సండే సినిమా.. చూడండి!

Sun,January 7, 2018 05:06 AM

cinema sunday conducted by telangana language and culture department

- సినీ ప్రేమికులకు చిత్రోత్సవ పండుగ
- మూవీ ఆఫ్‌దీ వీక్ 'రషోమాన్'
హైదరాబాద్: తెలంగాణ సినిమా కోసం ఆరాటపడే యువదర్శకులు, రచయితలు, నటీనటులు, నిర్మాతలు, సాంకేతిక నిపుణులు, సినీ అభిమానుల కోసం తెలంగాణ రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో మరో వినూత్న కార్యక్రమం సండే సినిమా శీర్షికన ప్రపంచ సినిమాల ప్రదర్శన సిద్ధమైంది. సినిమా రంగంపై అనేక అంశాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో ఈ సండే సినిమా కార్యక్రమాన్ని సాంస్కృతిక శాఖ ప్రారంభిస్తోంది. ఈ కార్యక్రమం ప్రతి ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రపంచ సినిమాల ప్రదర్శనతో పాటు దర్శకులు, రచయితలు, సాంకేతిక నిపుణులు, నటీనటులతో యంగ్ ఫిల్మ్ మేకర్స్‌కి వర్క్‌షాప్‌లను నిర్వహించేలా సండే సినిమాకు రూపకల్పన చేసింది. వారం వారం నిర్వహించే ఈ కార్యక్రమం నేటి సాయంత్రం తొలి ప్రదర్శనతో ప్రారంభిస్తున్నారు. జనవరిలో తొలి ఆదివారం ప్రారంభమయ్యే ఈ సండే సినిమా ఆ తర్వాత ప్రతి ఆదివారం నిర్వహిస్తారు.

సినీవారం సక్సెస్
ఇటీవల జరిగిన ప్రపంచ తెలుగు మహాసభల్లో భాగంగా సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన యువ చిత్రోత్సవం 2017 లఘు చిత్రాల పోటీకి 173 దరఖాస్తులు వచ్చాయి. యువ ఫిల్మ్ మేకర్స్ అద్భుతమైన సినిమాలను రూపొందిస్తున్నారు. యూట్యూబ్‌లో ఎంతో మంది తమ షార్ట్‌ఫిల్మ్స్‌ని ఉంచుతున్నారు. కానీ వాటిని ఒక వేదికపై ప్రదర్శించే అవకాశం వారికి లేదు. యూట్యూబ్‌లో అప్‌లోడ్ చేస్తున్న షార్ట్‌ఫిల్మ్స్‌ని జనం మధ్య ప్రదర్శించాలనుకునే వారి కోసం ఒక వేదికను కల్పించింది సినీవారం. ప్రతి శనివారం నిర్వహించే ఈ కార్యక్రమాన్ని సాంస్కతిక శాఖ 2016 నవంబరు 12న ప్రాంభించింది. అప్పటి నుంచి సినీవారం ప్రతి వారం విజయవంతంగా రవీంద్ర భారతిలోని పైడి జయరాజు ప్రివ్యూ థియేటర్‌లో నిర్వహిస్తున్నారు. ఇది షార్ట్‌ఫిల్మ్స్‌పై అభిమానుల స్పందన తెలుసుకునేలా చర్చ నిర్వహిస్తున్నది. సినీవారం కార్యక్రమం ఏడాది పూర్తి చేసుకుంది. ఈ కార్యక్రమంలో 150కి పైగా చిత్రాలను ఇప్పటి వరకు ప్రదర్శించారు. ప్రత్యేక పండుగల సందర్భంగా బతుకమ్మ ఫిల్మోత్సవం, అవతరణ ఫిల్మోత్సవం, యువ చిత్రోత్సవం నిర్వహించారు.

నేడే చూడండి
సండే సినిమాలో తొలి ప్రదర్శనకు జపాన్‌కి చెందిన ప్రఖ్యాత దర్శకుడు అకిరా కురొసావా దర్శకత్వం వహించిన రషోమాన్ అనే చిత్రాన్ని ఎంపిక చేశారు. అంబటి సురేంద్రరాజు ఈ సినిమా క్యూరేటర్. 1950లో విడుదలైన ఈ సినిమాని రచయిత ర్యూనొసుకె అకుటగవా రచించిన రెండు లఘు కథల ఆధారంగా రూపొందించారు. పది పేజీల కథను పూర్తి చిత్రంగా మలచిన కురొసావా ప్రతిభ అపూర్వం. నిజం అనే అంశాన్ని ఈ చిత్ర కథా వస్తువు. ఓ నిజం కోసం జరిగిన అన్వేషణే రషోమాన్ ఈ సినిమా. చిత్రం చివరి వరకు ఎవరు చెప్పింది నిజమో తెలియకుండా కొనసాగుతుంది. కథని సండే సినిమాలో తెర మీద వీక్షించాల్సిందే.

సినిమా పండుగ

ఇది సినిమా ప్రేమికులకు, ఔత్సాహిక సినిమా కళాకారులకు ఒక మంచి అవకాశం. ఏ లక్ష్యం కోసం సినీవారం కార్యక్రమాన్ని సాంస్కృతిక శాఖ నిర్వహిస్తుందో, అదే లక్ష్యం కోసం ఈ కార్యక్రమాన్ని కూడా చేపడుతున్నది. సినీవారం లక్ష్యం విజయవంతంగా నెరవేరింది. మన తెలంగాణలో ప్రతిభావంతులైన యువ పిల్మ్ మేకర్స్ ఉన్నారు. వారికి ప్రపంచ స్థాయి సినిమాని పరిచయం చేసి, ప్రపంచ స్థాయి సినిమా నిర్మాణ విలువలు, విశేషాలు, మెళకువలను తెలియజేయాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం రూపొందిస్తున్నాం. తెలంగాణ బిడ్డలు సినిమాను పండుగలా జరుపుకోవాలన్నదే మా ఆకాంక్ష.
- మామిడి హరికృష్ణ, తెలంగాణ రాష్ట్ర భాష, సాంస్కృతిక శాఖ సంచాలకులు

2646
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS