
ఆదిలాబాద్ : రాష్ట్రంలో వివిధ వర్గాల పేద విద్యార్థులకు మెరుగైన విద్యనందించేందుకు 119 రెసిడెన్షియల్ పాఠశాలలను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే జోగురామన్న అన్నారు. పేద విద్యార్థులకు కార్పొరేట్ విద్యను అందించడమే కాకుండా.. స్టడీ సర్కిళ్ల ద్వారా వారికి శిక్షణ ఇచ్చి ఉద్యోగాలు పొందేందుకు ప్రభుత్వం కృషి చేస్తుందని తెలిపారు. ఇవాళ జిల్లా కేంద్రం సమీపంలోని దస్నాపూర్లో రూ.3.75 కోట్లతో నిర్మించిన బీసీ స్టడీ సర్కిల్ భవనాన్ని జోగురామన్న ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పేద విద్యార్థులు మైనార్టీ, ఎస్టీ, ఎస్సీ, బీసీ స్టడీ సర్కిళ్ల ద్వారా ఉచితంగా శిక్షణ ఇస్తున్నట్లు తెలిపారు. అన్ని వర్గాల సంక్షేమానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. బ్రహ్మణ పరిషత్, రెడ్డి కార్పొరేషన్, ఇతర కార్పొరేషన్ల ద్వారా ఆయా వర్గాల్లోని పేదల ఉపాధిని మెరుగుపరుస్తున్నట్లు చెప్పారు. సంక్షేమ పథకాల అమలులో తెలంగాణ దేశంలో అన్ని రాష్ర్టాలకు ఆదర్శంగా నిలుస్తుందని పేర్కొన్నారు.