చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్‌ ప్రారంభం

Thu,November 14, 2019 12:35 PM

హైదరాబాద్ : రాష్ట్రంలోనే తొలిసారిగా చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్‌ మేడ్చల్ మల్కాజ్ గిరి జిల్లాలో ప్రారంభమైంది. రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని మేడిపల్లిలో చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్‌ను ఏర్పాటుచేశారు. దీనిని రాచకొండ ఒకరోజు కమిషనర్, క్యాన్సర్ బాధిత బాలుడు ఇషాన్(9)తో కలిసి పోలీస్ కమిషనర్ మహేశ్‌భగవత్ నేడు ప్రారంభించారు. స్వచ్ఛంద సంస్థ సహకారంతో మేడిపల్లి పోలీస్‌స్టేషన్‌లోని మొదటి అంతస్తులో దీనిని ఏర్పాటుచేశారు. పిల్లలకు ఆహ్లాదకర వాతావరణం ఉండేలా గదిని ప్రత్యేకంగా తీర్చిదిద్దారు. గోడలపై పిల్లలు ఆడుకొనే రంగురంగుల బొమ్మలు చిత్రీకరించారు.


చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్‌లో జిల్లా న్యాయ సేవాసంస్థ, జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, జువెనైల్ జస్టిస్ బోర్డు, స్పెషల్ జువెనైల్ పోలీస్ యూనిట్ ప్రతినిధులు ఉంటారు. బాధితుల పిల్లలు, నేరాలకు పాల్పడే మైనర్లను ఈ పీఎస్‌లో ఉంచుతారు. వారికి పోలీస్‌స్టేషన్ అని కాకుండా ఆటవిడుపు స్థలంలో ఉన్నామనే భావనను కల్పించనున్నారు. ముఖ్యంగా పోలీస్ సిబ్బంది ఇక్కడ యూనిఫాంలో కాకుండా మఫ్టీలో ఉంటారు. వివిధ అఘాయిత్యాలకు గురై వచ్చే పిల్లలు ఎలాంటి ఆందోళనకు గురికాకుండా ఉండేందుకు, వారికి భరోసా కల్పించేలా ఏర్పాట్లు చేశారు. పిల్లలు భయాందోళన చెందకుండా నిర్భయంగా మాట్లాడే వాతావరణాన్ని ఇక్కడ కల్పించారు. రాష్ట్రంలో మొట్టమొదటిసారిగా చైల్డ్ ఫ్రెండ్లీ పోలీస్‌స్టేషన్ ఏర్పాటు చేయడం సంతోషంగా ఉందని సీపీ మహేశ్‌భగవత్ అన్నారు.

603
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles