కోఠి ఆస్పత్రిలో అపహరణకు గురైన పసికందు ఆచూకీ లభ్యం

Tue,July 3, 2018 05:10 PM

child found at Bidar Hospital after baby missing from Koti Hospital

హైదరాబాద్/బీదర్ : కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం ఉదయం అపహరణకు గురైన పసికందు ఆచూకీ లభ్యమైంది. పసికందు అదృశ్యంపై బాధిత తల్లిదండ్రులు సుల్తాన్ బజార్ పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం విదితమే. ఈ క్రమంలో పోలీసులు సీసీటీవీ ఫుటేజీల ఆధారంగా దర్యాప్తు చేపట్టగా.. పసికందును బీదర్ తీసుకెళ్లినట్లు నిర్ధారించారు. దీంతో 8 పోలీసు బృందాలు.. బీదర్ పోలీసుల సహకారంతో అక్కడ గాలింపు చర్యలు చేపట్టారు. మొత్తానికి బీదర్ ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువును గుర్తించిన పోలీసులు.. చిన్నారిని హైదరాబాద్‌కు తీసుకువస్తున్నారు. బీదర్‌లో పసికందును గుర్తించినట్లు సుల్తాన్ బజార్ ఏసీపీ డాక్టర్ చేతన స్పష్టం చేశారు. ఈ రోజు రాత్రి వరకు చిన్నారిని కోఠి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకురానున్నారు.

కోఠి టూ బీదర్ వయా ఎంజీబీఎస్
కోఠి ప్రభుత్వ ఆస్పత్రిలో సోమవారం ఉదయం చిన్నారిని అపహరించిన మహిళ.. కోఠి నుంచి నేరుగా ఎంజీబీఎస్ కు వచ్చినట్లు సీసీటీవీ ఫుటేజీలో నమోదైంది. అక్కడ ఆ మహిళ చిన్నారిని ఎత్తుకొని.. బీదర్ బస్సు ఎక్కుతున్న దృశ్యాలు సీసీటీవీల్లో రికార్డు అయ్యాయి. ఈ దృశ్యాల ఆధారంగా సంబంధిత బస్సు డ్రైవర్ ను పోలీసులు విచారించారు. ఆ మహిళ బీదర్ లో బస్సు దిగినట్లు డ్రైవర్ పోలీసులకు వివరించాడు. దీంతో 8 పోలీసు బృందాలు.. స్థానిక పోలీసుల సహకారంతో గాలించగా.. అక్కడున్న ప్రభుత్వ ఆస్పత్రిలో శిశువు లభ్యమైంది.

ఇంజక్షన్ ఇవ్వాలంటూ చిన్నారిని తీసుకెళ్లింది
రంగారెడ్డి జిల్లా మంచాల మండలం ఎల్లమ్మతండాకు చెందిన సబావట్ విజయ, నారి దంపతులు. విజయ రెండో కాన్పు కోసం గత నెల 21న కోఠి ప్రసూతి దవాఖానలో చేరింది. 27న ఆమెకు శస్త్ర చికిత్స చేయడంతో పండంటి ఆడశిశువుకు జన్మనిచ్చింది. విజయ వద్ద సహాయకురాలుగా ఆమె తల్లి చాంది ఉన్నారు. సోమవారం ఉదయం 11:50 గంటల సమయంలో చాంది భోజనం తెచ్చేందుకు బయటకు వెళ్లగా, ఈ సమయంలో విజయ వద్దకు నీలిరంగు చీరలో ఉన్న సుమారు 30 ఏండ్ల వయసున్న మహిళ వచ్చి శిశువుకు ఇంజక్షన్ ఇవ్వాలంటూ తీసుకెళ్లింది. దవాఖాన సిబ్బందిగా భావించిన ఆమె చిన్నారిని మహిళకు అందించగా నిమిషాల్లో దవాఖాన దాటి పాపను తీసుకొని వెళ్లిపోయింది. ఎంత సేపటికీ పాపను తీసుకురాకపోవడంతో అక్కడున్న సిబ్బందిని ఆరా తీయగా తాము తీసుకెళ్లలేదని చెప్పారు. విజయ తీవ్ర ఆందోళన కు గురైంది. దవాఖానతోపాటు పరిసర ప్రాంతాల్లో వెతికినా ఫలితం లేకుండా పోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో సుల్తాన్‌బజార్ ఏసీపీ డాక్టర్ చేతన ఆధ్వర్యంలో ఇన్‌స్పెక్టర్ శివశంకర్‌రావు సిబ్బందితో దవాఖానకు చేరుకొని విచారణ చేపట్టారు.

1663
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles