మోదీ వేడి తగ్గింది.. కాంగ్రెస్ గాడి తప్పింది: కేటీఆర్

Wed,March 20, 2019 04:29 PM

boath constituency leaders join in trs party in the presence of ktr in telangana bhavan

హైదరాబాద్: మోదీ వేడి తగ్గింది.. కాంగ్రెస్ గాడి తప్పింది. కాంగ్రెస్‌కు జోష్ లేదు.. బీజేపీకి హోష్ లేదు. అసెంబ్లీ ఎన్నికల్లోలాగే ఎంపీ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్, బీజేపీలకు మరోసారి బుద్ధి చెప్పాలని టీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ స్పష్టం చేశారు. ఇవాళ తెలంగాణ భవన్‌లో కేటీఆర్ సమక్షంలో బోథ్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు అనిల్ జాదవ్ టీఆర్‌ఎస్‌లో చేరారు. ఆయనతో పాటు బోథ్ నియోజకవర్గ నేతలు, కార్యకర్తలు టీఆర్‌ఎస్‌లో చేరారు. ఈసందర్భంగా కేటీఆర్.. వాళ్లకు గులాబీ కండువా కప్పి పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. అనంతరం కేటీఆర్ మాట్లాడుతూ.. ఎంపీ ఎన్నికల్లో బీజేపీ గెలిస్తే మోదీకి లాభం చేకూరుతుందని.. కాంగ్రెస్ గెలిస్తే రాహుల్ గాంధీకి లాభం చేకూరుతుందని.. అదే 16 మంది టీఆర్‌ఎస్ ఎంపీలు గెలిస్తే తెలంగాణకు లాభం చేకూరుతుందన్నారు.

తెలంగాణ హక్కుల సాధన కోసం పేగులు తెగేదాక కొట్లాడే దమ్మున్న ఏకైక పార్టీ టీఆర్‌ఎస్. ఢిల్లీ గులాంలు కావాలా? తెలంగాణ గులాబీలు కావాలా? ఆలోచించుకోవాలి. కాంగ్రెస్, బీజేపీలతో ఒరిగిందేమీ లేదు. వాటి పాలనలో దేశం ఎలాంటి అభివృద్ధి సాధించలేదు. దేశంలో ఇంకా పేదరికం ఉంది. రాష్ట్రంలో గిరిజనులు ఆనందంగా ఉన్నారంటే దానికి కారణం సీఎం కేసీఆర్. జైకిసాన్ అనేది ఇతర పార్టీలకు నినాదం మాత్రమే. టీఆర్‌ఎస్‌కు జైకిసాన్ అంటే ఒక విధానం. రైతు బంధు, రైతు బీమా ప్రపంచంలో ఇంకెక్కడైనా ఉందా? కేంద్ర ప్రభుత్వాన్ని తెలంగాణ ప్రజలే నిర్ణయించే పరిస్థితి రావాలి. దేశంలో మోదీ హవా తగ్గింది. ఎన్డీయేకు 150, యూపీఏకు 100 సీట్లకు మించి వచ్చే పరిస్థితి లేదు. 16 ఎంపీ సీట్లు గెలిచి ఢిల్లీని శాసించాలి. ఇద్దరు ఎంపీలతో తెలంగాణ తెచ్చిన ఘనత సీఎం కేసీఆర్‌ది. రాష్ట్రంలో కాంగ్రెస్ ఖాళీ అవుతోంది. పార్టీని నడిపే దమ్ములేక కాంగ్రెస్ నేతలు నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఓడిపోయిన వారిని ఎంపీ ఎన్నికల్లో నిలబెడుతున్నారు. కాంగ్రెస్ పార్టీ సంక్షోభంలో ఉందని కేటీఆర్ విమర్శించారు.


1359
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles