తెలంగాణకు 6, ఏపీకి 16 టీఎంసీలు..Fri,September 22, 2017 01:13 PM

తెలంగాణకు 6, ఏపీకి 16 టీఎంసీలు..

హైదరాబాద్ : కృష్ణా జలాల కేటాయింపులు, నీటి విడుదల, పరస్పర ఫిర్యాదులపై చర్చించేందుకు జలసౌధలో సమావేశమైన కృష్ణా నదీ యాజమాన్య బోర్డు త్రిసభ్య కమిటీ భేటీ ముగిసింది. ఈ సమావేశంలో బోర్డు సభ్య కార్యదర్శి సమీర్ ఛటర్జీ, తెలంగాణ ఈఎన్‌సీ మురళీధర్, ఏపీ ఈఎన్‌సీ వెంకటేశ్వర్‌రావుతో పాటు పలువురు ఉన్నతాధికారులు హాజరయ్యారు.

తాగునీటి అవసరాల కోసం నీటిని వాడుకునేందుకు బోర్డు అనుమతించింది. తాగునీటి కోసం తెలంగాణకు 6 టీఎంసీలు, ఆంధ్రప్రదేశ్‌కు 16 టీఎంసీల నీటిని విడుదలకు అనుమతి ఇచ్చారు. తమకు కేటాయించిన నీటి నుంచే నీటిని విడుదల చేసుకున్నామని ఇరు రాష్ర్టాల అధికారులు చెప్పారు. బోర్డు అనుమతి తర్వాతే జలాలు విడుదల చేయాలని త్రిసభ్య కమిటీ స్పష్టం చేసింది. అన్ని అంశాలపై పూర్తిస్థాయి సమావేశంలో చర్చించాలని బోర్డు నిర్ణయించింది. వచ్చే నెల రెండో వారంలో పూర్తిస్థాయి సమావేశం జరిగే అవకాశం ఉంది.

నీటి విడుదల విషయంలో విధివిధానాలు ఏమిటో.. ఎలా ముందుకెళ్లాలో వచ్చే బోర్డు సమావేశాల్లో తగిన నిర్ణయాలు తీసుకుంటామని బోర్డు సభ్యకార్యదర్శి సమీర్ ఛటర్జీ స్పష్టం చేశారు. రాష్ర్టాలు తీసుకునే నిర్ణయాలను తాము ప్రభావితం చేయలేమన్నారు. వాటిని నియంత్రించే శక్తి బోర్డుకు లేదన్నారు. తమ అనుమతి లేకుండా నీటిని విడుదల చేసుకోవడం తీవ్రమైన విషయమన్నారు. దీనిపై వచ్చే సమావేశాల్లో చర్చిస్తామని చెప్పారు. రెండు రాష్ర్టాలతో మాట్లాడిన తర్వాత కూడా ఏ పరిష్కారం కాకుంటే కేంద్రానికి విన్నవిస్తామని ఆయన పేర్కొన్నారు.

బోర్డు ఆదేశాలను కచ్చితంగా పాటించాలని బోర్డు సభ్యకార్యదర్శి స్పష్టం చేశారు. బోర్డుకు అధికారాలు లేకుండా రాష్ర్టాలను నియంత్రించలేమని పేర్కొన్నారు. ఉమ్మడి ప్రాజెక్టులను బోర్డు పరిధిలోకి ఇవ్వాలని కోరుతున్నామని తెలిపారు. ప్రాజెక్టులు బోర్డు పరిధిలోకి ఇస్తే వివాదాలు తలెత్తకుండా చూస్తామని చెప్పారు. శ్రీశైలం నుంచి 14 టీఎంసీలు నాగార్జునసాగర్ కు వదలాలని ఛటర్జీ ఆదేశించారు. శ్రీశైలం, సాగర్ లో కనీస నీటి వినియోగ మట్టాలు ఉండేలా చూడాలని సూచించామని తెలిపారు.

3327
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS