ఆసరా పెన్షన్లు రెట్టింపు.. రూ.12,067 కోట్లు కేటాయింపు : సీఎం కేసీఆర్

Fri,February 22, 2019 12:50 PM

aasara pension amount doubled says cm kcr

హైదరాబాద్: రాష్ట్రంలో వృద్ధులు, వితంతువులు, ఒంటరి మహిళలు, బీడీ కార్మికులు, బోధకాల బాధితులు, నేత, గీతా కార్మికులు, ఎయిడ్స్ వాధిగ్రస్థులకు ఇచ్చే నెలసరి పెన్షన్ మొత్తాన్ని రూ. 1000 నుంచి రూ. 2,016కు పెంచుతున్నట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. అదేవిధంగా దివ్యాంగుల పెన్షన్ రూ. 1500 నుంచి రూ. 3,016కు పెంచుతున్నట్లు వెల్లడించారు. వృద్ధాప్య పెన్షన్‌కు కనీస అర్హత వయస్సు 65 సంవత్సరాల నుంచి 57 సంవత్సరాలకు తగ్గించి పెరిగిన పెన్షన్ అందిస్తామని ప్రకటించారు. ఓటాన్ అకౌండ్ బడ్జెట్‌ను సీఎం కేసీఆర్ శాసనసభలో ప్రవేశపెట్టారు. ఆసరా పెన్షన్ల కోసం ఈ బడ్జెట్‌లో రూ. 12 వేల 67 కోట్లను ప్రభుత్వం ప్రతిపాదించింది. ఈ సందర్భంగా సీఎం కేసీఆర్ మాట్లాడుతూ.. సమైక్య రాష్ట్రంలో జరిగిన జీవన విధ్వంసం అనేక మందిని అసహయులుగా మార్చిందన్నారు. వారికి గత ప్రభుత్వాలు వృద్ధాప్య పెన్షను కింద కొన్నాళ్లు రూ. 75 మరికొన్నాళ్ల్లు రూ. 200 మాత్రమే విదిలించి వృద్ధులను ఎంతో ఉద్ధరించినట్లు చెప్పుకున్నాయన్నారు. ప్రభుత్వాలు విదిలించిన ఆ తక్కువ మొత్తం ఏ చిన్న అవసరం కూడా తీర్చుకునేందుకు సరిపోయేది కాదన్నారు. ఇది సరైన విధానం కాదని భావించి అసహాయులను అందరిని ఆదుకునే విధంగా తెలంగాణ ఏర్పడిన వెంటనే వృద్ధులు, వితంతువుల పింఛన్లను రూ. 200 నుంచి రూ. 1000కి.. దివ్యాంగుల పెన్షన్లు రూ. 1500కి పెంచినట్లు వెల్లడించారు.

తాన విద్యార్థి దశలో దుబ్బాకలో చేనేత, బీడీ కార్మికుల ఇళ్లలో ఉండి చదువుకున్నట్లు.. బీడీలు చుట్టే తల్లుల దుర్భర వేదనను దగ్గర నుంచి గమనించినట్లు చెప్పారు. అందుకే వారి వేదనను ఛేదించాలని ఎక్కడా ఎవరూ డిమాండ్ చేయకుండానే ప్రతి నెల రూ. వెయ్యిని జీవనభృతిగా ప్రకటించినట్లు తెలిపారు. తోడులేని ఒంటరి స్త్రీ సమాజంలో పడే పాట్లు చెప్పనలవి కానివి. పేదరికంతో బాధపడే ఒంటరి మహిళలకు రూ. 1000 ప్రకటించాం. ఈ నిర్ణయం వారికి కొండంత అండగా మారిందన్నారు. అదేవిధంగా బోధకాల వ్యాధితో బాధపడే వారి బాధలు కూడా మానవీయ కోణంలో స్పందించి ప్రభుత్వం వారిని ఆసరా పింఛన్ల పరిధిలోకి తెచ్చిందన్నారు. నిస్సాయులైన పేదలకు ఆసరా పెన్షన్లు ఎంతో ఊరటనిస్తున్నాయని.. ఊపిరులు నిలబడుతున్నాయన్నారు. ఎక్కడా మధ్య దళారులు ప్రమేయం లేకుండా నేరుగా లబ్ధిదారులకే అందుతున్న ఈ పెన్షన్లు పేదల జీవితాల్లో సంతోషాలు నింపుతున్నాయన్నారు. ఆసరా పెన్షన్లు అందుకుంటున్నవారు కేసీఆర్ మమ్మల్ని పెద్ద కొడుకులా ఆదుకుంటారని, దేవుడినిచ్చిన అన్నా అని దీవించడం తన రాజకీయ జీవితానికి గొప్ప సార్ధకతగా భావిస్తున్నట్లు సీఎం తెలిపారు. తెలంగాణ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాల్లో ఆసరా పెన్షన్లు తన హృదాయానికి దగ్గరైన కార్యక్రమమన్నారు. ప్రతి పైసా సద్వినియోగమై పేదల ప్రయోజనాలు తీర్చడానికి ఉపయోగపడుతున్న ఆసరా పెన్షన్ల మొత్తాన్ని రెట్టింపు చేసి పేదలకు మరింత వెసులుబాటు కల్పిస్తామని గత ఎన్నికల్లో హామీ ఇచ్చాం. ఇచ్చిన హామీ పెన్షన్లను రెట్టింపు చేస్తున్నట్లు సీఎం పేర్కొన్నారు.

1735
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles