
హైదరాబాద్ : కొండపోచమ్మ సాగర్ కింద కాల్వల నిర్మాణానికి, సంగారెడ్డి కాలువ వ్యవస్థ మొదటి, రెండు, మూడో రీచ్‌కు ప్రభుత్వం పరిపాలనా అనుమతులు మంజూరు చేసింది. సిద్దిపేట జిల్లా గౌరారం నుంచి మెదక్ జిల్లా జీడిపల్లి వరకు కాలువ నిర్మించనున్నారు. 34 కిలోమీటర్ల మేర రూ. 435.81 కోట్లతో సంగారెడ్డి కాలువకు అనుమతించారు. సంగారెడ్డి కాలువ వ్యవస్థ రెండో రీచ్‌లో భాగంగా మెదక్ జిల్లా జీడిపల్లి నుంచి చిప్పల్తుర్తి వరకు 36 కి.మీ. మేర కాలువ నిర్మించనున్నారు. ఈ కాల్వను రూ. 463.74 కోట్లతో నిర్మించనున్నారు. మూడో రీచ్‌లో భాగంగా మెదక్ జిల్లా చిప్పల్తుర్తి నుంచి సంగారెడ్డి జిల్లా కల్వకుంట వరకు 54 కి.మీ. మేర నిర్మించనున్నారు. దీనికి రూ. 426.79 కోట్లతో అనుమతించారు. రూ. 416.83 కోట్లతో రావల్కోల్, కీసర కాల్వల నిర్మాణానికి పరిపాలనా అనుమతులు మంజూరు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.