హోంసీడ్ నర్సరీల్లో 10వేల మొక్కలు పెంపకం

Fri,May 24, 2019 08:59 AM

10000 plants cultivation in homeseed nurseries


వికారాబాద్ : హరితహారంలో భాగంగా పరిగి మున్సిపల్‌ పరిధిలోని ప్రధాన రోడ్లు, ఇండ్లల్లో మొక్కలు నాటడానికి హోం నర్సరీలలో మొక్కల పెంపకానికి మున్సిపల్‌ శాఖ శ్రీకారం చుట్టింది. ఇందులో భాగంగా స్వయం సహాయక సంఘాల మహిళలచే మొక్కల పెంపకానికి మున్సిపల్‌ శాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ఇందు లో భాగంగా హోం సీడ్‌ నర్సరీలలో మొక్కల పెంపకం చేపట్టడం జరిగింది. కొత్తగా మున్సిపాలిటీగా ఏర్పడిన పరిగిలో 10 వేల మొక్కల పెంపకానికి అధికారులు నిర్ణయించడంతో మెప్మా ఆధ్వర్యంలో స్వయం సహాయక సంఘాల మహిళలు పరిగిలో వివిధ రకాల మొక్కల పెంపకం కోసం నర్సరీ ఏర్పాటు చేశారు. తమ ఇంటి ఆవరణలోనే ఈ మొక్కల పెంపకం చేపడుతున్నారు.

పట్టణంలోని స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో కొంతమంది మహిళలు సుమారు 10వేల మొక్కల పెంపకాన్ని చేపట్టడం జరిగింది. ఇందుకుగాను మున్సిపల్‌ అధికారులే ప్రత్యేకంగా మట్టిని తెప్పించడంతోపాటు కంపోస్టు ఎరువులు సైతం తెప్పించి ఇవ్వడం జరిగింది. మొక్కల పెంపకం చేపడుతున్న వారు స్వయంగా తమకు నచ్చిన మొక్కలకు సంబంధించిన విత్తనాలు తీసుకువచ్చి మొక్కల పెంపకం ప్రారంభించారు. హోంసీడ్‌ నర్సరీలలో మొక్కల పెంపకాన్ని ఎప్పటికపుడు మున్సిపల్‌ కమిషనర్‌ తేజిరెడ్డి, మెప్మా అధికారి శ్రీలతలు పర్యవేక్షిస్తున్నారు. మొక్కల పెంపకం చేపట్టడం మొదటిసారి కావడంతో సంబంధిత స్వయం సహాయక సంఘాల వారికి ప్రత్యేకంగా శిక్షణ ఇప్పించారు. మున్సిపల్‌ శాఖ ఆధ్వర్యంలో నగరంలో మొక్కల పెంపకంపై మొదట మహిళలకు ప్రత్యేక శిక్షణా తరగతులు నిర్వహించారు.

ఒక మొక్క రూ.10 అందజేసి కొనుగోలు


స్వయం సహాయక సంఘాల మహిళలు హోం సీడ్‌ నర్సరీలలో పెంచిన మొక్కలను మున్సిపాలిటీ వారు కొనుగోలు చేయడం జరుగుతుంది. ఒక్కో మొక్కను రూ.10 చెల్లించి కొనుగోలు చేస్తారు. ప్రస్తుతం పరిగిలో హోం సీడ్‌ నర్సరీ ద్వారా సుమారు 10వేల మొక్కల పెంపకం జరుగుతుంది. వాటిలో మునగ, కానుగ, చింత, ఉసిరి, మందార, గులాబి, తులసి తదితర రకాల మొక్కలను పెంచుతున్నారు.

మొక్కలు నాటేందుకు వీలుగా పెరిగిన తర్వాత మున్సిపాలిటీ వారు డబ్బులు చెల్లించి మొక్కలు కొనుగోలు చేస్తారు. ఈ మొక్కలను పరిగి పట్టణంలోని ప్రధాన రహదారుల వెంట నాటడంతోపాటు పెంపకం బాధ్యతలు స్వయంగా మున్సిపల్‌ వారు తీసుకుంటారు. అలాగే ఇంటింటికి అవసరమైన మొక్కలను సైతం ఉచితంగా అందజేస్తారు. తద్వారా ఇండ్లలోను మొక్కల పెంపకానికి ఈ మొక్కలు పంపిణీ చేయనున్నారు. ప్రభుత్వ నిర్దేశానుసారం తెలంగాణ హరితహారంలో భాగంగా ఈ మొక్కల పెంపకం కార్యక్రమం చేపడుతున్నారు. హోం సీడ్‌ నర్సరీలలో మొక్కల పెంపకంతో స్వయం సహాయక సంఘాల మహిళలకు ఉపాధి అవకాశాలు సైతం కలుగుతున్నాయి.

రోడ్ల వెంట మొక్కల పెంపకం


పరిగి పట్టణంలోని ప్రధాన రోడ్ల వెంట హరితహారంలో భాగంగా మొక్కల పెంపకం చేపడతాం. హోం సీడ్‌ నర్సరీలలో 10వేల మొ క్కల పెంపకం జరుగుతుంది. ఈ మొక్కలలో చక్కటి నీడను అందిం చే మొక్కలను పట్టణంలోని ప్రధాన రోడ్ల వెంట నాటించి పూర్తిస్థాయిలో అన్ని మొక్కలు ఏపుగా పెరిగేలా సంరక్షణ బాధ్యతలు సైతం తీసుకుంటాం. అలాగే ప్రతి ఇంటి ఆవరణలో మొక్కల పెంపకానికి సంబంధించి మొక్కలు అందజేయడం జరుగుతుంది. సంబంధిత వ్యక్తులు అడిగిన రకాల మొక్కలు పంపిణీ చేసేందుకు అవసరమైన చర్యలు తీసుకుంటాం.
- తేజిరెడ్డి(పరిగి మున్సిపల్‌ కమిషనర్‌)

923
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles