ఆన్‌లైన్‌లో చేనేత లక్ష్మి

Wed,January 4, 2017 07:50 AM

Chenetha laxmi in Online

హైదరాబాద్: చేనేత వస్ర్తాల విక్రయాలు పెరిగే విధంగా చేనేత లక్ష్మి పథకాన్ని ఆన్‌లైన్‌లోనూ అందుబాటులోకి తీసుకరావాలని టెస్కో అధికారులు నిర్ణయించారు. చేనేత లక్ష్మిలో చేరడం ద్వారా చేనేత కార్మికుల కుటుంబాలను ఆదుకోవడమే కాకుం డా వినియోగదారులకు ప్రోత్సాహకరంగా ఉం టుంది. అయితే ప్రస్తుతమున్న విధానంలో టెస్కో షోరూంలకు వెళ్లి సభ్యత్వం తీసుకోవాలి. ఆన్‌లైన్‌లోనూ ఈ పథకంలో చేరే సౌకర్యం కల్పిస్తే మంచి స్పందన వస్తుందని సూచనలు రావడంతో టెస్కో అధికారులు ఈ మేరకు ఏర్పాట్లు చేస్తున్నారు. టెస్కో వెబ్‌సైట్ http: //tsco.co.in ద్వారానే ఆన్‌లైన్ సభ్యత్వం తీసుకునే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. రెండు మూడు రోజుల్లో ఆన్‌లైన్‌లో చేరే విధానం అందుబాటులోకి రానుందని అధికారులు చెప్పారు. సభ్యత్వం తీసుకోవడంతోపాటు ప్రతి నెల చేసే చెల్లింపులకు సైతం ఆన్‌లైన్‌లో అవకాశం కల్పించనున్నామని తెలిపారు. ప్రస్తుతమున్న వెబ్ సైట్‌ను అధునీకరించాలని మంత్రి కేటీఆర్ ఇప్పటికే ఆదేశించారని పేర్కొన్నారు.

పెరిగిన కొనుగోళ్లు..
గత వారం రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా చేనేత వస్ర్తాల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. ఇప్పటికే ఉన్న టెస్కో షోరూంలతోపాటు ప్రతి జిల్లా కలెక్టరేట్‌లోనూ స్టాల్స్‌ను ప్రారంభించిన విషయం తెలిసిందే. డిసెంబర్ 26 నుంచి 31 నాటికి రూ.48.48లక్షల కొనుగోళ్లు జరిగాయని టెస్కో అధికారులు చెప్పారు. అత్యధికంగా హైదరాబాద్ నగర పరిధిలో రూ.33.63లక్షల కొనుగోళ్లు జరిగాయి. కరీంనగర్ జిల్లా పరిధిలో రూ.4.23లక్షలు, వరంగల్ జిల్లాలో రూ. 7.53లక్షలు, సిరిసిల్ల జిల్లాలో రూ.72వేల కొనుగోళ్లు జరిగాయి. ప్రస్తుతం అసెంబ్లీ సమావేశాలు జరుగుతున్నందున ఈ ప్రాంగణాల్లో స్టాల్స్ ఏర్పాటు చేయాలన్న మంత్రి కేటీఆర్ ఆదేశాలతో బుధవారం స్టాల్స్‌ను ప్రారంభించనున్నారు.

1545
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS