ప్రపంచానికి బుద్ధిజమే శరణ్యం: మంత్రి జగదీష్ రెడ్డి

Sun,November 17, 2019 09:15 PM

హైదరాబాద్: ఇప్పుడున్న పరిస్థితుల్లో ప్రపంచానికి బుద్ధిజమే శరణ్యమని రాష్ట్ర విద్యుత్ శాఖామంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి పేర్కొన్నారు. బౌద్ధిజం మొదలైన కాలానికి ఇప్పటికి ఎంతో వ్యత్యాసం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. నిజానికి అప్పటికంటే కూడా ఇప్పుడున్న సమజానికి బుద్ధిజం పరిమళాలు అందించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. రాష్ట్ర రాజధాని నగరంలోని యం.సి.హెచ్.ఆర్.డి లో రెండు రోజులుగా జరుగుతున్న బౌద్ధ సంగీతి-2019 ముగింపు సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా హాజరయ్యారు. థాయ్లాండ్, నేపాల్, భూటాన్ తదితర 17 దేశాల ప్రతినిధులు పాల్గొన్న ప్రపంచ స్థాయి సదస్సులో మంత్రి జగదీష్ రెడ్డి ప్రసంగిస్తూ బౌద్ధిజానికి, తెలంగాణకు మొదటి నుంచి ఉన్న సారూప్యాన్ని ఆయన వివరించారు. తెలంగాణ సమాజపు ఆలోచనలు బౌద్ధిజానికి ప్రతీకలుగా ఆయన వర్ణించారు. మధ్యలో ఒడి దుడుకులు ఎదురైనా, ప్రాశస్త్యం తగ్గినట్లు కనిపించినా తెలంగాణ సమాజం పుట్టుకలోనే బౌద్ధిజం కలిసి పోయిందన్నదన్నది యదార్థం అని మంత్రి స్పష్టం చేశారు. బౌద్ధిజానికి అనవాళ్లుగా నిలిచిన సూర్యపేట జిల్లాలోని అయిదు ఆరామల ప్రత్యేకతను కాపాడుకుంటామని మంత్రి జగదీష్ రెడ్డి తెలిపారు.ఫణిగిరి, వర్ధమానకోట, నాగరంలతో పాటు తిరుమలగిరి, చెన్నాయిపాలెంలలో లభించిన అవశేషాలు బౌద్ధిజానికి తెలంగాణా ప్రతీక అనేందుకు తార్కాణమన్నారు. శిధిలాల కింద కప్పబడిన విగ్రహాలు బయటకు రావడం కంటే కూడా బౌద్ధిజం ఆలోచనలు బయటకు తీసుక రావడం చారిత్రిక అవసరం ఉందన్నారు.
తాను జన్మించిన నాగారం మండల కేంద్రంలోనీ ఫణిగిరిలో బుద్దిజానికి సంబంధించిన అనవాళ్లను తరలించే ప్రక్రియను విద్యార్థి దశలోనే అడ్డుకున్న ఉదంతాన్ని మంత్రి జగదీష్ రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఆ తరువాత కాలంలో జరిగిన తెలంగాణ ఉద్యమంలో ఇక్కడి చరిత్రను అంతర్జాతీయ సమాజం ముందుకు తీసుకొచ్చినట్లు ఆయన తెలిపారు. తద్వారా వచ్చిన తెలంగాణలో నాగార్జున సాగర్ వద్ద బుద్ధవనం నిర్మాణానికి ముఖ్యమంత్రి కేసీఆర్ శ్రీకారం చుట్టారని ఆయన అన్నారు.తుంగతుర్తి శాసనసభ్యులు గాధారి కిశోర్ కుమార్ మాట్లాడుతూ.. తాను ప్రాతినిధ్యం వహిస్తున్న తుంగతుర్తి నియోజకవర్గంలో ఆరామలు ఉండడం అదృష్టంగా భావిస్తున్నానన్నారు. శిథిలాలు బయట పడినప్పటి వాటి చరిత్రను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై వున్నదని గుర్తు చేశారు. అందుకు అవసరమైన నిధులు ఏర్పాటుచేసే విదంగా చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు. ముగింపు సభకు బుద్ధవనం ప్రత్యేక అధికారి మల్లెపల్లి లక్ష్మయ్య అధ్యక్షత వహించగా.. తుంగతుర్తి శాసనసభ్యులు గాధారి కిశోర్ కుమార్, ప్రొఫెసర్ లింబాద్రి తదితరులు పాల్గొన్నారు.

439
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles