ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్‌లో గత ఫిబ్రవరి నెలలో పేమెంట్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చిన విషయం తెలిసిందే. దీంట్లో వాట్సాప్ యూజర్లు యూపీఐ విధానం ద్వారా నగదు ట్రాన్స్ఫర్ చేసుకునేందుకు వీలుంటుంది. అయితే వాట్సాప్‌లో లభిస్తున్న ఈ పేమెంట్స్ ఫీచర్ ను వాడుకునే యూజర్ల సమాచారం పట్ల ప్రస్తుతం అనేక సందేహాలు నెలకొన్నాయి. తాజాగా కేంబ్రిడ్జి అనలిటికా స్కాండల్ వెలుగులోకి వచ్చాక ఫేస్‌బుక్‌పై అందరూ విమర్శలు చేస్తున్నారు. యూజర్ల సమాచారం చోరీ అవడంతో ఆ సంస్థ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా విమర్శలను ఎదుర్కొంటున్నది. ఈ క్రమంలోనే ఫేస్‌బుక్‌కు చెందిన వాట్సాప్‌పై కూడా యూజర్ల డేటాకు సంబంధించి అనేక సందేహాలు వచ్చాయి. దీంతో ఈ విషయంపై వాట్సాప్ స్పందించింది. తమ యూజర్ల వాట్సాప్ సమాచారాన్ని తాము చాలా తక్కువగా కలెక్ట్ చేస్తామని, ఆ విషయంలో ఆందోళన అవసరం లేదని వాట్సాప్ ఇటీవలే ఒక ప్రకటనలో తెలియజేసింది. అయితే వాట్సాప్‌లో సమాచారాన్ని సేకరించడం అనే విషయానికి వస్తే.. ఇటీవలే లాంచ్ చేసిన పేమెంట్స్ ఫీచర్‌ను ఉపయోగించుకుంటున్న యూజర్ల సమాచారాన్ని కూడా వాట్సాప్ సేకరించి దాని మాతృసంస్థ ఫేస్‌బుక్‌తో ఆ సమాచారాన్ని పంచుకుంటున్నదని తెలిసింది. ఈ విషయం తాజాగా వెలుగులోకి వచ్చింది. వాట్సాప్‌లో పేమెంట్స్ ఫీచర్‌తో నగదు పంపుకునే యూజర్లకు చెందిన వర్చువల్ పేమెంట్ అడ్రస్‌లు, ఈ-మెయిల్ ఐడీలు, బ్యాంక్ అకౌంట్ వివరాలను వాట్సాప్ సేకరించి వాటిని ఫేస్‌బుక్‌తో పంచుకుంటున్నదని పలువురు నిర్దారించారు. ఈ విషయం సాక్షాత్తూ వాట్సాప్ ప్రైవసీ స్టేట్మెంట్లోనే ఉండడం గమనార్హం.
వాట్సాప్‌లో యూజర్ల సమాచారాన్ని సురక్షితంగా ఉంచడం కోసం, ఎలాంటి ఫ్రాడ్లు జరగకుండా సేఫ్టీ, సెక్యూరిటీని కల్పించడం కోసం యూజర్ల సమాచారాన్ని కలెక్ట్ చేసి థర్డ్ పార్టీ సర్వీస్ ప్రొవైడర్లలో ఒకటైన ఫేస్‌బుక్‌తో ఆ సమాచారాన్ని పంచుకుంటామని వాట్సాప్ ప్రైవసీ స్టేట్మెంట్లో స్పష్టంగా ఉంది. దీంతో ఇప్పుడు వాట్సాప్‌లో పేమెంట్స్ ఫీచర్‌ను వాడుకుంటున్న యూజర్ల సమాచారం కూడా ఫేస్బుక్ వద్ద ఉన్నదని నిపుణులు అభిప్రాయపడుతున్నారు. ఇదే విషయంపై మన దేశంలోని ఓ ప్రముఖ న్యూస్ చానల్ వాట్సాప్‌ను వివరణ కోరగా వారు స్పందించలేదు. ఏది ఏమైనా బ్యాంకులు, ప్రభుత్వానికి చెందిన మనీ ట్రాన్స్ఫర్ యాప్‌లు కూడా ఇలా వాట్సాప్, ఫోన్ పే, పేటీఎం లాంటి థర్డ్ పార్టీ యాప్‌లను నగదు ట్రాన్స్ఫర్ కోసం వాడే ముందు ఎవరైనా ఒకసారి ఆలోచించి మరీ ముందుకు సాగితే మంచిది. లేదంటే యూజర్ల సమాచారం చోరీ అయ్యేందుకు అవకాశం ఉంటుంది.