కీలుబొమ్మ ప్రభుత్వమే చంద్రబాబు లక్ష్యం : సీఎం కేసీఆర్

Wed,December 5, 2018 03:54 PM

cm kcr fire on chandrababu politics in telangana state

మెదక్ : ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ కాంగ్రెస్ నాయకులపై ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు నిప్పులు చెరిగారు. గజ్వేల్ లో ఏర్పాటు చేసిన టీ ఆర్ ఎస్ ప్రజా ఆశీర్వాద సభలో సీఎం కేసీఆర్ మాట్లాడారు. నేను చెబుతున్న మాటలపై ప్రతి ఒక్కరూ తీవ్రంగా ఆలోచన చేయాలి. కోదాడ మహాకూటమి మీటింగ్ లో కృష్ణా నదిలో నీళ్లు లేవు.. గోదావరి నీళ్లు పంచుకుందామని చంద్రబాబు అంటున్నాడు. ఈ విషయానికి పక్కకు ఉన్న మన కాంగ్రెస్ గొర్రెలు, దద్దమ్మలు, మొద్దన్నలు తల ఊపుతున్నారు.

మా గడ్డ మీద కృష్ణా బేసిన్ లోని కోదాడలో నిలబడి కృష్ణాలో నీళ్లు లేవు.. గోదావరి నీళ్లు పంచుకుందామని అంటుండు. ఎంత ధైర్యం చంద్రబాబుకు. చంద్రబాబు ఏం కోరుతున్నాడు. తెలంగాణలో కీలుబొమ్మ ప్రభుత్వం ఉండాలనేది చంద్రబాబు లక్ష్యం. తెలంగాణలో అధికారం టీ ఆర్ ఎస్ పార్టీకి ఉండొద్దు.. కేసీఆర్ ఉండొద్దు చంద్రబాబుకు. కేసీఆర్ ఉంటే మాటలు, ఆటలు సాగవు కదా. అక్రమంగా సంపాదించిన సొమ్ములు తీసుకోని.. ఆంధ్రా నాయకులు, ఇంటెలిజెన్స్ డిపార్ట్ ను తీసుకొచ్చి ఇక్కడ మోహరించిండు. చంద్రబాబు విర్రవీగుతున్నాడు. దానికి కాంగ్రెస్ నాయకులు భజన పాడుతున్నారు. కేసీఆర్ ను ఢీకొట్టేందుకు కాంగ్రెస్ నేతలకు చేతనైత లేదు. అందుకే ఆంధ్రాకెళ్లి చంద్రబాబును భుజాల మీద మోసుకొచ్చిండు. సాగునీటి ప్రాజెక్టులకు అడ్డుపడుతూ కేంద్రానికి లేఖలు రాసిండు చంద్రబాబు.

అధికారం పోయిందన్న కసి, దౌర్భాగ్యంతో కుట్రలు చేస్తున్నాడు. అధికారం పోయిందనే కడుపుమంటతో కాంగ్రెస్ నేతలు ఉన్నారు. కాంగ్రెస్ నాయకుల అసమర్థతను చంద్రబాబు ఉపయోగించుకుంటున్నారు. మీరు అవకాశం నాకు ఇస్తే నా కంఠంలో ప్రాణం ఉన్నంత వరకు తెలంగాణను బానిస కానివ్వను. ఇప్పుడు ఎన్నికల్లో కొట్లాడిల్సింది మీరు. ఓటుతో దెబ్బ కొట్టాలి. ఆ సందర్భం తెలంగాణలో ఇవాళ ఉన్నది. తెలంగాణను కేసీఆర్ సాధించినప్పుడు.. మీరంతా సంబురపడ్డరు. తెలంగాణ మేధావులు, ఉద్యోగులు, కవులు, రచయితలు రాష్ట్ర వ్యాప్తంగా ఆలోచించి.. తెలంగాణకు రక్షణ కవచంగా నిలవాల్సిన బాధ్యత ఉంది. మీ మద్దతు లేకపోతే నేనేం చేయలేను. మీరు ఆశీర్వదించి దీవిస్తే.. దేశమే నివ్వెరపోయే అభివృద్ధి, సంక్షేమం జరుగుతోంది అని కేసీఆర్ స్పష్టం చేశారు.

2346
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles