కేంద్ర ఎన్నికల సంఘ బృందం పర్యటన షెడ్యూల్

Mon,October 22, 2018 05:43 AM

Central Election Commission tour schedule in telangana state

హైదరాబాద్ : తెలంగాణలో అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు రాష్ట్ర ఎన్నికల కమిషన్ చేసిన ఏర్పాట్లను పరిశీలించేందుకు చీఫ్ ఎలక్షన్ కమిషనర్ (సీఈసీ) ఓపీ రావత్ నేతృత్వంలోని కేంద్ర ఎన్నికల సంఘ (ఈసీ) బృందం సోమవారం హైదరాబాద్‌కు రానున్నది. ఈ ఎన్నికలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు వీలుగా 25 కంపెనీల కేంద్ర పారామిలిటరీ బలగాలను రాష్ట్రానికి పంపాలని ఎన్నికల సంఘం నిర్ణయించిన విషయం తెలిసిందే. మరోవైపు పోలింగ్ బూత్‌ల ఏర్పాట్లు చకచకా జరుగుతున్నాయి.

ఎన్నికలకు అవసరమైన ఈవీఎంలు, వీవీప్యాట్‌లు, కంట్రోల్ యూనిట్లను ఇప్పటికే రాష్ర్టానికి తెప్పించడంతోపాటు తగినంత సిబ్బందిని సమకూర్చి బడ్జెట్‌ను కూడా విడుదలచేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఎన్నికల పరిశీలక బృందాలు క్షేత్రస్థాయిలో పర్యటిస్తున్నాయి. ఎన్నికల్లో డబ్బు, మద్యం ప్రవాహాన్ని అడ్డుకునేందుకు ఎక్కడికక్కడ చెక్‌పోస్టులను ఏర్పాటుచేసి వాహన తనిఖీలను ముమ్మరంచేశారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర శాసనసభ ఎన్నికలకు సంబంధించిన ఏర్పాట్లు ఎంతమేరకు పూర్తయ్యాయో పరిశీలించేందుకు సీఈసీ ఓపీ రావత్‌తోపాటు కేంద్ర ఎన్నికల సంఘం కమిషనర్లు సునీల్ అరోరా, అశోక్‌లావాస హైదరాబాద్‌కు వస్తున్నారు. వీరు మూడ్రోజులపాటు వరుసగా వివిధ శాఖల అధికారులతో సమావేశమవుతారని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి (సీఈవో) రజత్‌కుమార్ తెలిపారు.

ఢిల్లీ నుంచి సోమవారం సాయంత్రం 3.15 గంటలకు హైదరాబాద్ చేరుకునే ఈసీ బృందం.. సాయంత్రం 4.30 నుంచి 6.00 వరకు వివిధ రాజకీయ పార్టీల నేతలతోను, ఆ తర్వాత రాత్రి 6.00 నుంచి 7.00 గంటల వరకు రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారితోపాటు పోలీసు నోడల్ అధికారులతోనూ భేటీ అవుతుంది.

23వ తేదీ (మంగళవారం) ఉదయం 10 గంటలకు జిల్లా ఎన్నికల అధికారులు (డీఈవోలు), ఎస్పీలు, డీఐజీ, ఐజీలతో సమావేశమయ్యే కేంద్ర ఎన్నికల కమిషనర్లు.. మధ్యాహ్నం 2.30 నుంచి సాయంత్రం 6 గంటల వరకు డీఈవోలు, ఎస్పీలతో ప్రత్యేకంగా భేటీ అవుతారు. బుధవారం (24వ తేదీ) ఉదయం 10 గంటల నుంచి 11 గంటల వరకు ఆదాయం పన్ను (ఐటీ), ఎన్‌ఫోర్స్‌మెంట్ విభాగాల డీజీలతో, 11.15 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్కే జోషితో సమావేశమై ఢిల్లీకి తిరిగివెళ్తారు.

1149
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles