‘మీ సేవ 2.0’ వెర్షన్లో ఇంటి నుంచే దరఖాస్తు చేసుకోవచ్చు!

Mon,April 15, 2019 12:01 PM

2.0 Meeseva Version Available  for Better Services to ts  People

హైద‌రాబాద్‌: ప్రజలకు పరిపాలనను మరింత చేరువ చేయడానికి టెక్నాలజీకి పెద్దపీట వేస్తున్న తెలంగాణ‌ రాష్ట్ర ప్రభుత్వం, ఐటీశాఖ మరో కీలక నిర్ణయం తీసుకున్నాయి. ప్రభుత్వ సేవలను మెరుగ్గా అందించడంతోపాటు వాటిని చేరవేసే క్రమంలో ఇబ్బందులు తలెత్తకుండా చూసేందుకు చర్యలు చేపడుతున్నాయి. మీ సేవ కేంద్రాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే పలు సేవలను ప్రజలకు అత్యంత వేగంగా.. సులభంగా అందిస్తున్నది. ఈ నేపథ్యంలో ప్రజల అభిప్రాయాల మేరకు వారి ఇబ్బందులను తొలిగించేందుకు ఐటీశాఖ మరిన్ని చర్యలు చేప‌ట్టింది. తాజాగా ఐటీశాఖ ‘మీసేవ 2.0’ వెర్షన్‌ను అందుబాటులోకి తీసుకొచ్చింది.

2.0 వెబ్‌వెర్షన్‌..!

ప్రభుత్వం అందించే పలు రకాల సేవలను పొందాలంటే నేటి తరుణంలో ఎవరైనా సమీపంలో ఉన్న మీ సేవ కేంద్రాలకు వెళ్లాల్సి ఉంటుంది. లేదంటే సంబంధిత శాఖల కార్యాలయాలకు అయినా వెళ్లాలి. ఈ స‌మ‌స్య‌ను అధిగ‌మించేందుకు గ‌తంలో టీ యాప్ ఫోలియో (T App Folio)' పేరిట ఓ నూతన యాప్‌ను అందుబాటులోకి తెచ్చింది. ఈ యాప్‌ ద్వారా పలు సేవలు అందుబాటులోకి తెచ్చిన ఐటీశాఖ తాజాగా 2.0 వెబ్‌వెర్షన్‌ ద్వారా ప్రజలు, రైతులు, విద్యార్థులు, రెవెన్యూ, స్టాంపులు, రిజిస్ట్రేషన్లు, విద్యుత్ పంపిణీ, పురపాలక, నగరపాలక సంస్థలు, వ్యాపార, వాణిజ్య‌, ప్ర‌భుత్వ‌, ప్రైవేట్‌ సంస్థ‌ల‌కు అవసరమయ్యే 37 ప్రభుత్వ పౌర సేవలను ఇంటి నుంచే పొందే వెసులుబాటు కల్పిస్తోంది. జనన ధృవీకరణ పత్రం , కుల, ఆదాయ, నివాస ధ్రువీకరణ స‌ర్టిఫికెట్లు, రిజిస్ట్రేషన్లు, మున్సిప‌ల్, త‌దిత‌ర సేవ‌లు ఆన్ లైన్ లో అప్లై చేసుకోవడం లాంటి సేవలన్నింటిని నూతన వెబ్‌వెర్షన్‌ ద్వారా పొందవచ్చు. మీసేవ వెబ్‌సైట్ ts.meeseva.telangana.gov.in ద్వారా ఆన్‌లైన్‌ పోర్టల్‌లో 2.0 సిటిజన్‌ సర్వీసెస్‌ను ఎంచుకుని పూర్తి వివరాలతో రిజిస్టర్‌ చేసుకుంటే అవసరమైన సేవలు పొందేందుకు వీల‌వుతుంది.

ఎవరైనా రిజిస్టర్‌ చేసుకోవచ్చు

ప్రస్తుత విధానంలో ఏదైనా సేవ‌ల‌ను పొందాలంటే ద‌గ్గ‌ర్లోని మీసేవ కార్యాలయాలకు వెళ్లి దరఖాస్తు చేసుకుంటున్నారు. 2.0 వెర్ష‌న్‌లో అయితే ఇంట్లో కూర్చొని ఆన్‌లైన్ ద్వారా వీలైన‌ప్పుడు దరఖాస్తు చేసుకోవచ్చు. సర్టిఫికెట్‌ మంజూరైతే దానిపై ఉన్న నంబ‌ర్‌ను మీసేవ కేంద్రాల్లో చూపించి ఒరిజ‌న‌ల్‌ స‌ర్టిఫికెట్ తీసుకోవ‌చ్చు. నూత‌న విధానంలో దరఖాస్తు రుసుము విషయంలో మధ్యవర్తుల ప్రమేయం ఉండదు. నిర్ణీత మొత్తంలో ద‌ర‌ఖాస్తు ఫీజు మిన‌హా ఎక్కువ మొత్తంలో డ‌బ్బులు చెల్లించాల్సిన ప‌నిలేదు. ఒక‌వేళ‌ అభ్యర్థి రెండోసారి ధ్రువీకరణ పత్రానికి దరఖాస్తు చేసినపుడు, అవసరమైన అదనపు పత్రాలు స్కాన్ చేసి అప్‌లోడ్‌ చేస్తే సరిపోతుంది.

ఈ సేవలు పొందేందుకు వినియోగ‌దారులు ఫీజులను ఆన్‌లైన్లో చెల్లించాలి. ఆన్‌లైన్‌ దరఖాస్తులో ఏమైనా సందేహాలు, స‌మ‌స్య‌లు త‌లెత్తితే పరిష్కారం కోసం కాల్ సెంటర్‌ (1100 లేదా 18004251110) నంబర్లకు ఫోన్ చేయ‌వ‌చ్చు. 9121006471 లేదా 9121006472 నంబర్లకు వాట్సాప్ కూడా చేసే స‌దుపాయం క‌ల్పించారు. తెలంగాణ‌ ప్రభుత్వం వ్యవసాయ శాఖ అందించే వివిధ పథకాలు, ప్రయోజనాలన్నింటినీ మీసేవతో అనుసంధానించాలని నిర్ణయించిన విష‌యం తెలిసిందే. మీ సేవలో సుమారు 600కు పైగా సేవలు అందిస్తున్నారు. మీ సేవలో ఇప్ప‌టికే 10 కోట్ల లావాదేవీలు పూర్తిచేసుకొని నిరంత‌రాయంగా సేవ‌లు అందిస్తోంది.

13081
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles