న్యూఢిల్లీ: నకిలీ వార్తలను అరికట్టే ఉద్దేశంతో ఇండియన్ యూజర్స్‌పై కొత్తగా కొన్ని పరిమితులు విధించింది వాట్సాప్. బుధవారం నుంచే ఈ పరిమితులు అమలు చేస్తున్నట్లు వాట్సాప్ వెల్లడించింది. ఇక నుంచి ఫార్వర్డ్ మెసేజ్‌ను ఐదుగురి కంటే ఎక్కువ మందికి పంపించే అవకాశం ఉండదని స్పష్టంచేసింది. దేశంలోని 20 కోట్ల మంది యూజర్లకు ఇవే పరిమితులు వర్తిస్తాయి. గత నెలలోనే ఈ ఐదు చాట్ల పరిమితిని ప్రారంభించబోతున్నట్లు వాట్సాప్ ప్రకటించిన విషయం తెలిసిందే. వాట్సాప్ లేటెస్ట్ వర్షన్ వాడే యూజర్లకు ఈ వారం నుంచే కొత్త పరిమితులు ప్రారంభమైనట్లు బుధవారం విడుదల చేసిన ఓ ప్రకటనలో కంపెనీ తెలిపింది. నకిలీ వార్తలను ఎలా గుర్తించాలి, వాటిని ఎలా నియంత్రించాలన్నదానిపై యూజర్లకు అవగాహన కలిగించేందుకు ఓ కొత్త వీడియోను కూడా పబ్లిష్ చేసింది.
మెసేజ్‌లకు ఫార్వర్డ్ లేబుల్ ఉండటంతోపాటు ఒరిజినల్ మెసేజ్‌ను ఎవరు సృష్టించారో తెలియని సందర్భాల్లో ఒకటికి రెండుసార్లు నిజానిజాలను చెక్ చేసుకోవాలని చెప్పేలా ఓ సందేశాత్మక వీడియోను విడుదల చేసినట్లు కూడా సంస్థ చెప్పింది. ప్రపంచవ్యాప్తంగా ఫార్వర్డ్ మెసేజ్‌లను గరిష్ఠంగా 20 మందికి పంపించుకునేలా వాట్సాప్ అవకాశం కల్పించింది. దీనిని ఇండియాలో మాత్రం ఐదుగురికే పరిమితం చేసింది. వాట్సాప్ ప్రైవేట్ మెసేజింగ్ యాప్‌గా ప్రజల ముందుకు వచ్చిందని, ఈ మార్పులు ద్వారా దానిని అలాగే ఉంచాలన్నదే తమ ఉద్దేశమని కంపెనీ స్పష్టంచేసింది.