వంద శాతం పన్ను చెల్లిస్తే బైక్.. కొత్త సర్పంచ్ దంపతుల ఆఫర్..!

Sat,February 2, 2019 11:08 PM

Bike will be gifted for those who pay 100 percent taxes through lucky draw offer by new sarpanch

నిజామాబాద్: గ్రామస్తులు ఇంటి పన్ను సకాలంలో చెల్లించేలా ప్రోత్సహించడం కోసం కమ్మర్‌పల్లి మండలం కోనాసముందర్ గ్రామ సర్పంచ్ దంపతులు తమ సొంత ఖర్చుతో లక్కీ డ్రా స్కీం ప్రకటించారు. గ్రామాభివృద్ధిలో పన్నుల వసూలు ఎంతో కీలకమని పేర్కొంటూ, వంద శాతం పన్నులు చెల్లించిన వారికి లక్కీ డ్రా నిర్వహించి అందులో ఒకరికి బైక్‌ను తమ సొంత ఖర్చుతో అందజేస్తామని సర్పంచ్ ఇంద్రాల రూప, వార్డు సభ్యుడైన ఆమె భర్త ఇందాల్ర రాజు తమ ప్రమాణ స్వీకారం సందర్భంగా ప్రకటించారు.

టీఆర్‌ఎస్ నాయకులైన వీరు పంచాయతీ ఎన్నికల్లో ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ప్రమాణ స్వీకారం సందర్భంగా ఇంద్రాల రాజు మాట్లాడుతూ.. గ్రామంలో ఇంటి పన్ను బకాయిలు పేరుకు పోయినట్లు తెలిపారు. గ్రామం అభివృద్ధి చెందాలంటే ఇంటి పన్నులు వంద శాతం వసూలు కావాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఇక మీదట వంద శాతం పన్నులు చెల్లించిన వారి పేర్ల మీద తమ సొంత ఖర్చులతో లక్కీ డ్రా నిర్వహించి డ్రాలో విజేతకు బైక్ అందజేస్తామని తెలిపారు. ఇంద్రాల రాజు చేసిన ఈ ప్రకటనపై కార్యక్రమానికి హాజరైన గ్రామస్తుల నుంచి హర్షధ్వానాలతో పాటు అభినందనలు వ్యక్తమయ్యాయి.

కోనాసముందర్ గ్రామంలో 920 కుటుంబాలు ఉన్నాయి. 3,800 జనాభా ఉన్న ఈ గ్రామంలో టీఆర్‌ఎస్ మద్దతుదారు అయిన ఇంద్రాల రూప సర్పంచ్‌గా, ఆమె భర్త ఇందాల్ర రాజు వార్డు సభ్యుడుగా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గ్రామంలో రూ.8 లక్షల ఇంటి పన్ను బకాయిలు పేరుకుపోయాయి. ఈ మొత్తం వసూలైతే గ్రామాభివృద్ధికి ఎంతగానో దోహదపడనుందని ఈ సర్పంచ్ దంపతులు లక్కీ డ్రా ఆలోచన చేశారు.

4647
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles