15 నెలలు నదిలో ఉన్న ఐఫోన్.. అయినా పనిచేస్తోంది..!


Sat,September 28, 2019 07:01 PM

కాలిఫోర్నియా: సాధారణంగా వాటర్ రెసిస్టెన్స్ ఫీచర్ లేని ఫోన్లు నీటిలో పడితే అంతే సంగతులు. అవి ఇక ఏమాత్రం పనిచేయవు. కేవలం కొన్ని అరుదైన సందర్భాల్లో మాత్రమే ఆ ఫోన్లు పనిచేస్తాయి. అయితే అక్కడ కూడా సరిగ్గా ఇలాంటిదే ఓ సంఘటన చోటు చేసుకుంది. విహార యాత్ర చేస్తున్నప్పుడు ఓ మహిళ ఐఫోన్ నదిలో పడిపోయింది. దాంతో ఆమె ఆ ఫోన్‌పై ఆశలు వదులుకుంది. కానీ 15 నెలల తరువాత ఇప్పుడు అదే ఫోన్ ఓ వ్యక్తికి దొరికింది. ఇక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే.. ఆ ఫోన్ ఇప్పటికీ పనిచేస్తోంది..!

మైకేల్ బెన్నెట్ అనే ఓ యూట్యూబర్ నదుల్లో డైవింగ్ చేస్తూ నదీ గర్భంలో దొరికే విలువైన వస్తువులను, ఎవరైనా పోగొట్టుకునే వస్తువులను బయటకు తీస్తుంటాడు. ఈ క్రమంలోనే అతను ఇటీవలే సౌత్ కరోలినాలో ఉన్న ఎడిస్టో నదిలో డైవింగ్ చేయగా.. ఆ నది అడుగున అతనికి ఓ ఐఫోన్ దొరికింది. అయితే ఆ ఐఫోన్ రీచార్జబుల్ వాటర్‌ప్రూఫ్ కేస్‌లో ఉండడం వల్ల అది ఇప్పటికీ పనిచేస్తుండడం విశేషం. ఈ క్రమంలో బెన్నెట్ ముందుగా ఆ ఫోన్‌కు చార్జింగ్ పెట్టి ఆన్ చేశాడు. అయితే ఐఫోన్ కనుక దాన్ని పాస్‌కోడ్‌తో ఓపెన్ చేయాలి. కానీ ఆ కోడ్ అతనికి తెలియకపోవడంతో.. ఆ ఐఫోన్‌లో ఉన్న సిమ్‌ను తన ఫోన్‌లో వేసి కాంటాక్ట్‌లు వెదికాడు. ఓనర్ నంబర్ లభించింది. ఆ నంబర్‌కు కాల్ చేసి ఆ ఐఫోన్‌ను ఆ నదిలో పోగొట్టుకున్న ఎరికా అనే మహిళకు ఇచ్చేశాడు. దీంతో ఆమె ఆనందానికి అవధులు లేకుండా పోయాయి.2018 జూన్ 19వ తేదీన ఎరికా ఐఫోన్ ఆ నదిలో పడిపోగా.. సుమారుగా 15 నెలల తరువాత ఇప్పుడు ఆ ఫోన్ దొరకడంతో ఆమె అందులో ఉన్న ఫైల్స్‌ను తాను ప్రస్తుతం వాడుతున్న ఫోన్‌కు ట్రాన్స్‌ఫర్ చేసుకుంది. ఆ ఐఫోన్‌లో తన తండ్రి పంపిన పలు ఎస్‌ఎంఎస్‌లు, ఫొటోలు ఉన్నాయని, ఆయన ఇప్పుడు లేకపోవడంతో వాటిని ఆయన తీపి గుర్తులుగా దాచుకున్నానని, తనకు ఈ విషయం ఎంతో సంతోషాన్నిచ్చిందని ఎరికా తెలిపింది.

2265
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles