బీసీ కమీషన్ చైర్మన్‌గా బీఎస్ రాములు

Sat,October 22, 2016 06:29 PM

BS Ramulu appointed as BC Commission Chairman

హైదరాబాద్ : రాష్ట్ర బీసీ కమీషన్ చైర్మన్‌, సభ్యులను నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బీసీ కమీషన్ చైర్మన్ గా ప్రముఖ సామాజికవేత్త, రచయిత బీఎస్ రాములును నియామకం చేసింది. సభ్యులుగా వకుళాభరణం కృష్ణమోహన్, డాక్టర్ ఆంజనేయులు గౌడ్, జూలూరి గౌరిశంకర్ నియామకం అయ్యారు. కమీషన్ చైర్మన్, సభ్యుల పదవీ కాలం మూడేళ్లుగా నిర్ణయించారు. ఈ మేరకు నియామకం ఉత్తర్వులపై ముఖ్యమంత్రి కేసీఆర్ సంతకం చేశారు. తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమీషన్ చైర్మన్, సభ్యుల హోదాలతో సమానంగా సదుపాయాలు కల్పించబడుతాయి.

జగిత్యాల జిల్లాకు చెందిన బీఎస్ రాములు సుప్రసిద్ధ రచయిత, బాహుగ్రంధకర్త, సామాజిక అంశాలపై దశాబ్దాలుగా కృషి చేస్తున్నారు. తెలంగాణ ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్న రాములు బీసీల జీవన స్థితిగతులపై అనేక రచనలు చేశారు.

డాక్టర్ వకుళాభరణం కృష్ణమోహన్ రావు ఉమ్మడి రాష్ట్రంలో రెండు సార్లు 2004 నుంచి 2009 వరకు బీసీ కమీషన్ సభ్యులుగా పని చేశారు. బీసీ ఉద్యమ నేతగా గుర్తింపు పొందిన కృష్ణమోహన్‌రావు మంచి రచయిత, వక్తగా పేరొందారు. ఓయూ నుంచి ఎం.ఏ తెలుగు, పీహెచ్‌డీ పూర్తి చేశారు. వకుళాభరణం స్వస్థలం కరీంనగర్ జిల్లా హుజురాబాద్.

సూర్యాపేట జిల్లా కోదాడకు చెందిన జూలూరి గౌరీశంకర్ ప్రముఖ రచయిత, కవి. తెలంగాణ ఉద్యమంలో కీలకంగా పని చేసిన జూలూరి తెలంగాణ రచయితల వేదిక అధ్యక్షులుగా వ్యవహరించారు.

విద్యార్థి నాయకుడిగా పేరొందిన డాక్టర్ ఈడిగ ఆంజనేయులుగౌడ్ ఓయూలో న్యాయశాస్త్రంలో పీహెచ్‌డీ చేశారు. తెలంగాణ విద్యార్థి ఉద్యమంలో కీలకంగా పని చేసిన ఆంజనేయులు గౌడ్ తెలంగాణ బీసీ ఫోరం అధ్యక్షునిగా సేవలందించారు. ఆంజనేయులుగౌడ్ స్వస్థలం జోగులాంబ గద్వాల జిల్లా.

3432
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS