బస్సు - లారీ ఢీ : విద్యార్థులకు గాయాలు

Tue,January 15, 2019 06:43 PM

Bus carrying students meets with accident on NH 65 in Suryapeta

సూర్యాపేట : జిల్లాలోని చివ్వెంల వద్ద మంగళవారం తెల్లవారుజామున రోడ్డుప్రమాదం జరిగింది. విహారయాత్రకు వెళ్లిన విద్యార్థులతో వస్తున్న ఓ ప్రయివేటు బస్సు.. లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పది మంది విద్యార్థులతో సహా ఓ వర్కర్ గాయపడగా.. ఇందులో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో ఈ ముగ్గురిని మెరుగైన చికిత్స కోసం హైదరాబాద్ లోని ఓ ఆస్పత్రికి తరలించారు. మిగతా వారిని సూర్యాపేట ఏరియా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బాధిత విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు.

ఘటనాస్థలికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. ప్రయివేటు బస్సు డ్రైవర్ నిర్లక్ష్యం వల్లే ప్రమాదం జరిగినట్లు ప్రాథమికంగా నిర్ధారించారు. నల్లగొండ జిల్లా చండూర్ మండలంలోని పులెమ్ల జడ్పీహెచ్ఎస్ స్కూల్ నుంచి విహారయాత్ర నిమిత్తం సుమారు 50 మంది విద్యార్థులు ఈ నెల 10న తమ టీచర్లు, వర్కర్లతో బయల్దేరారు. విహారయాత్రలో భాగంగా 10వ తేదీన ద్వారక తిరుమల చేరుకున్నారు. అనంతరం అన్నవరం, విశాఖపట్టణంలోని బీచ్ ను, పలు ప్రాంతాలను సందర్శించారు.

జనవరి 14న భద్రాచలంలో రామయ్యను దర్శించుకుని రాత్రి 11 గంటల సమయంలో చండూర్ కు తిరిగి బయల్దేరారు. 15న తెల్లవారుజామున చివ్వెంల వద్ద విద్యార్థులతో వెళ్తున్న ప్రయివేటు బస్సు ప్రమాదానికి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

3056
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles