'ఓట్ ఆన్ అకౌంట్' ప్రవేశపెట్టడానికి కారణం ఇదే..!

Fri,February 22, 2019 01:41 PM

All you wanted to know about vote on account

హైదరాబాద్: ఈసారి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టడానికి ప్రత్యేక కారణాలున్నాయని తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో వివరించింది. కొత్తగా రాష్ట్రం ఏర్పడిన సమయంలో రాష్ర్టానికి రాబడిని పెంచుకోవడం, అవసరాలను తీర్చుకోవడం ఎలా అనే అంశాలపై స్పష్టమైన అంచనాలు లేవు. ఐదేండ్లు పూర్తైన తర్వాత ఇప్పుడు రాష్ట్ర ఆర్థికస్థితి, వ్యయాలు, ఆదాయాలు, ఆర్థిక వృద్ధి, రాష్ట్ర ప్రాధాన్యతలపై పూర్తిగా అవగాహన వచ్చిందని పేర్కొంది.

రాష్ట్రంలో ప్రస్తుత పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని రాబోయే ఐదేళ్ల అభివృద్ధికి సంబంధించి ప్రభుత్వం ప్రత్యేక కార్యాచరణ రూపొందించినట్లు బడ్జెట్ ప్రసంగంలో సీఎం కేసీఆర్ చెప్పారు. ఈ ప్రణాళిక ప్రకారమే ప్రతీ ఏటా బడ్జెట్లో నిధులు కేటాయించాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఈ ఏడాదికి కేంద్ర ప్రభుత్వం ఓట్ ఆన్ అకౌంట్ ప్రవేశపెట్టిన విషయం తెలిసిందే.

వచ్చే ఆర్థిక సంవత్సరంలో కేంద్ర ప్రభుత్వ విధానాలు ఎలా ఉంటాయి? ఏఏ రంగాలకు ఏవిధంగా కేటాయింపులు చేస్తారు? వారి ప్రాధాన్యతలేంటి? కేంద్ర ప్రాయోజిత పథకాలు ఎలా ఉండబోతున్నాయి? లాంటి అంశాలపై స్పష్టత లేదు అని కేసీఆర్ చెప్పారు. కేంద్రంలో పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెడితేనే.. రాష్ర్టానికి ఏ రంగంలో ఎంతమేరకు ఆర్థిక సహకారం అందుతుందనే విషయంపై స్పష్టత వస్తుందని కేసీఆర్ పేర్కొన్నారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ ప్రభుత్వం కూడా ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ప్రవేశపెట్టిందని అన్నారు. లోక్‌సభ ఎన్నికల తర్వాత కేంద్రంలో ఏర్పడే కొత్త ప్రభుత్వం పూర్తిస్థాయి బడ్జెట్ ప్రవేశపెట్టిన తర్వాత.. తెలంగాణ ప్రభుత్వం కూడా మరోసారి పూర్తిస్థాయి బడ్జెట్‌ను సంపూర్ణ స్పష్టతతో ప్రవేశపెడుతుందని శాసనసభలో సీఎం కేసీఆర్ స్పష్టం చేశారు.

2691
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles