ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి కేసు కొట్టివేత

Mon,July 15, 2019 09:32 PM

ASI Mohan Reddy case dismissed

కరీంనగర్ : కరీంనగర్‌లోని జ్యోతినగర్‌కు చెందిన కెన్‌క్రెస్ట్ పాఠశాల యజమాని ప్రసాద్‌రావు ఆత్మహత్య కేసు విషయంలో ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డితో పాటు ఆయన 9 మంది అనుచరులను నిర్దోషులుగా పేర్కొంటూ కరీంనగర్ కోర్టు న్యాయమూర్తి సతీశ్‌కుమార్ తీర్పునిచ్చారు. ఏఎస్‌ఐ మోహన్‌రెడ్డి అక్రమ వడ్డీ వ్యాపారాలు ప్రసాదరావు ఆత్మహత్యతో వెలుగుచూసిన విషయం తెలిసిందే. ఈ విషయంలో మోహన్‌రెడ్డి, అతని అనుచరులు ప్రసాద్‌రావును హత్య చేసినట్లు వారిపై మొట్టమొదటిగా కరీంనగర్ టూటౌన్ పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. కెన్‌క్రెస్ట్ పాఠశాల యజమాని రామవరం ప్రసాద్‌రావు రామగుండం ఎన్టీపీసీలో పీవీ కశ్యప్, వీఆర్ రావ్‌తో కలిసి హీరోహోండా వ్యాపారం నిర్వహించేవారు.

గంగాధర మండం కురిక్యాల గ్రామంలో పెద్ద ఎత్తున కెన్‌క్రెస్ట్ ఇంటర్నేషనల్ స్కూల్ నిర్మించగా ఆర్థికంగా నష్టపోయాడు. దీంతో ఏఎస్‌ఐ బొబ్బల మోహన్‌రెడ్డి వద్ద నుంచి రూ.75 లక్షలు 2013లో అప్పుగా తీసుకున్నాడు. హీరోహోండా షోరూంలో పార్ట్‌నర్స్ నుంచి, మోహన్‌రెడ్డి నుంచి అప్పు చెల్లించాలంటూ వేధింపులకు గురయ్యాడు. ఇందులో మోహన్‌రెడ్డి ప్రసాద్‌రావుతో పాటు కుటుంబీకులను తీవ్రంగా బెదిరింపులకు గురి చేశాడు. దీంతో వేదన భరించలేక తీవ్ర మనస్తాపం చెంది 2015 అక్టోబర్ 28న రాత్రి జ్యోతినగర్‌లోని తన ఇంట్లో ఫ్యాన్‌కు చున్నీ కట్టి ఉరేసుకుని చనిపోయాడు. తన చావుకు పీవీ కశ్యప్, వీఆర్ రావ్, బొబ్బల మోహన్‌రెడ్డి కారణమంటూ సూసైడ్ నోట్ రాసి ఉంచాడు. మరుసటి రోజు ప్రసాద్‌రావు భార్య గౌమతి టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా సీఐ హరిప్రసాద్ కేసు నమోదు చేశారు.

ఈ కేసు సంచలనం సృష్టించగా దీనిని హైదరాబాద్ సీఐడీ పోలీసులకు బదిలీ చేశారు. ఇన్‌స్పెక్టర్ శ్రీనివాస్‌రావు 56 మంది సాక్షులను విచారించి పలు కీలక డాక్యుమెంట్లను స్వాధీనం చేసుకున్నారు. దర్యాప్తు తదుపరి డీఎస్పీ ద్రోణాచార్యులు కోర్టులో మోహన్‌రెడ్డితో పాటు ఆయన అనుచరులు 9 మందిపై చార్జిషీటు దాఖలు చేశారు. తొలుత పీవీ కశ్యప్, వీఆర్ రావును నిందితులుగా పేర్కొన్నప్పటికీ దర్యాప్తులో వారిపై సరైన అభియోగం లేనందున వారిపై చార్జిషీట్‌లో పేర్లు నమోదు చేయలేదు. ప్రాసిక్యూషన్ తరుపున సీఐడీ పోలీసులు 49 మంది సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టారు. సాక్ష్యాధారాలు పరిశీలించిన న్యాయమూర్తి సతీశ్‌కుమార్ నిందితులైన బొబ్బల మోహన్‌రెడ్డి, సింగిరెడ్డి కరుణాకర్‌రెడ్డి, సింగిరెడ్డి జితేందర్‌రెడ్డి, కక్కెర్ల పర్శరాములు, హరీశ్, సింగిరెడ్డి మహిపాల్‌రెడ్డిని నిర్దోషులుగా పేర్కొంటూ తీర్పు చెప్పారు.

898
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles