ప్రైవేటు స్కూళ్ల నుంచి గురుకులాలకు వలసలు

Mon,June 19, 2017 12:55 PM

250 new gurukulam schools effects on private schools in telangana

రాష్ట్రంలో ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులు రాష్ట్రంలో కొత్తగా ప్రారంభించిన గురుకుల పాఠశాల వైపు మక్కువ కనబరుస్తున్నారు. ఫీజుల భారం మోయలేకపోవడం, విద్యా ప్రమాణాలు క్షీణించడంతో ప్రైవేట్ స్కూళ్లలో ఇంగ్లీష్ మీడియం చదువుకుంటున్న విద్యార్థులు గురుకులాల్లో చేరేందుకు ఆసక్తిని చూపుతున్నారని విద్యాశాఖ అధికారులు తెలిపారు. ప్రభుత్వానికి అనుకూలమైన నిరంతర సమగ్ర మ్యూల్యాంకన విధానం అమలు చేయడంలో ప్రైవేటు స్కూళ్లు విఫలం చెందడంతో ప్రైవేట్, ప్రభుత్వ సిలబస్‌లో భారీ వ్యత్యాసం ఉందని విమర్శలు వస్తున్నాయి. ప్రైవేట్ స్కూళ్లలో ప్రమాణాలు పడిపోవడంతో ఉత్తీర్ణత శాతం భారీగా క్షీణించిందనే విషయం గతేడాది, ఈ సంవత్సరం ఫలితాల్లో స్పష్టమైంది.

ఫీజులకు తగినట్లు విద్యా ప్రమాణాలు లేకపోవడంతో తల్లిదండ్రులు, విద్యార్థుల్లో ప్రైవేట్ స్కూళ్లపై ఉన్న భ్రమలు క్రమంగా తొలగిపోతున్నాయి. అందువల్లే ప్రభుత్వం ఏర్పాటు చేసిన గురుకుల స్కూళ్లలో విద్యార్థుల చేరిక భారీగా నమోదవుతున్నది. ఈ ప్రభావం గ్రామీణ మండలాల్లో ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో అధికంగా కనిపిస్తున్నది. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు కట్టలేక ఇటువైపు వస్తున్నారనే విషయాన్ని అధికారులు స్పష్టం చేశారు.

అంతర్జాతీయ స్థాయిలో పోటీ పడే విధంగా..
అంతర్జాతీయ స్థాయిలో తెలంగాణ విద్యార్థులు పోటీ పడాలంటే పాఠశాల విద్యాస్థాయి నుంచే ఇంగ్లీష్ మీడియంలో బోధన, వసతి సౌకర్యాలతో రాష్ట్ర ప్రభుత్వం 250 గురుకుల పాఠశాలలు ప్రారంభించింది. ప్రత్యేక శిక్షణా తరగతులలో టీచర్లకు ఇంగ్లీష్ బోధనకు అవసరమయ్యే మెళకువలు నేర్పుతారు. వీటిలో క్వాలిఫైడ్ టీచర్లను ఎంపిక చేసి ఇంగ్లీష్ మీడియం పాఠాలు బోధించేందుకు వినియోగించుకునే విధంగా ప్రణాళికను విద్యాశాఖ రూపొందిస్తున్నది. పట్టణ ప్రాంత విద్యార్థులే కాకుండా గ్రామీణ, మండల ప్రాంతాలకు చెందిన విద్యార్థులు కూడా నాణ్యమైన విద్యను కోరుకుంటున్నారని, ఇంగ్లీష్ మీడియం కోసం రాష్ట్రంలో మోడల్ స్కూళ్లలో చేర్పించేందుకు తల్లిదండ్రులు దృష్టిపెట్టారనే విషయాన్ని గుర్తించారు. ఇంగ్లీష్ మీడియం విద్యతో ఉద్యోగ రాత పరీక్షలు, కార్పొరేట్, ఐటీ రంగ ఉద్యోగాలను సులభంగా పొందవచ్చనే అభిప్రాయం గ్రామీణ ప్రాంతాల్లో కూడా నెలకొంది.

లెక్కలు సేకరిస్తున్న విద్యాశాఖ అధికారులు
గురుకులం స్కూళ్లలో చేరేందుకు విద్యార్థులు ఉత్సాహం చూపిస్తున్న నేపథ్యంలో ఎన్ని జిల్లాల్లో ఎంత మంది విద్యార్థులు చేరారని లెక్కలు సేకరించడంలో ఆ శాఖ అధికారులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే 80 వేల మంది విద్యార్థులు పాఠశాలల్లో అడ్మీషన్ తీసుకుని తరగతులకు హాజరవుతున్నారు. మోడల్ స్కూళ్లనన్నింటిని ఒకే గొడుగు కిందకు తీసుకువచ్చి, ఇంగ్లీష్ మీడియంలో బోధన చేపట్టాలనే ప్రతిపాదనపై ప్రభుత్వం దృష్టిసారించింది. మరిన్ని గురుకుల పాఠశాలు ప్రారంభించి విద్యార్థులకు కేజీ టు పీజీ విద్యను అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తుంది.

1243
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles