సర్కారీ బడుల్లో చదివిన యువతకు నైపుణ్యా శిక్షణ

Thu,March 21, 2019 06:19 AM

career guidance for unemployed

నిరుద్యోగులకు పలు రంగాల్లో శిక్షణ అందిస్తూ ఉజ్వల భవిష్యత్తును చూపుతున్నది నిర్మాణ్. బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులు స్థాపించిన ఈ స్వచ్ఛంద సంస్థ ద్వారా మురికివాడల్లోని పిల్లలకు కెరీర్ గైడెన్స్ అందిస్తున్నారు. ముఖ్యంగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివిన విద్యార్థులను నిపుణులుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకుని ముందుకు సాగుతున్నారు. తెలంగాణతో పాటు ఇతర రాష్ర్టాల్లోనూ వాలంటీర్లను నియమించిన శిక్షణ కల్పిస్తున్నారు. అయితే ఈ నెల 25 నుంచి సాఫ్ట్ వేర్ కోర్సుల్లో శిక్షణ ఇచ్చేందుకు నిర్మాణ్ దరఖాస్తులను ఆహ్వానిస్తున్నది.

హైదరాబాద్ : ప్రస్తుతం ఉద్యోగావకాశాలు బోలెడు. కానీ నిరుద్యోగ యువతలో సరైన నైపుణ్యాలు లేక వాటిని అందుకోలేకపోతున్నారు. ఫలితంగా దేశవ్యాప్తంగా నిపుణుల కొరత ఏర్పడింది. అరకొర నైపుణ్యాలతో ఉద్యోగాల్లోకి అడుగుపెడుతున్న యువతకు నైపుణ్యాలు పెంచుకునే వెసులుబాటు లేకపోవడంతో ఎక్కువగా రాణించలేకపోతున్నారు. అది సంస్థ అయినా.. దేశమైనా.. ఆర్థికంగా సామాజికంగా ఎదగడానికి ప్రధానకారణం సుశిక్షత మానవ వనరులు. కానీ మారుతున్న అవసరాలకు అనుగణంగా నైపుణ్యాలు మారడం లేదు. కొత్తగా ఉద్యోగాల్లోకి అడుగుపెడుతున్న యువతకు ఆశించిన స్థాయిలో నైపుణ్యాలు ఉండడంలేదు. దీన్ని దృష్టిలో పెట్టుకుని బిట్స్ పిలానీ పూర్వ విద్యార్థులు నిర్మాణ్ పేరుతో స్వచ్ఛంద సంస్థను స్థాపించారు. ఈ సంస్థ మారుతున్న సమాజ అవసరాలను దృష్టిలో పెట్టుకుని సరికొత్త నైపుణ్యాలను నేర్పే ప్రణాళికలను సిద్ధం చేశారు. అందులో భాగంగా గ్రామీణ యువతకు నైపుణ్యాల్లో శిక్షణ ఇచ్చేందుకు నిర్మాణ్ సంస్థ పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ప్రధానంగా సంభాషణా చాతుర్యం, కంప్యూటర్ నైపుణ్యం, గణితం, చైతన్యవంతమైన ఆలోచనా ధోరణి, ప్రవర్తన, కొత్త విషయాలను నేర్చుకోవడంలో ఆసక్తి, కొత్త పరిస్థితులకు అలవాటు పడడం.. ఏయే విషయాల్లో యువత ముందు వరుసలో ఉంటుందనేటువంటి ఎన్నో అంశాలను యువతలో పరిశీలించనున్నది.

సర్కారు బడుల్లోని వారే లక్ష్యం..


నిర్మాణ్ సంస్థ ప్రధానంగా సర్కార్ విద్యాలయాల్లో చదివిన యువతను నిపుణులుగా మార్చడమే లక్ష్యంగా పెట్టుకున్నది. మారుతున్న పరిస్థితులకు అనుగుణంగా గ్రామీణ యువతకు నైపుణ్యాలు కల్పించేందుకు నిర్ధిష్ట ప్రణాళికతో ముందుకు సాగుతున్నది. ఆయా సంస్థలు ఉద్యోగులను ఎంపిక చేసుకునేందుకు అభ్యర్థిలో పరిశీలించే నైపుణ్యాల పట్ల అవగాహన కల్పిస్తున్నది. అందులో భాగంగానే ఆంగ్ల భాషలో నైపుణ్యంతో పాటు న్యూమరికల్ ఎబిలిటీ, క్రిటికల్ థింకింగ్‌లో యువతను ఉన్నతంగా తీర్చిదిద్దుతున్నంది. అయితే బీటెక్, ఏదైనా డిగ్రీ పూర్తి చేసిన నిరుద్యోగ యువత ఈ సంస్థ అందించిన సాఫ్ట్‌వేర్ కోర్సుల వల్ల డెల్, విప్రో, నెక్సిల్యాబ్, క్యాప్‌జెమినై వంటి పలు ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు సాధించడం గమనార్హం.

ఇతర రాష్ర్టాల్లోనూ వలంటీర్లు..


నిర్మాణ్ సంస్థ యువతలో నైపుణ్యాలను పెంపొందించేందుకు టెక్నోక్రాట్స్, ఔత్సాహిక పారిశ్రామిక వేత్తలు, సామాజిక శాస్త్ర నిపుణులు, సామాజిక కార్యకర్తలతో కలిసి పనిచేస్తున్నది. దీనికి పలు బహుళజాతి కంపెనీలు కార్పొరేట్ సామాజిక బాధ్యతగా నిర్మాణ్ కార్యక్రమాల్లో తమవంతు సాయమందిస్తున్నాయి. నిర్మాణ్ సంస్థ ఎక్కువగా విద్య, మహిళా సాధికారత, పేదరిక నిర్మూలన, సుస్థిర అభివృద్ధి వంటి అంశాలకు సంబంధించి ప్రోగ్రామ్‌లను నిర్వహిస్తున్నది. ఇదిలావుంటే.. తెలంగాణ, రాజస్థాన్, పుణె, ఛత్తీస్‌ఘడ్, ముంబై, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాల్లోని పలు గ్రామాల్లో నిర్మాణ్ వలంటీర్లు పనిచేస్తున్నారు. అక్కడ మురికివాడల్లోని మహిళలు, పిల్లలు, యువత కోసం పనిచేయడంతో పాటు వేల మంది పిల్లలకు కెరీర్ గైడెన్స్ అందిస్తున్నారు.

మార్చి 25తో చివరి గడువు..


అందులో భాగంగానే టెక్ మహీంద్రా ఫౌండేషన్, నిర్మాణ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో 2016, 2017, 2018 సంవత్సరాల్లో బీటెక్, డిగ్రీ పూర్తి చేసి కంప్యూటర్‌పై అవగాహన ఉన్న నిరుద్యోగ యువతకు నామమాత్రపు ఫీజుతో పలు సాఫ్ట్‌వేర్ కోర్సుల్లో శిక్షణనిస్తున్నది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు మార్చి 25వ తేదీలోపు అమీర్‌పేటలోని ఆదిత్య ఎన్‌క్లేవ్, నీలగిరి బ్లాక్‌లోని శిక్షణ కేంద్రంలో దరఖాస్తు చేసుకోవాలి. పూర్తివివరాలకు 7675914735, 9515134735 నంబర్లలో సంప్రదించాలి.

1613
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles