జీఎస్టీపై కౌటిల్యుడు ఏం చెప్పాడు?

Thu,December 7, 2017 01:33 PM

A Question on GST at BHU stunned MA students and Professors

వారణాసి: ఇది చదవగానే అసలు కౌటిల్యుడు ఏంటి? అతనికీ జీఎస్టీకి సంబంధం ఏంటి అన్ని అనుమానం కలగడం సహజమే. ఎప్పుడో క్రీస్తుపూర్వం ఉన్న ఈ అర్థశాస్త్ర నిపుణుడికి, ఇప్పుడు మన జీఎస్టీకి ఎలా లంకె కుదురుతుంది? ఇదే అనుమానం బనారస్ హిందూ యూనివర్సిటీ (బీహెచ్‌యూ) విద్యార్థులకూ కలిగింది. కానీ అక్కడి ప్రొఫెసర్లకే ఇది తెలియనట్లుంది. ఎంఏ తొలి సెమిస్టర్ పరీక్షలో వాళ్లు ఇచ్చిన ప్రశ్న చూస్తే మీకూ అదే అనిపిస్తుంది. కౌటిల్యుని అర్థశాస్త్రంలో జీఎస్టీ ఎలా ఉండేది.. వివరించండి అన్నది ఆ ప్రశ్న. సోషల్ అండ్ పొలిటికల్ థాట్ ఆఫ్ ఏన్షియంట్ అండ్ మిడీవల్ ఇండియా సబ్జెక్ట్‌లో భాగంగా ఈ ప్రశ్న అడిగారు. దీంతో విద్యార్థులు ఏం రాయాలో తెలియక తల పట్టుకున్నారు. పోనీ ఈ ప్రశ్నకు సమాధానం తెలియకపోతే ఇదైనా రాయండి అంటూ దాని కిందే మరో ప్రశ్న అడిగారు. అదీ మరీ దారుణం. గ్లోబలైజేషన్ గురించి ఆలోచన చేసిన తొలి భారతీయుడు మను.. దీనిపై చర్చించండి. ఇదీ ఆ ప్రశ్న.

అసలు వీటికి సమాధానాలు మీకైనా తెలుసా అంటూ కొందరు విద్యార్థులు తమ ప్రొఫెసర్లను కలిసి అడిగారు. దీనిపై ఓ ప్రొఫెసర్ స్పందించారు. అసలు మేం విద్యార్థులకు చెప్పినదాంట్లో ఇది లేనే లేదు. కౌటిల్య, మను వాళ్ల కాలంలో గొప్ప ఆర్థిక వేత్తలు, ఆలోచనా పరులే కావచ్చు. కానీ ఆ సమయంలో అసలు జీఎస్టీ, గ్లోబలైజేషన్‌లాంటి పదాలు ఉన్నాయో లేదో తెలియదు అని అన్నారు. ఇలాంటి ప్రశ్నలు ఎలా అడిగారో తమకు కూడా అంతుబట్టడం లేదని బీహెచ్‌యూ ప్రొఫెసర్లు చెబుతున్నారు. పొలిటికల్ సైన్స్ డిపార్ట్‌మెంట్ హెడ్ ఆర్పీ సింగ్ స్పందిస్తూ.. ప్రశ్నాపత్రాలను సంబంధిత నిపుణులు తయారు చేస్తారు.. దీనికి వాళ్లదే బాధ్యత అని చెప్పారు. ఇలాంటి ప్రశ్నలు ఎంఏ విద్యార్థులను అడగడం ఏంటని జవహర్‌లాల్ నెహ్రూ యూనివర్సిటీలో పొలిటికల్ సైన్స్ ప్రొఫెసర్‌గా ఉన్న ఎంఎన్ ఠాకూర్ మండిపడ్డారు. దీనిపైన ఓ రీసెర్చ్ చేసినా దానికో అర్థం ఉంటుందిగానీ.. పరీక్షలో ప్రశ్నలు అడగడం అవివేకమని అన్నారు.

3657
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles