రామదాసు కీర్తనలతో మారుమోగిన పాలమూరు

Sun,July 29, 2018 08:58 PM

మహబూబ్‌నగర్ : పాలమూరు జిల్లా కేంద్రం ఆదివారం శ్రీరామదాసు కీర్తనలతో మార్మోగిపోయింది. స్వరలహరి కల్చరల్ అకాడమీ రజతోత్సవ వేడుకల సందర్భంగా తెలంగాణ రాష్ట్ర భాషా సాంస్కృతిక శాఖ సౌజన్యంతో మహబూబ్‌నగర్ ఎఎస్‌ఎస్ కన్వెన్షన్ హాలులో నిర్వహించిన ఈ కార్యక్రమానికి రాష్ట్రం నలుమూలల నుంచి గాయినీ, గాయకులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. వేయి మంది గాయినీ, గాయకులతో రామదాసు నవ సంకీర్తనాలహరి ఆలపించారు. స్వరలహరి కల్చరల్ అకాడమీ అధ్యక్షులు భాగన్నగౌడ్, మున్సిపల్ వైస్ చైర్మన్ రాములు తదితరులు వినాయకుడికి ప్రత్యేక పూజలు నిర్వహించి శ్రీ సీతారాముల చిత్రాలకు సైతం పూజలు చేసి కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. ప్రముఖ సాహిత్యవేత్త, పాఠ్యపుస్తకాల రూపకర్త పల్లెర్ల రాంమోహన్‌రావు వ్యాఖ్యానంతో కార్యక్రమాలు జరిగాయి.

రామదాసు కీర్తనలలో ఉన్న పద మాధుర్యం, మన జీవన శైలి, భక్తి భావాలకు సంబంధించిన అంశాలను గురించి వివరించారు. అనంతరం జరిగిన సహస్ర గళార్చనలో గాయినీ, గాయకులు ముందుగా తక్కువేమి మనకు రాముడొక్కడుండు వరకు అనే కీర్తనతో కార్యక్రమాన్ని ప్రారంభించారు. గాయినీ, గాయకులందరూ భక్తి భావాలు ఉట్టి పడగా మొత్తం 9 రామదాసు కీర్తనలను ఆలపించి కార్యక్రమానికి వన్నె తెచ్చారు. సంప్రదాయ దుస్తులు ధరించి భక్తి భావాలు ఉట్టి పడేలా ఈ కార్యక్రమం కొనసాగింది. ముఖ్య అతిథిగా హాజరైన ఎంపీ జితేందర్‌రెడ్డి పాలమూరు జిల్లా కేంద్రంలో ఇంత అద్భుత కార్యక్రమాన్ని నిర్వహించడం అభినందనీయమన్నారు. తెలంగాణ సంస్కృతీ, సంప్రదాయాలను కొనసాగించేలా మన భాషా ఔన్నత్యాన్ని దశ దిశలకు చాటేలా ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రపంచ తెలుగు మహాసభలను నిర్వహించి అభినందనలను అందుకున్నారన్నారు.

మన తెలంగాణ భాష, సంస్కృతీ సంప్రదాయాలను చాటే కార్యక్రమాలను నిర్వహించడంతోపాటు ఇటువంటి భక్తి భావాలను కలిగించే కార్యక్రమాలను అడపా, దడపా నిర్వహించాలన్నారు. రానున్న రోజుల్లో మహబూబ్‌నగర్ పట్టణంలో అన్నమాచార్యులు సంకీర్తన కార్యక్రమాలను నిర్వహించాలని సూచించారు. ఈ సందర్భంగా ఆయన్ను కార్యక్రమ నిర్వాహకులు ఘనంగా సన్మానించి జ్ఞాపికలను అందజేశారు. అనంతరం కార్యక్రమంలో సంగీత సహకారాలను అందించిన కళాకారులు, కార్యక్రమంలో పాల్గొన్న గాయినీ, గాయకులకు కార్యక్రమ నిర్వాహకులు జ్ఞాపికలను, ప్రశంసా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్‌పర్సన్ రాధాఅమర్, స్వరలహరి కల్చరల్ అకాడమీ కార్యక్రమ కన్వీనర్ గంగాపురం పవన్‌కుమార్ శర్మ, సభ్యులు మేకల శ్రీనివాసులు, డీకే ఆంజనేయులు, ప్రముఖ న్యాయవాది మనోహార్‌రెడ్డి, జేపీఎన్‌సీఈ చైర్మన్ రవికుమార్, టీఆర్‌ఎస్ జిల్లా అధ్యక్షుడు బాద్మి శివకుమార్ తదితరులు పాల్గొన్నారు.

1591
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles