గ్రామాల అభివృద్ధికి రూ. 8 వేల కోట్లు

Fri,February 22, 2019 03:15 PM

8 thousand crores allocates to village developments

హైదరాబాద్‌ : రాష్ట్ర ప్రభుత్వం గ్రామాల అభివృద్ధికి నిధుల కొరత లేకుండా ప్రణాళిక సిద్ధం చేసింది. గ్రామాలకు ప్రతీ ఏటా దాదాపు రూ. 8 వేల కోట్ల మేర నిధులు అందుబాటులోకి వస్తాయి. ఐదేళ్ల కాలంలో మొత్తం రూ. 40 వేల కోట్లు గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేసే అవకాశం ఉంది అని సీఎం కేసీఆర్‌ తెలిపారు. శాసనసభలో ఓటాన్‌ అకౌంట్‌ బడ్జెట్‌ ప్రవేశపెట్టిన సందర్భంగా సీఎం కేసీఆర్‌ ఈ విషయాలను వెల్లడించారు.

గ్రామపంచాయతీలకు ఉన్న సొంత ఆదాయ వనరులు.. ఫైనాన్స్‌ కమిషన్‌ ద్వారా వచ్చే నిధులు, నరేగా ద్వారా వచ్చే నిధులు.. ఇలా అన్ని నిధులు కలిపి రాబోయే ఐదేళ్లలో గ్రామాల అభివృద్ధికి ఖర్చు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. 14వ ఆర్థిక సంఘం సిఫారసుల ప్రకారం గ్రామీణ ప్రాంతాల్లోని ప్రతీ వ్యక్తికి ఏడాదికి రూ. 806 చొప్పున కేంద్రం నుంచి నిధులు అందుతాయి. అంటే తెలంగాణలోని 2 కోట్ల 2 లక్షల గ్రామీణ జనాభాకు ఏడాదికి రూ. 1,628 కోట్లు కేంద్రం నుంచి వస్తాయి. దీనికి తెలంగాణ మొదటి రాష్ట్ర ఆర్థిక సంఘం నిధులు కూడా జమ చేయాల్సి ఉంటుంది.

రాష్ట్ర ప్రభుత్వం తరపున 2019-20 ఆర్థిక సంవత్సరంలో స్థానిక సంస్థలకు ఇచ్చే నిధుల విషయంలో రాష్ట్ర ఆర్థిక సంఘం ఇటీవలే మధ్యంతర నివేదిక ఇచ్చింది. గ్రామీణ స్థానిక సంస్థలకు రూ. 1400 కోట్లు పట్టణ స్థానిక సంస్థలకు రూ. 900 కోట్ల నిధులు ఇవ్వాలని సిఫారసు చేసింది. అయితే గ్రామాల అభివృద్ధికి ఎక్కువ నిధులు అవసరమని భావించిన ప్రభుత్వం, రాష్ట్ర ఆర్థిక సంఘం చేసిన సిఫారసుల కన్నా ఎక్కువ మొత్తంలోనే నిధులివ్వాలని నిర్ణయించింది.

కేంద్ర ఆర్థిక సంఘం రాష్ర్టానికి రూ. 1,628 కోట్లు ఇస్తున్నందున రాష్ట్రం తరపున కూడా అంతే మొత్తంలో ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దీంతో రెండు ఫైనాన్స్‌ కమీషన్ల ద్వారా గ్రామాలకు మొత్తం రూ. 3,256 కోట్లు అందనున్నాయి. అంటే ఒక్కో మనిషికి రూ. 1606 చొప్పున ఫైనాన్స్‌ కమిషన్‌ నిధులు అందుతాయి. 500 జనాభా కలిగిన గ్రామానికి కూడా రూ. 8 లక్షల నిధులు వస్తాయి. ఇవే కాకుండా మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కింద మరో రూ. 4000 కోట్లు అందుతాయి. పన్నుల ద్వారా గ్రామ పంచాయతీలకు మరో రూ. 700 కోట్లు సమకూరుతాయి.

ఈ మూడు మార్గాల ద్వారా గ్రామాలకు ప్రతీ ఏటా దాదాపు రూ. 8 వేల కోట్ల మేర నిధులు అందుబాటులోకి వస్తాయి. ఐదేళ్ల కాలంలో మొత్తం రూ. 40 వేల కోట్లు గ్రామాల అభివృద్ధి కోసం ఖర్చు చేసే అవకాశం ఉంది. ఇంత పెద్ద మొత్తంలో గ్రామాల అభివృద్ధికి గతంలో నిధులు అందలేదు. కొత్తగా ఎన్నికైన సర్పంచులు, వార్డు సభ్యులు ఈ సదవకాశాన్ని వినియోగించుకుని, చిత్తశుద్ధితో, అంకితభావంతో పని చేస్తారని ఆశిస్తున్నానని సీఎం కేసీఆర్‌ పేర్కొన్నారు.

1967
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles