అంతర్రాష్ట్ర పిల్లల కిడ్నాప్ ముఠాను అరెస్ట్

Thu,April 25, 2019 05:31 AM

9 member kidnappers gang nabbed in Hyderabad

హైదరాబాద్ : ఈజీగా డబ్బులను సంపాదించాలనే దురాశతో ఒంటరిగా ఆడుకుంటున్న చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించే అంతర్రాష్ట్ర ముఠాను పోలీసులు చాకచక్యంగా పట్టుకుని రిమాండ్‌కు తరలించారు. వారి నుంచి 35 వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. మరో ఇద్దరు పరారీలో ఉన్నారు. చాంద్రాయణగుట్ట పోలీస్‌స్టేషన్‌లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఇన్‌స్పెక్టర్ జి.కోటేశ్వర్‌రావు వివరాలను వెల్లడించారు. తన రెండున్నరేండ్ల కొడుకు షేక్ సోఫీయాన్ మార్చి 25వ తేదీన మధ్యాహ్నం ఇంటి ముందు ఆడుకుంటూ అదృశ్యమయ్యాడంటూ చాంద్రాయణగుట్ట క్యూబా కాలనీకి చెందిన చీరల వ్యాపారం చేసుకునే షేక్‌ఫజల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.

అప్పట్లో పోలీసులు చిన్నారి అదృశ్యం కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టారు. విధి నిర్వహణలో భాగంగా పోలీసులు బండ్లగూడ చౌరస్తా వద్ద తనిఖీలు నిర్వహిస్తుండగా అనుమానాస్పందంగా వెళ్తున్న ఇద్దరు వ్యక్తులను అదుపులోకి తీసుకొని ప్రశ్నించగా వారి నుంచి సరైన సమాధానం రాకపోవడంతో లోతుగా విచారణ చేయగా చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించే ముఠాగా తేలింది. నెల రోజులుగా కనిపించకుండా పోయిన చిన్నారి షేక్ సోఫీయాన్‌ను కిడ్నాప్ చేసినట్లు వెల్లడైంది. అంతేకాకుండా మరో ఇద్దరు చిన్నారులను కూడా వీరి ముఠా కిడ్నాప్ చేసి విక్రయించినట్లు వెలుగులోకి వచ్చింది. వెంటనే వీరిపై పోలీసులు కేసు నమోదు చేసి కిడ్నాప్ చేసే ముఠా సభ్యులను పట్టుకునేందుకు ప్రత్యేకంగా మూడు పోలీస్ బృందాలను రంగంలోకి దిగి మిస్టరీగా మారిన చిన్నారుల కిడ్నాప్ కేసులను చేధించారు.

మరో ఇద్దరు చిన్నారుల ఆచూకీ లభ్యం..


గంగాంధర్‌రెడ్డి, పౌజియాలను అదుపులోకి తీసుకున్న పోలీసులు విచారించగా ఏలూరులో నివసించే రాములు దంపతులకు రూ.2లక్షల 80వేలకు షేక్ సోఫియాన్‌ను విక్రయించినట్లు తేలింది. అంతేకాకుండా బాలాపురం పోలీస్‌స్టేషన్ పరిధిలో గత సంవత్సరం అక్టోబర్ నెలలో కిడ్నాప్‌కు గురైన చిన్నారి షేక్ ఖాజా (2)ను అమలాపురంలో నివసించే ఓ వ్యక్తికి రూ.3లక్షల 10వేలకు, రాజమండ్రికి చెందిన ఇరవై రోజుల చిన్నారిని కూడా కిడ్నాప్ చేసి విక్రయించినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది.

అంతా తెలుగురాష్ర్టాల వారే..


ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని ఈస్ట్ గోదావరి జిల్లా అమలాపురంకు చెందిన వాకపల్లి గంగాధర్‌రెడ్డి (33), రంగారెడ్డి జిల్లా దేవేందర్‌నగర్‌లో నివసిస్తున్నాడు. వరంగల్ జిల్లాకు చెందిన పోట్ల జ్యోతి అలియాస్ ఫౌజియా (30), చాంద్రాయణగుట్ట క్యూబా కాలనీలో నివసిస్తుంది. జగద్గిరిగుట్టకు చెందిన ఆటో డ్రైవర్ ప్రసాద్ (30), ఇదే ప్రాంతానికి చెందిన గడెపె సింధు (25),అబ్దుల్లాపూర్‌మేట్ జేఎన్‌ఆర్‌యూ కాలనీకి చెందిన ఎస్.అరుణ (50), బీఎన్‌రెడ్డినగర్‌కు చెందిన కొర్ర మున్నా (32), విశాఖపట్నం అక్కీపల్లెంకు చెందిన పెడి లక్ష్మి (37)లతో పాటు సయ్యద్ బీ, కనకరాజు అనే మరో ఇద్దరు వ్యక్తులు ముఠాగా ఏర్పడ్డారు. వీరంతా చిన్నారులను కిడ్నాప్ చేసి విక్రయించి వచ్చిన డబ్బులను పంచుకుంటారు. అయితే ముఠా సభ్యులకు పాతనేరస్తుడైన అమలాపురంకు చెందిన వాకపల్లి గంగాధర్‌రెడ్డి నాయకత్వం వహిస్తున్నాడు. ఇతడిపై ఛత్రినాక, పంజాగుట్ట, సైదాబాద్, మాదన్నపేట్ పోలీస్‌స్టేషన్లలో ఇప్పటికే కిడ్నాప్ కేసులు ఉన్నాయి. తాజాగా మరో ముగ్గురు చిన్నారులను కిడ్నాప్ చేసి పోలీసులకు పట్టుబడ్డాడు.

1744
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles