ఒకరికి బదులు మరొకరు పరీక్షరాస్తూ..

Thu,March 15, 2018 09:06 PM

cheating in tenth class exam 2018 two students arrested

ధర్మారం: పెద్దపల్లి జిల్లా ధర్మారం మండలం దొంగతుర్తి ఉన్నత పాఠశాల పదో తరగతి పరీక్ష కేంద్రంలో ఒకరి బదులు మరొకరు పరీక్ష రాస్తూ ఇద్దరు విద్యార్థులు పట్టుబడ్డారు. పెద్దపల్లి ఏసీపీ హబీబ్‌ఖాన్ కథనం ప్రకారం.. ధర్మారం మండలం ఖిలావనపర్తిలోని మారుతి ప్రైవేట్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులు కోల మహేశ్, పెండ్యాల శ్రీనివాస్ పదో తరగతి చదువుతున్నారు. వీరి పరీక్ష కేంద్రం దొంగతుర్తి ఉన్నత పాఠశాలలో వేశారు. దీంతో కోల మహేశ్, పెండ్యాల శ్రీనివాస్ స్థానంలో పరీక్ష రాసేందుకు ఖిలావనపర్తికి చెందిన ఇంటర్ ప్రథమ సంవత్సరం చదివే ఇద్దరు విద్యార్థులు మామిడిశెట్టి పవన్‌కుమార్, సామంతుల హరీశ్‌ను పాఠశాల కరస్పాండెంట్ కొమురయ్య పంపించారు. పరీక్ష రాస్తున్న సమయంలో ఇన్విజిలేటర్ గుర్తించారు.

దీంతో పరీక్ష కేంద్రం సీఎస్ శ్రీనివాస్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో పెద్దపల్లి జిల్లా కేంద్రం నుంచి సీఐ నరేందర్, ధర్మారం ఏఎస్‌ఐ సయ్యద్ అమ్జద్ దొంగతుర్తి చేరుకుని ఇద్దరు (నకిలీ) విద్యార్థులు పవన్ కుమార్, హరీశ్‌ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం ఏసీపీ హబీబ్‌ఖాన్ అక్కడకు చేరుకొని విచారణ చేపట్టి, అసలు విద్యార్థులతో పాటు పరీక్ష రాసేందుకు కారణమైన ప్రైవేట్ పాఠశాల కరస్పాండెండ్ కొమురయ్యపై కేసు నమోదు చేశామనీ, దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఏసీపీ మాట్లాడుతూ కరస్పాండెంట్ కొమురయ్య బలవంతం చేయడం వల్లే పరీక్షలు రాశామని సదరు విద్యార్థులు విచారణలో వెల్లడించినట్లు పేర్కొన్నారు.

4394
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS