అన్ని కాలేజీల్లో బయోమెట్రిక్ అమలు చేయాలి : కడియం

Wed,August 8, 2018 04:57 PM

BioMetric should be implemented in all colleges in telangana says kadiyam srihari

హైదరాబాద్ : ముఖ్యంగా గతేడాది అన్ని యూనివర్శిటీలు, అనుబంధ కాలేజీలు, గుర్తింపు పొందిన కాలేజీలలో బయో మెట్రిక్ మెషీన్లు పెట్టాలని నిర్ణయం తీసుకోగా.. ఇంకా కొన్ని కాలేజీలలో వాటి ఏర్పాటు జరగలేదు. తెలంగాణలోని అన్ని విశ్వవిద్యాలయాల పరిధిలో ఉన్న క్యాంపస్, అనుబంధ, గుర్తింపు పొందిన కాలేజీలలో పూర్తి స్థాయిలో 3 నెలల వ్యవధిలో బయో మెట్రిక్ మెషీన్లు ఏర్పాటు చేయాలని గవర్నర్ నరసింహన్ ఆదేశాలిచ్చినట్లు డిప్యూటీ సీఎం, విద్యాశాఖ మంత్రి కడియం శ్రీహరి చెప్పారు. అదేవిధంగా విశ్వవిద్యాలయాల్లోని సేవలు చాలా వేగంగా డిజిటలైజ్ చేయడం పట్ల గవర్నర్ సంతోషం వ్యక్తం చేశారన్నారు.

డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ ఓపెన్ యూనివర్సిటీలో జరిగిన వీసీల కాన్ఫరెన్స్ ముగిసిన అనంతరం కడియం మీడియాతో మాట్లాడారు. ఈ సమావేశంలో ఉన్నత విద్యా మండలి చైర్మన్ పాపిరెడ్డి,  విద్యాశాఖ ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రంజీవ్ ఆర్ ఆచార్య, ఉన్నత విద్య కమిషనర్ నవీన్ మిట్టల్ ఇతర అధికారులు పాల్గొన్నారు. 

గత ఏడాది గవర్నర్ నరసింహన్ అధ్యక్షతన జరిగిన సమావేశం నుంచి నేటి వరకు విశ్వవిద్యాలయాలలోని వివిధ కార్యక్రమాలు, అభివృద్ధిపై నేడు గవర్నర్ పూర్తి స్థాయి సమీక్ష చేశారని కడియం శ్రీహరి తెలిపారు. విశ్వవిద్యాలయాల్లో కామన్ క్యాలెండర్ అమలు చేయడంపై కూడా సంతృప్తి వ్యక్తం చేసినట్లు స్పష్టం చేశారు. కామన్ క్యాలెండర్ అమలుకు ముందు ఎవరికీ తోచినట్లు వారు అడ్మిషన్లు చేపట్టేవారని, గత ఏడాది నుంచి అన్ని కాలేజీలు ఒకే సమయంలో అడ్మిషన్లు, పరీక్షలు, ఫలితాలు ఇచ్చే విధంగా క్యాలెండర్ అమలు చేస్తున్నామన్నారు.

కాలేజీలు, విశ్వవిద్యాలయాల్లో మహిళలపై చిన్న దురదృష్టకర సంఘటన జరగకుండా అన్ని విశ్వవిద్యాలయాల వీసీలు చర్యలు తీసుకోవాలని గవర్నర్ ఆదేశించారని కడియం శ్రీహరి తెలిపారు. మహిళా అధికారులతో గ్రీవెన్స్ సెల్ ఏర్పాటు చేయాలని సూచించినట్లు చెప్పారు.

పిహెచ్.డి అడ్మిషన్లలో గందరగోళం ఉందని, అన్ని యూనివర్శిటీలలో నెట్, స్లెట్, సెట్ పరీక్షలలో మెరిట్ సాధించిన వారికే యూజీసీ నిబంధనల మేరకు అడ్మిషన్లు ఇవ్వాలని నిర్ణయించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి తెలిపారు. అదేవిధంగా గైడ్స్ సమర్థత కూడా పరిగణనలోకి తీసుకోవాలని గవర్నర్ చెప్పారని తెలిపారు. ఇబ్బడిముబ్బడిగా పిహెచ్.డి అడ్మిషన్లు ఇవ్వవద్దని, పిహెచ్.డిలు కూడా మంచి సబ్జెక్టులపై చేసేలా శ్రద్ధ వహించాలని వీసీలకు గవర్నర్ సూచించారని ఉఫ ముఖ్యమంత్రి తెలిపారు.

దేశంలో రెండో స్థానం, దక్షిత భారతదేశంలో మొదటి స్థానం సంపాదించిన వ్యవసాయ విశ్వవిద్యాలయాన్ని గవర్నర్ అభినందించినట్లు ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి పేర్కొన్నారు. అదేవిధంగా గ్రామీణ వాతావరణం నుంచి వచ్చిన తెలుగు మీడియం విద్యార్థులను మంచి ఇంజనీర్లు, ఉద్యోగులుగా తీర్చిదిద్దుతున్న బాసర ట్రిపుల్ ఐటినీ కూడా గవర్నర్ కొనియాడినట్లు విద్యాశాఖ మంత్రి చెప్పారు. విశ్వవిద్యాలయాలు వాటికున్న ప్రత్యేకమైన రంగాల్లో సేవలను అవుట్ సోర్సింగ్ చేయడం వల్ల స్వయంవృద్ధి చెందాలని వీసీలకు సూచించారు. ప్రతి ఆరు నెలలకు ఒకసారి వీసీల సమావేశం పెట్టి విశ్వవిద్యాలయాల ప్రగతిని సమీక్షిస్తారని, ఆరు నెలలపై యాక్షన్ రిపోర్టు, భవిష్యత్ కార్యాచరణ ప్రణాళిక ఇవ్వాలని వీసీలను గవర్నర్ కోరినట్లు డిప్యూటీ సీఎం వెల్లడించారు. 

1651
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles