18 నుంచి 60 ఏండ్లు ఉన్న ప్రతి రైతుకు బీమా: పోచారం

Wed,June 20, 2018 04:03 PM

18 to 60 years old farmers get rythu insurance scheme says pocharam

మహబూబ్‌నగర్: 18 నుంచి 60 ఏండ్లు ఉన్న ప్రతి రైతుకు బీమా పథకం వర్తింపజేస్తామని మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. మహబూబ్‌నగర్ జిల్లా కేంద్రంలోని వైట్ హౌస్ గార్డెన్‌లో జరిగిన ఉమ్మడి పాలమూరు జిల్లా రైతు సమన్వయ సమితి రైతు బీమా అవగాహన సదస్సును మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మంత్రి జూపల్లి, ల‌క్ష్మారెడ్డి, ప్రణాళికా సంఘం ఉపాధ్యక్షుడు నిరంజన్ రెడ్డి, రాష్ట్ర రైతు సమన్వయ సమితి అధ్యక్షుడు గుత్తా సుఖేందర్ రెడ్డి, ఎంపీ జితేందర్ రెడ్డి, ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు పాల్గొన్నారు.

ఈసందర్భంగా మాట్లాడిన మంత్రి పోచారం.. రాష్ట్రంలో 52 లక్షల 40 వేల మంది రైతులు ఉన్నారన్నారు. వారి వద్ద కోటి 40 లక్షల ఎకరాల భూమి ఉందన్నారు. రైతాంగానికి, వ్యవసాయానికి సాయం చేయాలన్నదే సీఎం కేసీఆర్ లక్ష్యమన్నారు. అందుకే రైతుల బీమా పథకాన్ని దేశంలో మొట్టమొదటి సారిగా కేసీఆర్ రూపొందించి అమలు చేస్తున్నారన్నారు. 86 ఏండ్ల క్రితం భూసర్వే నిర్వహించగా.. మళ్లీ ఇప్పుడే మొదటి సారిగా భూసర్వే నిర్వహించిన ఘనత సీఎం కేసీఆర్‌దన్నారు. రుణాల మాఫీ, 24 గంటలు విద్యుత్, సాగు నీరు, రైతు బంధు, పంటల పెట్టుబడులు, వేచి చూడాల్సిన అవసరం లేకుండా విత్తనాలు, ఎరువులను రైతులకు తెలంగాణ ప్రభుత్వం అందిస్తున్నదన్నారు. రైతు బీమా పథకం కింద తెలంగాణ ప్రభుత్వం రూ.5,730 కోట్లు ప్రీమియం కింద కడుతున్నదన్నారు. అవి రైతులు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేదన్న విషయాన్ని తెలుసుకున్న కేంద్ర ఆర్థిక మంత్రి ఆశ్చర్యం వ్యక్తం చేశారన్నారు. ఇలాంటి పథకాలను ఎలా రూపొందిస్తున్నారు? ఎలా అమలు చేస్తున్నారని ఆసక్తిగా సీఎంను అడిగినట్లు మంత్రి తెలిపారు.

ఇలా అనేక రాష్ర్టాలు మన రాష్ట్ర ప్రభుత్వ పథకాల మీద ఆసక్తిగా అధ్యయనం చేస్తున్నాయన్నారు. రైతు బీమా పథకం కింద ప్రతి రైతుకు రూ. 5 లక్షలు, గాయపడితే రూ. 2 లక్షలు అందిస్తామన్నారు. రూ. 50 ప్రీమియంతో ఇన్సూరెన్స్ పాలసీలున్నాయి.. కాని సీఎం కేసీఆర్ రైతుల మీద ఆప్యాయతతో రూ.2,271 ప్రీమియాన్ని ప్రతి రైతుకు చెల్లించడానికి ముందుకు వచ్చారన్నారు.

జూన్ 30 లోగా వ్యవసాయ విస్తరణాధికారులు ప్రతి రైతు వద్దకు వెళ్లి రైతులు, నామినీ వివరాలు సేకరిస్తారన్నారు. జులై 15లోగా డాటా ఎంట్రీ పూర్తి చేస్తారన్నారు. ఆగస్టు 1 నుంచి ఇన్సూరెన్స్ కంపెనీలకు ప్రీమియం చెల్లింపు జరుగుతుందన్నారు. ఆగస్టు 15 నుంచి ప్రతి గ్రామాల్లో ఎమ్మెల్యేలు తిరిగి రైతులకు స్వయంగా బీమా బాండ్లను అందజేస్తారన్నారు. జీవో 63 లో రైతు బీమా పథకానికి సంబంధించిన గైడ్ లైన్స్ ఉన్నాయన్నారు.

పాలమూరు రైతాంగం ఇప్పుడు ఆనందంగా ఉంది.. జూపల్లి


పాలమూరులో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టులను మూడు ఏండ్లలో పూర్తి చేసి ఆరున్నర లక్షల ఎకరాలకు సాగునీరందించిన ఘనత తెలంగాణ ప్రభుత్వానిదని మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. పాలమూరు రైతాంగం ఇప్పుడు ఎంతో ఆనందంగా ఉందన్నారు. కరువును పారదోలి.. కూలీ పనుల కోసం దేశమంతా తిరిగిన రైతులు ఇప్పుడు తిరిగి పాలమూరుకు వస్తున్నారన్నారు. కేసీఆర్ రైతాంగం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. ఆయా పథకాలు దేశంలోనే ఏ రాష్ట్రంలో లేవన్నారు. ఇంతకుముందున్న సీఎంలకు, కేసీఆర్‌కు, గత ప్రభుత్వాలకు, ప్రస్తుత ప్రభుత్వానికి మధ్య భూమికి, ఆకాశానికి ఉన్నంత తేడా ఉందన్నారు. దురదృష్టవశాత్తు ప్రాజెక్టులను, అభివృద్ధిని అడ్డుకుంటున్న ప్రతిపక్షాలు మన రాష్ట్రంలో ఉన్నాయన్నారు. ఉద్యమ స్థాయిలో ఉద్ధృతంగా జరుగుతున్న అభివృద్ధిని అడ్డుకోవడం ఎవరి తరం కాదన్నారు.

వ్యవసాయం దండుగ కాదు.. పండుగ.. ల‌క్ష్మారెడ్డి


వ్యవసాయం దండుగ అన్న పరిస్థితిని పూర్తిగా మార్చి రాష్ట్రంలో వ్యవసాయాన్ని సీఎం కేసీఆర్ పండుగ చేశారని మంత్రి ల‌క్ష్మారెడ్డి తెలిపారు. రైతే రాజన్న నానుడిని నిజం చేసే లక్ష్యంతో సీఎం కేసీఆర్ రైతాంగం కోసం అనేక పథకాలు అమలు చేస్తున్నారన్నారు. అధికారంలోకి వచ్చిన వెంటనే రైతుల రుణాలు మాఫీ చేశారన్నారు. 24 గంటల పాటు విద్యుత్‌ని ఇస్తున్నారు. సాగునీటి కోసం ప్రాజెక్టుల పనులు చేపట్టారు. పాలమూరు జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టులు పూర్తి చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి శాశ్వతంగా కరువును పారదోలి.. సస్యశ్యామలం చేసేందుకు కంకణం కట్టుకున్నారని మంత్రి తెలిపారు.

రైతు బంధు పథకం ద్వారా పంటల పెట్టుబడులు, ఇప్పుడు బీమా పథకాన్ని పూర్తిగా ఉచితంగా రైతులకు అందిస్తున్నారు. ఇప్పటికే ఎరువులు, విత్తనాల కొరత తీర్చారు. నకిలీ విత్తనాలు లేకుండా చేశారు. రైతుల ఆత్మహత్యలను అదుపు చేశారు. రైతుల కోసం ఇంతగా చేసిన ప్రభుత్వాలు చరిత్రలో లేవు. దేశంలో ఏ రాష్ట్రంలో అమలు కానన్ని పథకాలు మన రాష్ట్రంలోనే అమలు అవుతున్నాయి. దేశం దృష్టి అంతా ఇప్పుడు తెలంగాణ పథకాల మీద పడింది. కర్ణాటక రాష్ట్ర సీఎం కుమారస్వామి సైతం తెలంగాణ పథకాలే తమకు ఆదర్శమన్నారు. రైతు బీమా పథకంపై రైతాంగానికి ఉద్దేశాలు, లక్ష్యాలు, లాబాలు, అమలు తీరుపై రైతులకు అవగాహన కల్పించాల్సిన బాధ్యత రైతు సమన్వయ సమితిలు, వ్యవసాయ విస్తరణాధికారులదేనన్నారు. వీళ్లంతా సమిష్టిగా పని చేసి రైతుల్లో చైతన్యం తీసుకురావాలన్నారు.

మయూరి పార్క్ సందర్శన


సమీక్ష అనంతరం మంత్రులు పోచారం శ్రీనివాస్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు, లకా్ష్మరెడ్డి, ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, గుత్తా సుఖేందర్ రెడ్డి, బండారి భాస్కర్ తదితరులు మహబూబ్‌నగర్ సమీపంలోని మయూరి పార్క్‌ను సందర్శించారు.

1519
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles