నాగార్జునసాగర్ డ్యాం వద్ద 64వ ఫౌండేషన్ డే వేడుకలు

Mon,December 10, 2018 12:22 PM

64th foundation day celebrations held at nagarjuna sagar dam

63 వసంతాలు పూర్తిచేసుకున్న ఆధునిక దేవాలయం
1955 డిసెంబర్ 10న ఆనాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ శంకుస్థాపన


ఇరు తెలుగు రాష్ర్టాలకు సాగు, తాగునీరందించే ప్రాజెక్టు నాగార్జునసాగర్‌కు పునాదిరాయి పడి నేటికి 63 ఏళ్లు గడిచాయి. ప్రాజెక్టు ప్రస్తుతం 64వ వసంతంలోకి అడుగిడింది. ఈసందర్భంగా నాగార్జునసాగర్ పునాదిరాయి పైలాన్ వద్ద వేడుకలు నిర్వహించారు. ఈ వేడుకల్లో స్థానికులు పాల్గొన్నారు.

ఈ ప్రాంత రైతులు కరువుతో అలమటిస్తున్న సమయంలో ముక్త్యాల కోట రాజైన రాజా రామగోపాల్ కృష్ణ మహేశ్వరప్రసాద్ ఆలోచనతో నాగార్జునసాగర్ ప్రాజెక్టుకు బీజం పడింది. కృష్ణా నదిపైన పులిచింతల వద్ద ప్రాజెక్టు కట్టేందుకు అనువుగా ఉండని 1908లో బ్రిటీష్ ఇంజినీర్లు కర్నల్ ఎల్లిస్, కర్నల్ సీటీ మార్లింగ్స్ ప్రతిపాదించినా అప్పట్లో దాని నిర్మాణం జరుగలేదు. అనంతరం ఖోస్లా కమిటీ సూచనలతో 1954 డిసెంబర్ 17న అప్పటి గవర్నర్ త్రివేది నాగార్జునసాగర్ ప్రాజెక్ట్ నిర్మాణాన్ని ప్రకటించారు. 1955 డిసెంబర్ 10 న అనాటి ప్రధాని జవహర్‌లాల్ నెహ్రూ ప్రాజెక్టు నిర్మణానికి పైలాన్ పిల్లర్ వద్ద శంకుస్థాపన చేశారు.

ప్రపంచంలోనే రాతి ఆనకట్టల్లో నాగార్జునసాగర్ మొదటిస్థానంలో నిలిచింది. 1955 నుండి 1967 వరకు దాదాపు 12 సంవత్సరాలు పాటు పూర్తిగా స్వదేశీయ పరిజ్ఞానంతో, లక్షలాది మంది కూలీల మానవశక్తితో దీనిని నిర్మించారు. ప్రతిరోజు దాదాపు 500 మంది ఇంజినీర్లు, 500 మంది వర్క్‌చార్ట్ ఉద్యోగులు, 40 వేల మంది కూలీలు పనులు నిర్వహించారు.

ప్రాజెక్టు ప్రత్యేకతలు
రాతి కట్టడం పొడువు 4758 అడుగులు, 408 అడుగుల ఎత్తుతో, 300 అడుగుల వెడల్పుతో, 79 బ్లాకులుగా ప్రాజెక్టు నిర్మించారు. రెండు నాన్ ఓవర్ ఫ్లో సెక్షన్‌లమధ్య 546 అడుగుల పైన 45, 44 అడుగులతో 26 రేడియల్ క్రస్ట్ గేట్లను ఇంజినీర్ కేఎల్ రావు పర్యవేక్షణలో అమర్చారు. పూర్తిస్థాయి నీటి మట్టం 590 అడుగులకు చేరుకున్నపుడు 26 రేడియల్ క్రస్ట్ గేట్ల ద్వారా 11,70,000 క్యూసెక్కుల వరద నీటిని దిగువ కృష్ణలోకి స్పీల్‌వే మీదుగా విడుదల చేసేలా రూపొందించారు. ప్రాజెక్టుతో పాటు విద్యుత్ ఉత్పత్తి కేంద్రాన్ని నిర్మించారు.

కుడి, ఎడమ కాల్వలు
పూర్తిస్థాయిలో మానవ నిర్మితమైన నాగార్జునసాగర్ ప్రాజెక్టు సాగు, తాగునీటి అవసరాల కోసం నీటి విడుదలకు వీలుగా కుడివైపు జవహర్ కాల్వ, ఎడమవైపు లాల్‌బహుదూర్ కాల్వను ఏర్పాటుచేశారు. కుడికాల్వ దక్షణ విజయపురి వద్ద సొరంగ మార్గం ద్వారా ప్రారంభమై 392 కిలో మీటర్లు ప్రయాణిస్తుంది. గుంటూరు, ప్రకాశం జిల్లాలో 11,74,874 ఏకరాలకు సాగు నీరు అందిస్తున్నది. ఎడమ కాల్వ విజయపురినార్త్ వద్ద పొట్టిచెలిమ నుంచి చలకుర్తి వరకు సొరంగ మార్గాన ప్రారంభమై 349 కిలో మీటర్లు ప్రయాణిస్తు నల్లగొండ, సూర్యాపేట, ఖమ్మం జిల్లాలో 10,37,796 ఎకరాలకు సాగునీరు అందిస్తున్నది. 1967 ఆగస్టు 4న ఆనాటి ప్రధాని శ్రీమతి ఇందిరాగాంధీ రెండు కాల్వలకు మొదటి సారి నీటిని విడుదల చేశారు.

871
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles