పద్మశాలి భవన నిర్మాణానికి 5 కోట్లు మంజూరు: సీఎం

Fri,August 10, 2018 07:02 PM

cm kcr announces 5 crore rupees to padmashali bhavan

హైదరాబాద్: నేత వృత్తిని నమ్ముకుని జీవన సాగించే పద్మశాలీల అభ్యున్నతికి బహుముఖ వ్యూహంతో ముందుకు పోవాల్సిన అవసరం ఉందని, ఇందుకోసం ప్రభుత్వం, పద్మశాలీ సంక్షేమ సంఘం కలిసి పనిచేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు పిలుపునిచ్చారు. ఇప్పటికే చేనేత, నేత వృత్తిలో కొనసాగుతున్న వారికి అవసరమైన చేయూత, ప్రోత్సాహం అందించడంతో పాటు, వృత్తిని వదిలిపెట్టిన వారికి ప్రత్యామ్నాయ ఉపాధి మార్గాలు చూపాలని సీఎం చెప్పారు.

కాలం మారుతున్న కొద్దీ సామాజిక మార్పులు సంభవిస్తాయని, ఈ సందర్భంలోనే వాస్తవిక దృక్పథంతో ముందుకుపోవాల్సిన అవసరం ఉంటుందని ముఖ్యమంత్రి కేసీఆర్ చెప్పారు. పద్మశాలీల సంక్షేమానికి ప్రభుత్వం ఎంతైనా ఖర్చు చేయడానికి సిద్ధంగా ఉందని, ఈ నిధులను సద్వినియోగ పరుచుకుని శాశ్వత పరిష్కారాలు చూపాలని చెప్పారు.

హైదరాబాద్ నగరంలో పద్మశాలీ భవనం నిర్మాణానికి రెండున్నర ఎకరాల స్థలం, రూ.5 కోట్ల నిధులు మంజూరు చేస్తున్నట్లు సీఎం ప్రకటించారు. పద్మశాలీ సంఘం సంక్షేమ నిధిని ఏర్పాటు చేయాలని, దానికోసం మొదటి విరాళంగా టిఆర్ఎస్ పార్టీ నుంచి రూ.50 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపారు. సంఘం ప్రముఖులు కూడా సంక్షేమ నిధికి విరాళాలు ఇవ్వాలని సీఎం పిలుపునిచ్చారు.

సంగారెడ్డి ఎమ్మెల్యే చింత ప్రభాకర్ ఆధ్వర్యంలో ప్రగతి భవన్ వచ్చిన పద్మశాలీ సంఘం ప్రముఖులతో ముఖ్యమంత్రి సమావేశమయ్యారు. రాష్ట్రంలో పద్మశాలీలు ఎదుర్కొంటున్న సమస్యలు, దానికి పరిష్కార మార్గాలపై సుదీర్ఘంగా చర్చించారు.

"చేనేత వృత్తికి గతంలో గొప్ప గౌరవం దక్కేది. ఈ వృత్తిపై ఆధారపడిన పద్మశాలీలకు కూడా ఎంతో గౌరవం ఉండేది. కానీ ఇప్పుడు పరిస్థితి మారింది. 130 కోట్ల మంది భారతీయులకు సరిపడా వస్త్రాలు చేనేత కార్మికులు నేయలేరు. మరమగ్గాలు, మిల్లులు వచ్చాయి. వాటితో చేనేత కార్మికులు పోటీ పడడం అసాధ్యం. దీని ఫలితంగా చాలా మంది ఉపాధి కోల్పోయారు. మరో పని చేయలేక ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అప్పుల పాలై ఆత్మహత్యలు కూడా చేసుకున్నారు. సమైక్య పాలనలో చేనేత కార్మికుల ఆత్మహత్యలపై అప్పటి ప్రభుత్వాలు స్పందించలేదు. సమస్యలకు పరిష్కరం చూపలేదు. ఉద్యమ సమయంలో కరీంనగర్ ఎంపిగా ఉన్న నేను స్వయంగా పూనుకుని సిరిసిల్లలో చేనేత కార్మికులను ఆదుకునేందుకు రూ.50 లక్షల పార్టీ నిధులతో సంక్షేమ నిధిని ఏర్పాటు చేశాం.

పోచంపల్లిలో ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవడానికి ప్రభుత్వం ముందుకు రాకపోతే టిఆర్ఎస్ పార్టీ పక్షాన జోలె పట్టుకుని చందాలు పోగు చేసి, వారిని ఆదుకునే ప్రయత్నం చేశాం. తెలంగాణ రాష్ట్రం ఏర్పడితే చేనేత కార్మికులకు కొంతమేరకైనా ఆదుకోవచ్చని ఆనాడే అనుకున్నాం. అనుకున్నట్లే తెలంగాణ వచ్చింది. తెలంగాణ రాష్ట్రంలో చేనేత, మర మగ్గాల కార్మికులను ఆదుకునేందుకు అనేక చర్యలు తీసుకున్నాం" అని ముఖ్యమంత్రి వివరించారు.

"చేనేత, నేత కార్మికులు నేసిన వస్త్రాలను ప్రభుత్వమే కొనుగోలు చేస్తున్నది. బతుకమ్మ, రంజాన్, క్రిస్మస్ పండుగల సందర్భంగా పంచే చీరలను, ఇతరత్రా ప్రభుత్వ అవసరాలకు వస్త్రాలను సేకరించి, మార్కెటింగ్ సమస్య రాకుండా చేస్తున్నది. మరమగ్గాలను వందకు వంద శాతం ప్రభుత్వ నిధులతో ఆధునీకరిస్తున్నాం. నూలు, రసాయలనాలపై 50 శాతం సబ్సిడీ అందిస్తున్నాం. ఈ చర్యల వల్ల కొంత ఉపశమనం దొరికింది. మరమగ్గాల కార్మికులకు నెలకు 15-20 వేల ఆదాయం వస్తున్నది. ఇది కొంతమేరకు ఉపశమనం కలిగిస్తున్నది. కానీ ఇది శాశ్వత పరిష్కరం కాదు. ఇంకా చేనేత వృత్తుల్లోనే కొనసాగుతున్న వారికి, మరమగ్గాలపై పనిచేస్తున్న వారికి కొంత మేరకు ఈ ప్రయత్నాల వల్ల మేలు కలిగింది. కానీ వృత్తిని వదిలేసిన వారిని, వేరే ఉపాధి చూసుకునే వారిని గుర్తించి వారికి అవసరమైన చేయూత అందించాల్సిన అవసరం ఉంది" అని ముఖ్యమంత్రి చెప్పారు.

"పద్మశాలీ సంఘం ప్రముఖులు, పెద్దలే క్రియాశీలకంగా మారాలి. తమ కులంలో ఎవరు ఇంకా సంప్రదాయ వృత్తిపై ఆధారపడి బతుకుతున్నారు? వారికోసం ఏమి చేయాలి? పోచంపల్లి, గద్వాల, నారాయణ పేట తదితర ప్రాంతాల్లో కళాత్మక చేనేత వృత్తి కొనసాగుతున్నది. అక్కడి వస్త్రాలకు మార్కెటింగ్ కూడా ఉంది. అలాంటి వారికి ఎలాంటి ప్రోత్సాహం ఇవ్వాలి? వృత్తిని వదిలిపెట్టిన వారికి ఎలాంటి ప్రత్యామ్నాయం కావాలి? వారికి ప్రభుత్వం ఏమి చేయాలి? అనే విషయాలపై లెక్కలు తీయాలి. మీకేం కావాలో మీరే నిర్ణయించుకోవాలి. ప్రభుత్వం నిధులు విడుదల చేయడానికి సిద్ధంగా ఉంది. ఆ నిధులను ఉపయోగించుకుని సమస్యలకు శాశ్వత పరిష్కారం ఎలా కనుగొంటారనే దానిపై అధ్యయనం చేయాలి" అని ముఖ్యమంత్రి వారిని కోరారు.

మహిళా ఆర్థిక సహకార సంఘం అధ్యక్షురాలు గుండు సుధారాణి, తెలంగాణ పద్మశాలీ సంఘం అధ్యక్షుడు గోశిక యాదగిరి, కార్యనిర్వాహక అధ్యక్షుడు మ్యాడం బాబురావు, ప్రధాన కార్యదర్శి గడ్డం వెంకటేశ్వర్లు, కోశాధికారి అంకం వెంకటేశ్వర్లు, ఆప్కో మాజీ చైర్మన్ మండల శ్రీరామలు, వరంగల్ జడ్పీ మాజీ చైర్మన్ సాంబారి సమ్మారావు, ఎన్ఆర్ఐ ప్రతినిధి సామల ప్రదీప్, సంఘం నాయకులు జల్ల మార్కండేయ, గుండు ప్రభాకర్, చాగల్ల నరేంద్రనాథ్ తదితరులు పాల్గొన్నారు. మంత్రులు జగదీష్ రెడ్డి, మహేందర్ రెడ్డి, ఎమ్మెల్యేలు దివాకర్ బాబు, వివేకానంద, అధికారులు వికాస్ రాజ్, నీతూ ప్రసాద్, భూపాల్ రెడ్డి తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

1693
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS