''మా సైట్లో ఫలానా బ్యాంక్ క్రెడిట్ లేదా డెబిట్ కార్డుతో కొనుగోలు చేయండి. మీకు క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తుంది. లేదంటే రివార్డు పాయింట్లు వస్తాయి..!'' అని ఈ-కామర్స్ సైట్లు ప్రచారం చేయడం మనం చూస్తూనే ఉంటాం. దీంతో సహజంగానే అలాంటి ఆఫర్లకు ఆకర్షితులయ్యే వినియోగదారులు వస్తువులను కొనుగోలు చేస్తారు. ఈ క్రమంలో క్యాష్ బ్యాక్ ఆఫర్ వస్తుందని ఆశిస్తారు. అయితే అది జరిగితే ఓకే. లేదంటే... ఇదిగో ఈ వ్యక్తికి జరిగినట్టే అవుతుంది. ఇంతకీ అసలు విషయం ఏమిటంటే...
అతని పేరు సుశాంత్ భోగా. కుత్బుల్లాపూర్‌లో నివాసం ఉంటున్నాడు. అయితే 2014 డిసెంబర్ 20న ఇతను అమెజాన్ సైట్లో యాపిల్ ఐఫోన్ 5సీ కొనుగోలు చేశాడు. సిటీ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొనుగోలు చేస్తే రూ.6500 క్యాష్ బ్యాక్ వస్తుందని వెబ్సైట్లో పేర్కొనడంతో అతను ఆ విషయాన్ని కాల్ సెంటర్‌కు ఫోన్ చేసి ధృవీకరించుకున్నాడు. ఆ తరువాత ఆ కార్డుతో ఐఫోన్ కొన్నాడు. అయితే ఎన్ని రోజులు అయినా క్యాష్ బ్యాక్ రాలేదు. దీంతో సుశాంత్ మొదట జూన్ 7, 2015న అంతర్జాతీయ వినియోగదారుల హక్కుల పరిరక్షణ మండలిలో ఫిర్యాదు చేశాడు. కానీ అక్కడ కూడా సుశాంత్‌కు నిరాశే ఎదురైంది.
అయినప్పటికీ సుశాంత్ వదల్లేదు. అమెజాన్ ఇండియా వెబ్సైట్ ఎండీని ప్రతివాదిగా పేర్కొంటూ అతను హైదరాబాద్ జిల్లా ఫోరాన్ని ఆశ్రయించాడు. దీంతో ఎట్టకేలకు ఫోరం స్పందించింది. ఇరు పక్షాల వాదనలను ఫోరం ఆలకించింది. అయితే తమ సైట్లో పెట్టిన ఆఫర్‌కు తమకు ఎలాంటి సంబంధం లేదని, అది తమ వెబ్సైట్లో వస్తువులను విక్రయించే థర్డ్ పార్టీ వ్యక్తి పెట్టాడని అమెజాన్ వాదించింది. ఈ వాదనతో ఫోరం సంతృప్తి చెందలేదు. వెబ్సైట్లో ఏది పెట్టినా అందుకు సైట్ యాజమాన్యం బాధ్యత వహించాలని ఫోరం చెప్పింది. ఈ క్రమంలో బాధితుడు సుశాంత్‌కు రూ.15వేల నష్టపరిహారంతోపాటు ఖర్చుల నిమిత్తం రూ.5వేలను మొత్తం కలిపి రూ.20వేలను చెల్లించాలని తీర్పు ఇచ్చింది.