రాష్ట్రంలో కొత్తగా మరో 40 పురపాలక సంస్థలు

Tue,November 14, 2017 11:15 PM

Another 40 new municipalities in the Telangana state

హైదరాబాద్ : ప్రభుత్వ పథకాలను ప్రజలకు మరింత చేరువచేసేందుకు, పరిపాలన సౌలభ్యంకోసం కొత్త మున్సిపాల్టీలను ఏర్పాటుచేయాల్సిన అవసరం ఉందని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి కే తారక రామారావు అన్నారు. 15వేలకు మించి జనాభా ఉన్న మేజర్ గ్రామపంచాయతీలను పట్టణపురపాలికలుగా మార్చాలని చెప్పారు. అదేవిధంగా పురపాలక సంస్థల పరిధిని విస్తరించి, వాటికి మూడు నుంచి ఐదు కిలోమీటర్ల పరిధిలో ఉన్న గ్రామాలను విలీనం చేయాలని చెప్పారు. ప్రభుత్వం వద్ద ఉన్న సమాచారం మేరకు.. రాష్ట్రంలో కొత్తగా మరో 40 పురపాలక సంస్థలు ఏర్పడే అవకాశం ఉందని తెలిపారు. పురపాలక సంస్థల్లో అభివృద్ధి కార్యక్రమాలపై జిల్లా కలెక్టర్లతో మంత్రి కేటీఆర్ మంగళవారం వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు.

ఈ సందర్భంగా రానున్న రోజుల్లో పట్టణాల అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యలపై పలు ఆదేశాలు జారీచేశారు. స్థానిక ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా, పరిపాలన సౌలభ్యం కోసం కొత్త మున్సిపాల్టీలను ఏర్పాటుచేస్తున్నట్టు మంత్రి తెలిపారు. ఇప్పటికే రామాయంపేట, బాన్సువాడ, నర్సాపూర్ వంటి మేజర్ గ్రామ పంచాయతీలను పట్టణ స్థానిక సంస్థలుగా మార్చాలని పలు వినతులు వచ్చినట్లు మంత్రి తెలిపారు. ఇప్పటికే అనేక పట్టణాల మధ్యలో మేజర్ గ్రామ పంచాయతీలున్నాయని, వాటివల్ల వివిధ పథకాల అమలు, అనుమతులు, పరిపాలనా పద్ధతుల్లోని భిన్నత్వం వలన ప్రజలకు ఇబ్బందులు కలుగుతున్నాయన్నారు.

ఈ సమస్యను అధిగమించడానికి కొత్త పురపాలికలు, గ్రామ పంచాయతీల విలీనానికి నిర్ణయించామన్నారు. దీంతో, ఆయా పట్టణాల్లో పెరుగుతున్న పట్టణీకరణ సమస్యలను ఎదుర్కొనేందుకు అవకాశం ఉంటుందని చెప్పారు. ఈ మేరకు కలెక్టర్లు స్థానిక పరిస్థితులకు అనుగుణంగా నివేదికలు అందించాలని ఆదేశించారు. ముఖ్యంగా పట్టణాలకు అనుకుని ఉన్న గ్రామాలను కలుపుకొని, క్రమానుగత పద్ధతిలో పట్టణీకరణకు అవసరమైన పలు చర్యలను మంత్రి ఈ వీడియో కాన్ఫరెన్సులో వివరించారు. 2011 జనాభా లెక్కలు, సమగ్ర కుటుంబ సర్వే ఆధారంగా 15 వేలు మించి జనాభా ఉన్న గ్రామ పంచాయతీల వివరాలను అందజేయాలని చెప్పారు. ప్రస్తుత పంచాయతీల కాలపరిమితి వచ్చే ఏడాది జులైలో ముగుస్తున్న నేపథ్యంలో, ఎంపికచేసిన గ్రామ పంచాయతీలను డీనోటిఫై చేసి, చట్టబద్ధంగా వాటిని తిరిగి పురపాలక సంస్థలుగా నోటిఫై చేయాల్సి ఉంటుందన్నారు.

ఈ మేరకు ప్రస్తుత చట్టం ప్రకారం తీసుకోవాల్సిన చర్యలను మంత్రి కలెక్టర్లకు వివరించారు. ఈ మొత్తం ప్రక్రియలో సాధ్యమైనన్నీ ఎక్కువ గ్రామ పంచాయతీలనుంచి నూతన పురపాలక సంస్థల ఏర్పాటు, ప్రస్తుతం పురపాలికల్లో విలీనం కోసం తీర్మానాలు తీసుకోవాల్సిందిగా కోరారు. ఈ విషయంలో స్థానిక పంచాయతీ రాజ్ శాఖ అధికారుల సహాయ సహకారాలు తీసుకోవాలన్నారు.

1982
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS