ్చాం..

50 శాతం మించొద్దని కోర్టుకు పోయిన కాంగ్రెస్ నేతలే.. ఇప్పుడు మొసలి కన్నీరు కారుస్తున్నారు. దారుణంగా అబద్ధాలు మాట్లాడుతున్నారు. పార్లమెంట్ వేదికగా... ప్రధానిని రిజర్వేషన్లపై టీఆర్‌ఎస్ ఎంపీలు నిలదీసి అడిగినా... పట్టించుకోలేదు. నేను కూడా చెప్పా ప్రధానికి. అక్కడ ఎవ్వరూ పట్టించుకోరు. ఇక్కడ లక్ష్మణ్ మాత్రం లొడలొడా వాగుతున్నాడు. బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు బీసీలను నాశనం చేశాయి తప్ప ఏం చేయలేదు. సీఎం తర్వాత ప్రోటోకాల్ ఉండే రెండు పోస్టులు మండలి చైర్మన్, శాసనసభాపతి.. బీసీలకే ఇచ్చాం. ఇలా 15 కార్పొరేషన్ చైర్మన్లను ఆర్టీసీతో సహా కూడా బీసీలను నియమించాం. మా రిజర్వేషన్ కారణంగా 50 మంది మార్కెట్ కమిటీ చైర్మన్లు బీసీలు అయ్యారు. విప్ పదవి.. ఇలా బీసీలకు చాలా ఇచ్చాం. బీసీలకు ఓవర్సీస్ స్కాలర్‌షిప్‌లు 20 లక్షలు ఇస్తున్నాం. కాంగ్రెస్ హయాంలో ఆ పథకమే లేదు. అన్ని వర్గాలకు ఆత్మగౌరవ భవనాలు రాజధానిలో నిర్మిస్తున్నాం. మన్మోహన్ నుంచి మోదీ దాక ఎవరు కూడా కేంద్రంలో బీసీ మంత్రిత్వ శాఖను పెట్టలేకపోయారు. బీసీ మంత్రిత్వ శాఖను పెట్టాలని అప్పుడు మన్మోహన్‌ను కోరాం.. ఇప్పుడు మోదీని కూడా కోరుతున్నాం. అయినా ఎవ్వరూ పట్టించుకోరు. కానీ.. ఇప్పుడు మాత్రం బీసీలపై ప్రేమ ఒలకబోస్తున్నారు.. అంటూ సీఎం కేసీఆర్ బీజేపీ, కాంగ్రెస్ పార్టీలపై మండిపడ్డారు.

7125
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles