ప్రతీ పదివేల మందికి ఒక బస్తీ దవాఖాన

Fri,February 22, 2019 03:38 PM

Basti Hospitals in Hyderabad every 10 thousand people

హైదరాబాద్‌ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్‌లో వైద్య సేవలను మరింత విస్తరించేందుకు, పేదలందరికీ వైద్యాన్ని అందుబాటులోకి తెచ్చేందుకు ప్రభుత్వం కృషి చేస్తున్నదని సీఎం కేసీఆర్‌ వెల్లడించారు. ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఈ అంశాలను పేర్కొన్నారు. పేదలందరికీ వైద్యం అందించేందుకు ప్రతీ పదివేల మందికి ఒకటి చొప్పున బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేస్తున్నామని స్పష్టం చేశారు. ఇప్పటికే 40 బస్తీ దవాఖానాలు సేవలందిస్తున్నాయని చెప్పారు. బస్తీ దవాఖానాల్లో ప్రాథమిక వైద్యం, రోగ నిర్ధారణ పరీక్షలతో పాటు ఉచితంగా మందులు ఇస్తున్నట్లు కేసీఆర్‌ వెల్లడించారు.

రాష్ట్ర వ్యాప్తంగా వైద్య విద్యను, సేవలను మరింత విస్తరించేందుకు కొత్తగా నాలుగు వైద్య కళాశాలలను ప్రభుత్వం మంజూరు చేసిందన్నారు. సిద్దిపేట, మహబూబ్‌నగర్‌లో వైద్య కళాశాలలు ప్రారంభం అయ్యాయని, సూర్యాపేట, నల్లగొండలో వచ్చే విద్యా సంవత్సరం నుంచి ప్రారంభం అవుతాయన్నారు. సమైక్య ఆంధ్రప్రదేశ్‌లో తెలంగాణలోని పది జిల్లాల్లోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొనుగోలు కోసం కేవలం రూ. 146 కోట్లు ఖర్చు పెడితే.. దీన్ని తెలంగాణ రాష్ట్రంలో మూడింతలు పెంచి ప్రతీ ఏటా రూ. 440 కోట్లు మందుల కొనుగోలు కోసం ప్రభుత్వం వెచ్చిస్తుందన్నారు. దేశవ్యాప్తంగా అత్యుత్తమ సేవలందించే మూడు రాష్ర్టాల్లో తెలంగాణ రాష్ట్రం ఒకటని కేంద్ర ప్రభుత్వం ఇటీవలే ప్రకటించిందని కేసీఆర్‌ తెలిపారు. దేశంలో ఎక్కడా లేని విధంగా ప్రభుత్వ ఆస్పత్రిలో మరణించిన వారి మృతదేహాలను ఉచితంగా తరలించేందుకు పరమపద వాహనాలను ప్రభుత్వం ప్రవేశపెట్టిందని సీఎం కేసీఆర్‌ తెలిపారు.

1746
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles