అంగన్‌వాడీలను ఆదుకున్నది తెలంగాణ ప్రభుత్వమే: స్పీకర్

Sun,April 8, 2018 07:34 PM

Assembly speaker madhusudana chari attends Anganwadi teachers and helpers meeting

వరంగల్: అంగవాడీలను ఆదుకున్నది తెలంగాణ రాష్ట్ర ప్ర‌భుత్వ‌మేన‌ని శాసనసభ స్పీకర్ సిరికొండ మధుసూదనాచారి అన్నారు. హన్మకొండలోని తారా గార్డెన్‌లో ఆదివారం అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ ఆత్మీయ ఐక్యత మహాసభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు.

తెలంగాణ ప్రభుత్వం ఏర్పడ్డాక అడగకముందే అంగన్‌వాడీల సమస్యలను తెలుసుకుని వారికి జీతాలు పెంచిన ఘనత ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకే దక్కుతుందని అన్నారు. గత ప్రభుత్వాల హయాంలో తమ సమస్యలను విన్నవించిన సందర్భంలో పోలీసులతో లాఠీచార్జీలు చేయించిన ఘనత అప్పటి పాలకులకే సాధ్యపడిందన్నారు. ప్రభుత్వం ఆశయాలను ప్రజల చెంతకు చేర్చి సక్రమంగా నెరవేరిస్తే ప్రభుత్వమే గుర్తించి వారికి ఉన్నటువంటి సమస్యలను తీరుస్తుందని అన్నారు.

తెలంగాణ ఉద్యమంలో అంగన్‌వాడీలదే కీలకపాత్ర అని గుర్తు చేశారు. ప్రభుత్వ పథకాలను సక్రమంగా నడిపిస్తే ఆశించిన దాని కంటే ఫలితాలను అందిస్తుందని అన్నారు. మహిళల ఐక్యతే రాష్ట్ర అభివృద్ధికి సూచిక అని, దేశంలో ఎక్కడా లేని విధంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మహిళలకు, అంగన్‌వాడీ టీచర్స్‌కు అండగా ఉంటుందని అన్నారు.

ఈ కార్యక్రమంలో వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే దాస్యం వినయ్‌భాస్కర్, స్టేషన్ ఘన్‌పూర్ ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య, కుడా చైర్మన్ మర్రి యాదవరెడ్డి, తెలంగాణ రాష్ట్ర ఆగ్రోస్ చైర్మన్ లింగంపల్లి కిషన్‌రావు, మాజీ కార్పొరేటర్ కల్పన, తెలంగాణ అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుమాంజలి, జిల్లా అధ్యక్షురాలు సరోజ, ప్రధాన కార్యదర్శి సరస్వతి, ఉపాధ్యక్షురాలు అనిత కుమారి, మహిళా కో ఆర్డినేటర్ కమరున్నీసాబేగం, వరంగల్ అర్బన్ జిల్లా అంగన్‌వాడీ టీచర్స్, హెల్పర్స్, తదితరులు పాల్గొన్నారు.

2360
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS