ప్రముఖ ఇన్స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ గతంలో భారత్‌లోని వాట్సాప్ వినియోగదారులకు ఏదైనా ఒక మెసేజ్‌ను కేవలం 5 మందికి మాత్రమే ఫార్వార్డ్ చేసుకునేలా నిబంధనలు విధించిన విషయం విదితమే. అదే క్రమంలో ఒక మెసేజ్‌ను ఒక గ్రూప్‌లోని వ్యక్తులకు మాత్రమే ఫార్వార్డ్ చేసేలా కూడా వాట్సాప్ నిబంధనలను విధించింది. అయితే ఈ నిబంధనలు కేవలం భారత్‌లోని వాట్సాప్ యూజర్లకు మాత్రమే ఇప్పటి వరకు వర్తించాయి. కానీ ఇప్పుడు ప్రపంచ వ్యాప్తంగా ఉన్న యూజర్లకు వాట్సాప్ ఈ నిబంధనలను అమలు చేస్తున్నది. దీంతో ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఉన్న వాట్సాప్ యూజర్లు ఎవరైనా సరే.. ఒక మెసేజ్‌ను కేవలం 5 మందికి మాత్రమే ఫార్వార్డ్ చేసే వీలుంది. అంతకు మించితే మెసేజ్ ఫార్వార్డ్ కాదు. అలాగే ఏదైనా మెసేజ్‌ను ఫార్వార్డ్ చేస్తే దాన్ని అందుకునే వ్యక్తికి ఆ మెసేజ్‌పై భాగంలో ఫార్వార్డెడ్ అని కూడా కనిపిస్తుంది. కాగా యూజర్ల ఫీడ్ బ్యాక్ మేరకే తాము ఈ నిబంధనలను ప్రపంచ వ్యాప్తంగా అమలు చేస్తున్నామని వాట్సాప్ ప్రతినిధులు చెబుతున్నారు. దీని వల్ల తప్పుడు వార్తలు అంత సులభంగా ఎవరూ ప్రచారం చేయలేరని వారు అంటున్నారు.