చదువే ప్రధానమై.. ఆట పాటలకు దూరమైతే..

Sun,October 13, 2019 08:51 AM

అసలే హైదరాబాద్ మహా నగరం.. పిల్లలున్న ప్రతి తల్లిదండ్రులు గొప్పగా చదివించాలని వారికున్న దానిలో ఏదో స్కూల్‌ను ఎంచుకొని విద్యా బుద్ధులు చెప్పిస్తుంటారు. అదే తల్లిదండ్రులు తమ చిరు ప్రాయంలో ఆడుకున్న ఆటలన్నింటినీ పిల్లలకు నేర్పిస్తున్నారా? తాము పడ్డ శ్రమను పిల్లలకు తెలిసేలా చేస్తున్నారా? అంటే లేదనే సమాధానం నగరంలోని లక్షలాది తల్లిదండ్రుల నుంచి వస్తోంది. పిల్లలకు ఏదైనా చిన్న దెబ్బ తగిలినా విలవిలలాడిపోతూ కన్పిస్తుంటారు. తాము పడ్డ శ్రమ తమ పిల్లలు పడొద్దని, తాము ఆడుకున్న ఆటపాటలు వారు కూడా ఆడొద్దనే నేపథ్యంలో పిల్లలపై అమిత ప్రేమాభిమానాలు కురిపిస్తూ ఉంటారు.


వారి ఎదుగుదలకు పరోక్షంగా తల్లిదండ్రులే అవరోధంగా నిలుస్తున్నారన్ని విషయాన్ని పసిగట్టలేక పోతున్నారు. పిల్లలలో శారీరక ఎదుగుదలను కుంటుపడేలా చేస్తున్నది ప్రధానంగా తల్లిదండ్రులేనని వైద్య ఆరోగ్య నిపుణులు చెబుతున్న అక్షర సత్యమిది. పిల్లలకు సరైన విద్యా బుద్ధులు చెప్పిస్తే చాలనుకుంటున్నారు చాలా మంది తల్లిదండ్రులు. ఊబకాయ శరీరంతో ఎదిగి నడవ లేక, పరిగెత్తలేక చాలా మంది పిల్లలు రోగాల బారిన పడుతున్నారు. వారు చిరు ప్రాయం నుంచే నడకను , ఆటపాటలను కోల్పోయి చిన్న వయస్సులోనే షుగర్, హార్ట్ ఎటాక్ లాంటి జబ్బులకు గురవుతున్నారు.

చిన్న చిన్న పనులకే అలసిపోతూ శారీరక పటుత్వం కోల్పోతున్నారు. నాలుగేండ్ల నుంచి 14 ఏండ్ల వరకు గల ప్రతి పిల్లోడికి శారీరక వ్యాయామం ఆటపాటల నుంచే వస్తోందని క్రీడా నిపుణులు చెబుతున్నారు. ఏ రకమైన శారీరక శ్రమ లేక పిల్లలు ఊబకాయంతో ఎదుగుతున్నారు. చిరు ప్రాయంలో చదువే ప్రధానమై.. ఆట పాటలకు దూరమైతే.. ఆ ప్రాయం మళ్లీ మీ పిల్లలకు తిరిగొస్తుందా? పిల్లలకు విద్యా బుద్ధులతో పాటు ఆటపాటలూ అవసరమేనని అంటున్నారు.. విద్యా, వైద్య ఆరోగ్య, క్రీడా నిపుణులు.

ఇల్లు, పాఠశాల తప్ప మరో ధ్యాసేది?


తల్లిదండ్రులు పిల్లలకు ఇల్లు, పాఠశాల, పుస్తకాలు, ట్యూషన్లు ఇవి తప్ప మరో ధ్యాసే లేకుండా పెంచుతున్నారు. స్కూల్‌కు వెళ్లారా.. వచ్చారా.. హోం వర్క్ చేశారా... ట్యూషన్‌కు వెళ్లారా.. మంచి మార్కులు వచ్చాయా? అన్న కోణంలోనే ఆలోచిస్తూ మానసిక వికాసానికే ప్రాధాన్యమిస్తూ తల్లిదండ్రులు ఆ విధంగా జాగ్రత్త పడుతున్నారు. తప్ప పిల్లల్ని కనీసం వారాంతంలోనైనా పార్కులకు, మైదానాలకు, దగ్గరలో ఉన్న స్పోర్ట్స్ స్టేడియమ్స్‌కు తీసుకెళ్దామా? అన్న కోణంలో ఆలోచించడం లేదు. పిల్లలు సైతం స్మార్ట్ గేమ్స్ అలవాటు పడి శారీరక పరమైన ఆటలకు దూరమవుతున్నారు. దేశ, విదేశాలలో ఇటీవల చేపట్టిన సర్వేల ప్రకారం, 17 ఏండ్లలోపు పిల్లలంతా ఒబేసిటీతో బాధపడుతున్నట్టు పరిశోధనలో తెలిసింది.

765
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles