కొండగట్టులో పెద్ద హనుమాన్ జయంతిని ఘనంగా నిర్వహించాలి

Wed,May 22, 2019 09:00 PM

big hanuman jayanthi to be celebrated on this month 29th and 30 in kondagattu

జగిత్యాల: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రకం కొండగట్టు శ్రీ ఆంజనేయ స్వామి సన్నిధానంలో ఈ నెల 29వ తేదీ నుంచి 30వ తేదీ వరకు నిర్వహించే పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలలో కొండపైకి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ శరత్, చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్‌ సంబంధిత అధికారులను ఆదేశించారు.

కొండ పైన ఉన్న అతిథి నివాస గృహంలో వివిధ శాఖలకు సంబంధించిన విభాగాధిపతులతో సమన్వయ సమావేశాన్ని జిల్లా కలెక్టర్ డాక్టర్ ఎ శరత్ అధ్యక్షతన చొప్పదండి ఎమ్మెల్యే సుంకె రవిశంకర్, జిల్లా ఎస్పీ సింధు శర్మ, కొండగట్లు ఆలయ ఈవో అమరేందర్‌తో కలిసి నిర్వహించారు.

ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. కొండపైకి వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలుగకుండా ఏర్పాట్లను చేయాలని, చిన్న జయంతి ఉత్సవాల్లో జరిగిన లోపాలు పునరావృతం కాకుండా చర్యలు చేపట్టాలన్నారు.

తడకల ప్రదేశంలో విద్యుత్ లైన్ల బిగింపును పకడ్బందీగా చేపట్టాలని, నాణ్యత లేని వైర్లతో విద్యుత్ లైన్లను ఏర్పాటు చేసినట్లయితే షార్ట్‌సర్క్యూట్ అయి ప్రమాదాలు సంభవించే అవకాశాలున్నాయని, నాణ్యత గల విద్యుత్ వైర్లనే వాడి వినియోగంలోకి తీసుకువచ్చేలా చర్యలు చేపట్టాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు.

భక్తుల రద్దీని బట్టి ఎండ వేడి ఎక్కువగా ఉంటున్నందున చలువ పందిళ్లతో పాటు మాల విరమణ మండపం వద్ద పెండ్యాల్ సిస్టమ్ ద్వారా నీడ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని సూచించారు. భక్తులు మాల విరమణ తర్వాత స్వామి వారి దర్శనం అనంతరం లడ్డూల కౌంటర్ వద్ద ఇబ్బందులు పడుతున్నారని, ఈసారి ఇబ్బందులు కలుగకుండా చర్యలు చేపట్టాలని, దానికి అనుగుణంగా అదనపు కౌంటర్లను ఏర్పాటు చేయాలని సూచించడంతో పాటు అదనపు కౌంటర్లకు అవసరమయ్యే సిబ్బందిని ఏర్పాటు చేయాలని జగిత్యాల ఆర్డీవో ఘంటా నరేందర్ కు సూచించారు.

అనంతరం పోలీసు శాఖపై సమీక్షిస్తూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా బందోబస్తును చేపట్టాలని జిల్లా ఎస్పీ సింధు శర్మకు సూచించగా బారీకేడ్లలో ఎక్కడికక్కడ పలు ఎమర్జెన్సీ ద్వారాలు ఏర్పాటు చేయాలని, వీఐపీల పార్కింగ్‌కు అన్నదానం పక్కన చదును చేయించడం ద్వారా సుమారు ఆరెకరాలు వినియోగంలోకి తీసుకువస్తామని ఎస్పీ సింధు శర్మ కలెక్టర్‌కు తెలిపారు. 600 మంది సిబ్బందితో పటిష్టమైన బందోబస్తు నిర్వహించనున్నట్లు కలెక్టర్‌కు ఎస్పీ తెలిపారు. ఆర్టీసీ శాఖ ఆధ్వర్యంలో పార్కింగ్ స్థలాల నుంచి ఆలయంలోని వై జంక్షన్ వరకు ఉచిత రవాణా సదుపాయాన్ని కల్పించాలని కలెక్టర్ ఆర్టీసీ అధికారులకు సూచించారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా తాగునీరు, కోనేటిలో నీటిని ఏర్పాటు చేస్తే ఎలాంటి సమస్య తలెత్తదని ఆలయ అధికారులకు కలెక్టర్ ఆదేశించారు.

2725
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles