చిన్నారి కిడ్నాప్ మిస్టరీ వీడింది...

Thu,March 21, 2019 08:20 AM

baby kidnapped mystery solved in hyderabad

హైదరాబాద్ : బోరబండ మోతీనగర్‌లో 18 రోజుల క్రితం కిడ్నాప్‌కు గురైన ఐదు నెలల చిన్నారి అమ్ములు కిడ్నాప్ మిస్టరీ వీడింది. పాపను ఎత్తుకెళ్లిన మహిళతో పాటు ఆమెకు సహకరించిన ముగ్గురు ఆటోడ్రైవర్లను ఎస్సార్ నగర్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఎస్‌ఐ మహేందర్ కథనం ప్రకారం..... ఖమ్మం జిల్లా గొల్లపాడుకు చెందిన షబానా(35)కు మొదటి భర్తతో మనస్పర్థాలు వచ్చి విడాకులు తీసుకుంది. షబానా చేసిన ఓ రాంగ్ కాల్ కర్ణాటక బీదర్ జిల్లా మన్నెకల్‌కు చెందిన జలీల్(24)తో పరిచయం ఏర్పడింది. అలా వాళ్లిద్దరూ ప్రేమించుకుని పెండ్లి చేసుకున్నారు. పెండ్లి అయి రెండేండ్లు అవుతున్నా సంతానం లేదు. అయితే భర్త దూరం అవుతాడని గర్భం దాల్చానని షబానా అబద్ధం ఆడింది. కాన్పు కోసం పుట్టింటికి వెళ్తున్నానని నగరంలోని బోరబండలో బంధువుల ఇంటికి వచ్చింది. పాప కోసం ప్రయత్నాలు మొదలు పెట్టింది. సంగారెడ్డికి చెందిన రాములు, అరుణ దంపతులు నివాసం ఉండే మోతీనగర్‌లోని ఫుట్‌పాత్ వద్దకు వెళ్లి మీ పాపను ఇస్తే లక్ష రూపాయలిస్తా చెప్పగా వారు నిరాకరించారు. అయితే ఎలాగైనా ఈ బిడ్డను ఎత్తుకెళ్లాలని పథకం వేసింది.

ఇందులో భాగంగా భరత్ నగర్‌కు చెందిన ఆటో డ్రైవర్ ఎజాజ్‌ను(24)ను కలిసింది. అతను బోరబండ స్వారజ్‌నగర్‌కు చెందిన ఇస్మాయిల్ (24), సురేశ్ (50)లకు చెప్పాడు. ఈ నలుగురు కలిసి ఈ నెల 2న అర్ధరాత్రి మోతీనగర్‌లోని ఫుట్‌పాత్ వద్దకు చేరుకున్నారు. ఇస్మాయిల్, సురేశ్ పాపను ఎత్తుకొచ్చి షబానాకు ఇచ్చారు. అదే ఆటోలో మన్నెకేలి గ్రామంలోని అత్తింటికి చేరుకుంది. కిడ్నాప్‌నకు సహకరించిన ఆటో డ్రైవర్ ఎజాజ్‌కు రూ.20 వేలు ఇచ్చి.. మిగతా రూ.80వేలు కూడా ఇస్తానని చెప్పగా వారు వెళ్లిపోయారు.

చిన్నారి అమ్ములును కిడ్నాప్ చేశారని తల్లిదండ్రులు ఎస్సార్ నగర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. సీసీ ఫుటేజీలు పరిశీలించినా ఎలాంటి క్లూ లభించలేదు. ఇదిలా ఉండగా.. షబానా డబ్బులు ఇవ్వడంలేదని ఆ ముగ్గురు రౌడీ షీటర్ ఫిరోజ్‌కు తెలిపారు. దీంతో అతను సైబరాబాద్ ఎస్‌ఓటీ పోలీసులకు సమాచారం అందించాడు. రౌడీ షీటర్ సూచనతో ఎజాజ్, సురేశ్, ఇస్మాయిల్‌లు నార్సింగి ఎస్‌ఓటీ పోలీసులకు లొంగిపోయారు. వారు ఇచ్చిన సమాచారంతో పోలీసులు మన్నెకేలికి వెళ్లి బాలికను తీసుకొచ్చి ఎస్సార్ నగర్ పోలీసులకు అప్పగించారు. దీంతో పోలీసులు షబానాతో పాటు ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. చిన్నారి అమ్ములను తల్లిదండ్రులకు అప్పగించారు. నిందితులను గురువారం రిమాండ్‌కు తరలిస్తామని ఎస్సై మహేందర్ తెలిపారు.

1559
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles