రెండు మూడు రోజుల్లో పీఆర్‌సీ కోసం త్రిసభ్య కమిటీ: కేసీఆర్

Wed,May 16, 2018 10:47 PM

cm kcr meeting in pragathi bhavan on employees issues

హైదరాబాద్: రెండు మూడు రోజుల్లో పీఆర్‌సీ కోసం త్రిసభ్య కమిటీ వేస్తామని సీఎం కేసీఆర్ తెలిపారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలపై మంత్రి వర్గ ఉపసంఘం, ఉద్యోగ సంఘాల నేతలతో సీఎం కేసీఆర్ ప్రగతి భవన్‌లో చర్చించారు. సమావేశం ముగిసిన అనంతరం.. సీఎం మీడియాతో మాట్లాడారు. "ఉద్యోగుల బదలీలకు ప్రభుత్వం అంగీకరించింది. బదిలీలు పారదర్శకంగా ఉండేందుకు అజయ్ మిశ్రా నేతృత్వంలో కమిటీ వేశాం. ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు వచ్చే రెండ్రోజుల్లో చర్చలు జరుపుతారు. శాశ్వత బదిలీల విధానం తయారు చేయాలని ఆదేశాలు ఇచ్చాం. బదిలీల్లో ఉద్యోగస్తులైన భార్యాభర్తలను ఒకే చోటుకు తెచ్చేలా చేయాలని ఆదేశాలు ఇచ్చాం. జోనల్ విధానంపై మంత్రి వర్గ ఉపసంఘం వేసుకున్నాం. సబ్ కమిటీ నివేదిక అనంతరం కేబినేట్ ఆమోదిస్తుంది.

వెంటనే రాష్ట్రపతికి పంపించి నెల రోజుల్లోనే ఉత్తర్వులు వచ్చేలా చూస్తాం. ప్రతి ఉద్యోగికి ఎల్‌టీసీ (లీవ్ ట్రావెల్ కన్సెషన్) ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నాం. మారుమూల ప్రాంతాల్లో పని చేసే ఉద్యోగులకు ప్రత్యేక అలవెన్సులు ఇస్తాం. భాషా పండితులు, పీఈటీల సమస్యలు త్వరలో పరిష్కరిస్తాం. ఉద్యోగుల ఆరోగ్య కార్డుల విషయంలో కొన్ని సమస్యలు ఎదురవుతున్నాయి. ఉద్యోగుల ఆరోగ్య పథకం పకడ్బందీగా జరిగేలా ఓ విధానం రూపొందించాలని ఆదేశించాం. పదోన్నతుల విధానంపై స్పష్టమైన పాలసీ తయారు చేయాలని ఆదేశాలు జారీ చేశాం. మహిళా ఉద్యోగులకు ఏడాదికి 5 రోజులు ప్రత్యేక సెలవులు ఇచ్చేందుకు అంగీకరించాం. ఆర్టీసీ సమస్యల పరిష్కారంపై తర్వాత నిర్ణయం తీసుకుంటాం. ఆంధ్రాలోని తెలంగాణ ఉద్యోగులను స్వరాష్ర్టానికి తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాం. పర్మినెంట్ ట్రాన్స్‌ఫర్ పాలసీ రూపొందించాలని ఆదేశించాం.

పోలీసుల సమస్యలను కూడా డీజీపీ కేబినేట్ సబ్ కమిటీ దృష్టికి తీసుకొచ్చారు. కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానంపై ఉద్యోగులకు ఎన్నో అనుమానాలున్నాయి. 10 రోజుల్లో కారుణ్య నియామకాలు జరిగే విధంగా ఆదేశించినం. కడుపునిండా పీఆర్‌సీ ఇస్తాం.. ఉద్యోగులు చేతినిండా పనిచేయాలి. జూన్ 2న మధ్యంతర భృతి ప్రకటిస్తాం. ఆగస్టు 15 కంటే ముందు నివేదిక ఇచ్చేలా చర్యలు తీసుకున్నాం.." అని సీఎం తెలిపారు.

2828
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles