వరుసగా తొమ్మిదోసారి పతంగికే పట్టం కట్టిన ఓటర్లు

Fri,May 24, 2019 07:15 AM

asaduddin owaisi elected 9th time

హైదరాబాద్‌ : ఎంఐఎం పార్టీకి కంచుకోటగా ఉన్న పాతనగరంలో మరోసారి ప్రభంజనం సృష్టించింది. వరుసగా తొమ్మిదోసారి హైదరాబాద్‌ పార్లమెంట్‌ పరిధిలోని ఓటర్లు పతంగి పార్టీకే పట్టం కట్టారు. కాగా మాస్‌ లీడర్‌గా పేరుగాంచిన ఎంఐఎం అధినేత అసదుద్దీన్‌ ఒవైసీని వరుసగా నాలుగోసారి విజయం వరించింది. గతంలోకంటే బుధవారం వెలువడిన సార్వత్రిక ఎన్నికల పలితాల్లో కాస్తా మెజార్టీ తగ్గినప్పటికీ ఒవైసీనే గెలుపుబావుటా ఎగురవేశారు. అయితే కమలం పార్టీ రెండో స్థానంతోనే సరిపెట్టుకోగా కారు స్పీడు పెంచి ఓటు బ్యాంకును భారీగా కూడగట్టుకుని మూడో స్థానంలో నిలిచింది. కాంగ్రెస్‌ పార్టీ కాకావికలమై నాలుగోస్థానానికి పడిపోయింది.

హైదరాబాద్‌ లోక్‌సభ సీటుపై మరోమారు ఎంఐఎం జెండా ఎగిరింది. పాతనగరం గడ్డపై పంతంగి రెపరెపలాడింది. సార్వత్రిక ఎన్నికల్లో సత్తాచాటుకుని హైదరాబాద్‌ సీటు తమదేనని చాటుకుంది. హైదరాబాద్‌ ఎంపీగా ఎంఐఎం పార్టీ అధ్యక్షుడు అసదుద్దీన్‌ ఒవైసీ వరుసగా నాలుగోసారి పార్లమెంట్‌కు ఎన్నికయ్యారు. తన సమీప ప్రత్యర్థి బీజేపీ అభ్యర్థి డా.భగవంతరావుపై 2,82,186 ఓట్ల మోజార్టీతో ఘన విజయం సాధించారు. 2014లోనూ డా.భగవంతరావుపైనే అసదుద్దీన్‌ గెలుపొందగా, తాజాగా ఆయనపైనే మరోమారు విజయం సాధించారు. సార్వత్రిక ఎన్నికల ఓట్ల లెక్కింపులో భాగంగా గురువారం గ్రేటర్‌లోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో ఓట్లను లెక్కించారు. ఒక్కో అసెంబ్లీ సెగ్మెంట్‌కు ఒక్కో దగ్గర ఓట్ల లెక్కింపు చేపట్టగా, మొదటి రెండు రౌండ్లలో భగవంతరావు అధిక్యాన్ని ప్రదర్శించారు. అ తర్వాత క్రమంగా పుంజుకున్న అసద్‌.. ఒక్కో రౌండ్‌కు తన అధిక్యతను ప్రదర్శించారు. మొత్తం 22 రౌండ్లకు గాను 20 రౌండ్లలో అసద్‌, 2 రౌండ్లలో భగవంతరావు అధిక్యతను ప్రదర్శించారు. తుది ఓట్ల లెక్కింపు ముసిగేసరికి డా.భగవంతరావుపై 2, 82,186 ఓట్ల అధిక్యతను ప్రదర్శించి గెలుపొందినట్లుగా అధికారులు ప్రకటించారు.కౌంటింగ్‌ ముగిసేసరికి ఎంఐఎం అభ్యర్థి అసదుద్దీన్‌ 5,17,471 ఓట్లు, టీఆర్‌ఎస్‌ అభ్యర్థి పుస్తె శ్రీకాంత్‌ 63,239 ఓట్లు, బీజేపీ అభ్యర్థి ఎం.భగవంతరావు 2,35,285 ఓట్లు, కాంగ్రెస్‌ అభ్యర్థి ఫిరోజ్‌ ఖాన్‌ 49,944 ఓట్లు సాధించారు.

కౌంటింగ్‌లో కాస్త గందరగోళం..

ఓట్ల లెక్కింపు సందర్భంగా జరిగిన చిన్న పొరపాటు కారణంగా కొద్దిసేపు గందరగోళం నెలకొంది. 5వ రౌండ్‌ ముగిసేసరికి ఎంఐఎం 25,844 ఓట్ల అధిక్యతను ప్రదర్శించినట్లుగా ప్రకటించారు. అయితే అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా కూడిక చేసే సమయంలో పొరపాటు జరిగిందని, దీంతో తేడాలున్నట్లుగా గ్రహించి రీ కౌంటింగ్‌ చేయడానికి సిద్ధపడ్డారు. దీనిపై బీజేపీ ఏజెంట్లు కొంత మంది అభ్యంతరం వ్యక్తంచేయగా, కల్పించుకున్న అధికారులు, చివరకు అభ్యర్థుల సందేహాలను నివృత్తి చేసిన అధికారులు 5వ రౌండ్‌ వరకు గల ఓట్లను లెక్కించి, ఎంఐఎం 30,728 ఓట్ల అధిక్యతలో ఉన్నట్లుగా ప్రకటించారు. ఆ తర్వాత కౌంటింగ్‌ ప్రక్రియ సజావుగా కొనసాగించారు.

ఎంఐఎంకు పెట్టని కోట..

హైదరాబాద్‌ పార్లమెంట్‌కు మొత్తం 16 సార్లు ఎన్నికలు జరుగగా ఎంఐఎం పార్టీయే అత్యధిక సార్లు గెలిచింది. 1984 నుంచి ఇక్కడ ఎంఐఎం పార్టీ అధిపత్యాన్ని తట్టుకుని నిలిచిన వారు లేకపోవడం గమనార్హం. ప్రస్తుత ఎంపీ అసదుద్దీన్‌ ఒవైసీ తండ్రి సలావుద్దీన్‌ 6 సార్లు, అసదుద్దీన్‌ 3 సార్లు మొత్తంగా 9 సార్లు ఒవైసీ కుటుంబ సభ్యులు ఇక్కడి నుంచి ప్రాతినిధ్యం వహించగా, తాజాగా నాలుగోసారి అదే కుటుంబానికి చెందిన అసదుద్దీన్‌ గెలుపొందారు. గతంలో 1962లో మొదట ఒవైసీ కుటుంబసభ్యులు హైదరాబాద్‌ పార్లమెంట్‌కు పోటీచేశారు. సలావుద్దీన్‌ ఒవైసీ తండ్రి అబ్దుల్‌ వాహీద్‌ ఒవైసీ స్వతంత్య్ర అభ్యర్థిగా పార్లమెంట్‌కు తలపడి 43,069 ఓట్ల తేడాతో ఓడిపోయారు. తర్వాత 1977లో సలావుద్దీన్‌ ఒవైసీ ఒకసారి కాంగ్రెస్‌ అభ్యర్థి కేఎస్‌ నారాయణ చేతిలో పరాజితులయ్యి, తర్వాత 1980లో పోటీకి దూరంగా ఉండి, 1984లో పోటీచేసి గెలుపొందారు. అప్పటి నుంచి 2019 వరకు వరుసగా ఆ కుటుంబమే గెలుస్తూ వస్తుండటం విశేషంగా చెప్పుకోవచ్చు.

చదువుకున్న కాలేజీలోనే గెలుపు..

అసదుద్దీన్‌ ఒవైసీ తాను చదువుకున్న కాలేజీలోనే ఎంపీగా గెలిచినట్లుగా ధ్రువీకరణ పత్రాన్ని అందుకోవడం గమనార్హం. విద్యార్థిగా అసదుద్దీన్‌ ఒవైసీ నిజాం కాలేజీలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్ట్స్‌ (బీఏ) విద్యను పూర్తిచేశారు. హైదరాబాద్‌ లోక్‌సభ ఎన్నికల ఓట్ల లెక్కింపును నిజాం కాలేజీ గ్రంథాలయ భవనంలో చేపట్టడం, అక్కడే రిటర్నింగ్‌ అధికారి (ఆర్‌వో) జిల్లా కలెక్టర్‌ మాణిక్‌రాజ్‌ కన్నన్‌ చేతులమీదుగా అందుకున్నారు. స్వతహాగా క్రికెట్‌ క్రీడాకారుడైన అసదుద్దీన్‌ సౌత్‌ జోన్‌ ఇంటర్‌ యూనివర్సిటీ క్రికెట్‌ టీమ్‌కు ఎంపికై బౌలర్‌గా అద్భుత ప్రదర్శనను కనబరిచి సౌత్‌ జోన్‌ యూనివర్సిటీ క్రికెట్‌ టీమ్‌కు ప్రాతినిధ్యం వహించారు.

నాలుగో స్థానంలో కాంగ్రెస్‌..

అంతో ఇంతో బలం ఉందనుకున్న కాంగ్రెస్‌ హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో నాలుగోస్థానంలో నిలవడం గమనార్హం. అసెంబ్లీ ఎన్నికల్లోనూ కాస్త సత్తా చాటుకున్న కాంగ్రెస్‌ పార్లమెంట్‌ ఎన్నికల్లో ఢీలా పడింది. ముస్లిం అభ్యర్థిగా రంగంలోకి దిగిన ఆ పార్టీ అభ్యర్థి మహ్మద్‌ ఫిరోజ్‌ ఖాన్‌ ఏ మాత్రం పోటీ ఇవ్వలేకపోయారు. కనీసం ఏ రౌండ్‌లోనూ అధిక్యతను ప్రదర్శించలేకపోయారు. అయిదు సార్లు ఈ నియోజకవర్గం నుంచి ప్రాతినిధ్యం వహించడం, గోషామహల్‌లో మాజీ మంత్రి ముఖేశ్‌గౌడ్‌ బలమైన నేతగా ఉన్నా, కాంగ్రెస్‌ కనీసం సోదిలో లేకుండా పోవడంతో ఆ పార్టీ శ్రేణులు నిరాశలో మునిగిపోయాయి. ఇది వరకు 12 శాతం ఓట్లను సాధించిన కాంగ్రెస్‌ ఈ సారి కేవలం 49, 944 ఓట్లను మాత్రమే సాధించింది. గతంలో 2 లక్షలకు పైగా ఓట్లను సాధించిన కాంగ్రెస్‌ పరిస్థితి దిగజారడం, ఓట్లను కోల్పోవడం ఆ పార్టీ దుస్థితిని చెప్పకనే చెబుతున్నది.

సత్తాచాటుకున్న టీఆర్‌ఎస్‌..

హైదరాబాద్‌ పార్లమెంట్‌ స్థానంలో స్నేహపూర్వకపోటీలో భాగంగా పుస్తే శ్రీకాంత్‌కు టీఆర్‌ఎస్‌ టికెట్‌ను కేటాయించింది. టికెట్‌ పొందిన తర్వాత పుస్తే శ్రీకాంత్‌ తన ప్రచారాన్ని ముమ్మరంచేసి ఓటర్లను ఆకట్టుకునే ప్రయత్నం చేశారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలను వివరిస్తూ.. ఓటర్ల మద్ధతును కూడగట్టారు. టీఆర్‌ఎస్‌ ప్రయోగం, పుస్తె శ్రీకాంత్‌ ప్రయత్నం ఫలితంగా హైదరాబాద్‌ లోక్‌సభ స్థానంలో టీఆర్‌ఎస్‌ సత్తాచాటుకుంది. మొత్తంగా 63,239 ఓట్లను సాధించి మూడో స్థానంలో నిలవడం గమనార్హం. 2014 పార్లమెంట్‌ ఎన్నికల్లో ఇక్కడి నుంచి రషీద్‌ షరీఫ్‌ను టీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా నిలుపగా, ఆయన కేవలం 37,195 ఓట్లను మాత్రమే సాధించారు. కానిప్పుడు పుస్తే శ్రీకాంత్‌ సుమారుగా 30 వేల ఓట్లను అధనంగా పొందడం ప్రత్యేకతగా చెప్పుకోవచ్చు.

3043
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles