డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో సీఎం కేసీఆర్ భేటీ

Mon,May 13, 2019 04:38 PM

cm kcr meeting with dmk president stalin

చెన్నై: డీఎంకే అధ్యక్షుడు స్టాలిన్‌తో తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ సమావేశమయ్యారు. చెన్నైలోని అళ్వార్‌పేటలోని స్టాలిన్ నివాసానికి సీఎం కేసీఆర్ చేరుకున్నారు. సీఎం కేసీఆర్‌ను స్టాలిన్ సాధరంగా ఆహ్వానించారు. సమావేశంలో డీఎంకే సీనియర్ నాయకులు దురైమురుగన్, టీఆర్‌బాలు తదితరులు పాల్గొన్నారు. టీఆర్ఎస్ పార్టీ తరపున ఎంపీలు వినోద్ కుమార్, సంతోశ్ కుమార్ లు పాల్గొన్నారు.


లోక్‌సభ ఎన్నికల అనంతరం కేంద్రంలో ఏర్పాటయ్యే ప్రభుత్వంలో కీలకపాత్ర పోషించేలా తెలంగాణ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు చురుకుగా అడుగులు వేస్తున్నారు. ఫెడరల్‌ఫ్రంట్ ఏర్పాటులో ప్రాంతీయపార్టీల మద్దతు కూడగట్టేందుకు రాష్ర్టాల పర్యటనలు చేపడుతున్నారు.


ఈ నెల 23 తరువాత కేంద్రంలో ఏర్పాటుకాబోయే ప్రభుత్వంలో ప్రాంతీయపార్టీలు కీలకపాత్ర పోషించాలని.. ప్రాంతీయపార్టీల వద్దకే జాతీయపార్టీలు వచ్చేలా అందరం కలిసి ముందుకువెళ్దామని ఈ సందర్భంగా కేసీఆర్ డీఎంకే అధినేతకు వివరించనున్నారు. కేంద్రం లో ఏ జాతీయపార్టీకి కూడా స్పష్టమైన మెజారిటీ రాదని, ప్రాంతీయపార్టీలు సాధించే స్థానాలే కీలకం కానున్నాయని తెలుపనున్నారు. ప్రాంతీయపార్టీలతో ఏర్పాటయ్యే కూటమి ద్వారా కేంద్రప్రభుత్వంలో కీలకపాత్ర పోషించి.. రాష్ట్రాలకు అధికారాల బదలాయింపు, అధికార వికేంద్రీకరణ సాధించాలని చెప్పనున్నారు.

జాతీయస్థాయి సమస్యలను పరిష్కరించుకుందామని వివరిస్తారు. సీఎం కేసీఆర్ గతంలోనూ అప్పటి డీఎంకే అధినేత కరుణానిధి, స్టాలిన్‌తో భేటీ అయ్యారు. ఆ సమావేశంలో ఫెడరల్‌ఫ్రంట్‌పై చర్చించారు. త్వరలో లోక్‌సభ ఎన్నికల ఫలితాలు విడుదల కానున్న నేపథ్యంలో మరోసారి సమావేశమయ్యారు. కేసీఆర్ ఇటీవల కేరళ సీఎం పినరయి విజయన్‌తోనూ సమావేశమయ్యారు. కర్ణాటక సీఎం కుమారస్వామితో ఫోన్‌లో మాట్లాడారు. ఇతరపక్షాల నేతలతో టచ్‌లో ఉన్నారు. ఫెడరల్ ఫ్రంట్‌పై కలిసి రావడానికి ఆంధ్రప్రదేశ్‌కు చెందిన వైసీపీ, ఒడిశాకు చెందిన బీజేడీ, పశ్చిమబెంగాల్ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతాబెనర్జీ, ఎస్పీ నేత అఖిలేశ్‌యాదవ్‌సహా పలుపార్టీలకు చెందిన నేతలు సంసిద్ధత వ్యక్తంచేశారు.

2418
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles