తెలంగాణలో మహాసముద్రంగా టీఆర్‌ఎస్: జగదీశ్ రెడ్డి

Wed,May 1, 2019 09:11 PM

2500 members join in trs party in the presence of minister jagadeesh reddy

వివక్ష చూపని పాలనే అందరినీ ఆకర్షిస్తోంది..
సీఎం కేసీఆర్ రాష్ర్టానికే కాదు దేశానికే శ్రీ రామ రక్ష..
ప్రతిపక్ష నాయకులంతా ప్రగతి నిరోధకులు..
పార్టీ ఫిరాయింపులు ప్రోత్సహించింది కాంగ్రెస్ పార్టీనే..
టీఆర్‌ఎస్‌లో చేరిన వారంతా స్వచ్ఛందంగా వచ్చిన వారే..
సూర్యాపేటలో 2500 మంది టీఆర్‌ఎస్‌లో చేరిక


సూర్యాపేట: పోరాడి సాధించుకున్న తెలంగాణలో ముఖ్యమంత్రి కేసీఆర్ నాయకత్వంలో అతి తక్కువ సమయంలో జరుగుతున్న అన్నిరంగాల అభివృద్ధికి ఇతర పార్టీలన్నీ ఖాళీ అయి టీఆర్‌ఎస్‌లోకి వలసలు పెరగడంతో తెలంగాణలో టీఆర్‌ఎస్ మహా సముద్రంగా మారిందని, వివక్ష చూపకుండా అన్ని ప్రాంతాలను సమాన స్థాయిలో అభివృద్ధి చేస్తుండటమే అందుకు ప్రధాన కారణమని విద్యాశాఖ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి అన్నారు. కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు, ఆత్మకూర్.ఎస్ మండల మాజీ జడ్పీటీసీ గోపగాని వెంకటనారాయణ గౌడ్ జిల్లా కేంద్రంలో సుమారు 2500 మందితో కలిసి టీఆర్‌ఎస్‌లో చేరగా మంత్రి జగదీష్‌రెడ్డి వారికి గులాబీ కండువాలు కప్పి ఆహ్వానించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అధికారం చేసట్టిన అతి తక్కువ సమయంలోనే ఎవరూ ఊహించని రీతిలో అభివృద్ధి సాధించిన ముఖ్యమంత్రి కేసీఆర్.. తెలంగాణకే కాదు యావత్ దేశానికే శ్రీ రామరక్ష అని అన్ని రాష్ర్టాల ప్రజలు నమ్ముతున్నారన్నారు. తెలంగాణ ఏర్పాటు అనంతరం అధికారంలోకి వచ్చిన నాటినుంచి రికార్డు స్థాయిలో సంక్షేమ పథకాలు అమలవుతున్నాయని, స్వాతంత్య్రం వచ్చిన నాటి నుంచి ఇంతటి అభివృద్ధి ఎప్పుడూ జరుగలేదని స్పష్టం చేశారు.

తన పర బేధం లేకుండా అన్ని పార్టీలు, వర్గాల వారికి ఎలాంటి వివక్ష లేకుండా లబ్ధి జరుగుతోందని, మరో పక్క అభివృద్ధిపై ప్రతిపక్షాలు కక్షగట్టినట్లుగా వ్యవహరిస్తూ అడుగడుగునా అడ్డుకుంటూ ప్రగతి నిరోధకులుగా మారుతున్నారని విమర్శించారు. దీంతో ప్రజలంతా ఏకమై ఎలాంటి ఎన్నికలు వచ్చినా ఓట్లన్నీ మూటకట్టి టీఆర్‌ఎస్‌కు వేస్తుండడంతో అన్నింటా ఘన విజయాలు సాధిస్తున్నామన్నారు. ప్రజాభీష్టం మేరకు విపక్షాల నుంచి నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లో చేరుతున్నారు తప్ప ఎలాంటి ప్రలోభాలకు పాల్పడడం లేదని, గతంలో పార్టీ ఫిరాయింపులకు పాల్పడింది, దానిని ప్రోత్సహించింది కేవలం కాంగ్రెస్ పార్టీ మాత్రమేనని తెలిపారు.

ప్రభుత్వ పనితీరు, ముఖ్యమంత్రి కేసీఆర్ చేపడుతున్న అభివృద్ధిని చూసే ఇతర పార్టీల నుంచి ఆకర్షితులై గులాబీ పార్టీలోకి వలస వస్తున్నారన్నారు. గతంలో అధికారంలో ఉన్న పార్టీల నాయకులు, కార్యకర్తలకే ప్రభుత్వ కార్యాలయాల్లో ప్రవేశం ఉండేదని, అందుకు భిన్నంగా గడిచిన నాలుగున్నరేళ్లుగా ఏమి జరిగింది అన్నది ప్రజలందరికీ అర్థమైందని, అందుకే టీఆర్‌ఎస్ వివక్ష చూపని పార్టీగా అందరి గుండెల్లో నిలిచిపోయిందన్నారు.

టీఆర్‌ఎస్ అభివృద్ధి పాలనను చూసిన ప్రజలు కాంగ్రెస్‌తోపాటు ఇతర పార్టీల్లో ముఖ్యమంత్రులు అనుకున్న వారిని కనీసం శాసనసభకు కూడా పంపలేదన్నారు. ఈ కార్యక్రమంలో రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్, తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్ గౌడ్, మార్కెట్ కమిటీ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళికా ప్రకాష్, ఎంపీపీ కసగాని లక్ష్మీ బ్రహ్మం పాల్గొన్నారు. పార్టీలో చేరిన వారిలో గోపగాని వెంకటనారాయణతో పాటు, అయూబ్ ఖాన్, సత్యనారాయణ, జానీ, లింగయ్య, అంజయ్య, వెంకన్న, యల్లయ్య, బషీర్, రమణ, ఆత్మకూర్ (ఎస్) మండల వ్యాప్తంగా కాంగ్రెస్ పార్టీకి చెందిన పలువురు సర్పంచ్‌లు, మాజీ ఎంపీటీసీలు, సీనియర్ నాయకులు, కార్యకర్తలు సుమారు 2500 మంది ఉన్నారు.

1538
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles