రాంగ్‌రూట్‌ డ్రైవింగ్‌..స్పెషల్ డ్రైవ్ లో పట్టుబడ్డ 50 మంది

Wed,June 12, 2019 09:12 AM

50 members trapped in rash driving


హైదరాబాద్ : ట్రాఫిక్‌ పోలీసులు ఎన్నిసార్లు అవగాహన కల్పిస్తున్నా..చలాన్లు విధిస్తున్నా..సీజ్‌ చేస్తున్నా వాహనదారుల్లో మార్పు రావడంలేదు. బద్ధకం, నిర్లక్ష్యంతో కొందరు వాహనదారులు ట్రాఫిక్‌ రూల్స్‌ను బ్రేక్‌ చేస్తున్నారు. అంత దూరమా.. ఎందుకులే.. పోలీసులు ఎవరు లేరు అనుకుంటూ రాంగ్‌రూట్‌లో వెళ్తున్నారు. ఇలా వెళ్లి... పలు సందర్భాల్లో ప్రమాదాలకు కూడా కారణమవుతున్నారు. ఇలాంటివారిపై ట్రాఫిక్‌ పోలీసులు సీరియస్‌గా ఉంటున్నారు. రాంగ్‌రూట్‌లో వెళ్లే వాహనదారులకు చలాన్‌తోపాటు కౌన్సెలింగ్‌ కూడా ఉంటుందని పోలీసులు చెబుతున్నారు.

మంగళవారం మధ్యాహ్నం రాచకొండ ట్రాఫిక్‌ పోలీసులు ఎల్బీనగర్‌, వనస్థలిపురం ప్రాంతాల్లో నిర్వహించిన ఆకస్మిక తనిఖీల్లో గంటల్లోనే 50 మంది వాహనదారులు రాంగ్‌రూట్‌లో వెళ్తూ దొరికిపోయారు. ఎం దుకు రాంగ్‌ రూట్‌లో వస్తున్నారంటే వారి వద్ద ఎ లాంటి జవాబు లేదు. చలాన్‌ నుంచి తప్పించు కోవడానికి మాత్రం..కొందరు సార్‌.. చాలా అర్జెంట్‌ పని ఉం ది, అందుకే ఇలా రాంగ్‌ రూట్‌లో వచ్చానంటున్నారు. మరికొందరు ఇంట్లో వాళ్లకి మందులు అవసరం ఉండే తొందర్లో అడ్డదారిలో వచ్చేశా సార్‌.. మరోసారి చేయను అంటున్నారు. ఇలా..వాహనదారులు చెప్పిన మాటలు పోలీసులను ఆశ్చర్యానికి గురిచేశాయి. ద్విచక్రవాహనదారులే కాదు కార్లలో ప్రయాణించే వారు కూడా అడ్డదారిలో ప్రమాదభరితంగా వచ్చేస్తున్నారు.

వాహనదారుల సురక్షిత ప్రయాణం కోసం ఏర్పాటు చేసిన యూటర్న్‌, ఫ్రీ లెఫ్ట్‌ టర్న్‌లను ఎవరూ పాటించడం లేదు. రాంగ్‌ రూట్‌లలో వచ్చి ఇతర వాహనదారులను ప్రమాదాలకు గురిచేస్తున్నారు. వారు కూడా ప్రమాదంలో పడుతున్నారు. యూటర్న్‌ కనపడడం లేదా అని అడిగితే... అంత దూరం పోవాలా?.. ఇక్కడికే వెళ్లాల్సి ఉందంటూ నిర్లక్ష్యపు సమాధానాలు చెబుతున్నారు. ఈ సౌకర్యం ఏర్పాటు చేసింది వాహనదారుల రక్షణ కోసమేనని గ్రహించకపోవడం బాధాకరం. రాంగ్‌ రూట్‌లో వచ్చిన వాహనదారుడికి కచ్చితంగా వెయ్యి రూపాయల చలాన్‌తో పాటు కౌన్సెలింగ్‌ ఉంటుంది. ఈ ఉల్లంఘనలు మితి మీరితే చట్టపరమైన చర్యలు కూడా ఉంటాయి. సీసీ కెమెరాల ఆధారంగా కూడా రాంగ్‌రూట్‌లో ప్రయాణించే వారిపై చలాన్‌లను జారీ చేస్తాం. మరోసారి ఈ ఉల్లంఘనలకు పాల్పడకుండా వాహనదారులకు కౌన్సెలింగ్‌ను కూడా ఇస్తాం.
- దివ్యచరణ్‌రావు, డీసీపీ రాచకొండ ట్రాఫిక్‌ పోలీస్‌ విభాగం

2083
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles